కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 65. ఒక రోజు ఛాతీనొప్పి వస్తే పరీక్షించిన డాక్టర్లు సీఏబీజీ సర్జరీ చేయాలని అని చెప్పారు. సీఏబీజీ అంటే ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి.
- సరళ, భద్రాచలం
గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కీలకమైన ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు, రక్తసరఫరాలో అవరోధం కలగకుండా, సీఏబీజీ అనే సర్జరీ చేసి, రక్తాన్ని ఇతర మార్గాల్లో (బైపాస్ చేసిన మార్గంలో) గుండెకండరానికి అందేలా చేసే ఆపరేషనే సీఏబీజీ. మనం ఇంగ్లిష్‌లో సాధారణంగా బైపాస్ సర్జరీ అని పిలిచే దీన్ని వైద్యపరిభాషలో కరొనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అని వ్యవహరిస్తారు. దాని సంక్షిప్తరూపమే ఈ సీఏబీజీ ఆపరేషన్. ఇందులో కాళ్లు లేదా చేతులపై ఉన్న రక్తనాళాలను తీసి, గుండెకు అడ్డంకిగా ఏర్పడిన రక్తనాళాలకు ప్రత్యామ్నాయంగా, రక్తాన్ని బైపాస్ మార్గంలో అందించేలా అమర్చుతారు. సాధారణంగా ఒక బ్లాక్ (అడ్డంకి)ని బైపాస్ చేయాలంటే ఒక రక్తనాళం అవసరం. గుండె వద్ద ఉన్న రక్తనాళాన్ని నేరుగా బైపాస్ చేసే ప్రక్రియను రీ-వాస్క్యులరైజేషన్ అంటారు. ఛాతీకి కుడి, ఎడమ వైపున ఉన్న రక్తనాళాలను ఇంటర్నల్ మ్యామరీ ఆర్టరీ అంటారు. గుండెకు ఎడమవైపున ఉన్న నాళాన్ని లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ అర్టరీ అని అంటారు. ఈ రక్తనాళాన్ని బ్లాక్ అయిన నాళాల వద్ద బైపాస్ మార్గంలా కలుపుతారు. దీర్ఘకాల ప్రయోజనాలతో పాటు రోగి త్వరగా కోలుకుంటున్నందున ఇప్పుడు బైపాస్‌లోనూ సరికొత్త విధానాన్ని పాటిస్తున్నారు.
బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత, భవిష్యత్తులో ఇలా మార్చిన రక్తనాళాల్లోనూ కొవ్వు పేరుకోకుండా హృద్రోగులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రక్తనాళాల్లో పేరుకున్న బ్లాక్స్‌ను అధిగమించి, రక్తాన్ని గుండెకు చేరవేసేందుకు వీలుగా బైపాస్ సర్జరీ చేస్తారు. అంతే తప్ప ఇది చేయడం వల్ల అప్పటికే ఉన్న గుండెజబ్బు తొలగిపోయిందని పేషెంట్ అపోహ పడకూడదు. అందుకే రోగి మళ్లీ ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవే... రోగికి హైబీపీ ఉన్నట్లయితే దాన్ని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకునేలా డాక్టర్ సూచించిన మందులు తీసుకోవాలి. అలాగే రోగికి డయాబెటిస్ ఉంటే, రక్తంలోని చక్కెరపాళ్లు ఎల్లప్పుడూ అదుపులో ఉండేలా మందులు తీసుకుంటూ, కొవ్వులు తక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ఇక పొగతాగే అలవాటు ఉంటే దాన్ని తక్షణం పూర్తిగా మానేయాలి. డాక్టర్లు సూచించిన తగిన వ్యాయామాలు చేస్తూ ఉండాలి.
డాక్టర్ అనూజ్ కపాడియా
సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
సీఏబీజీ సర్జరీ అంటే మనం చెప్పుకునే బైపాస్ సర్జరీయే!
Published Mon, Jul 20 2015 12:01 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement