చిన్నారి చివరి కోరిక
పెద్ద పెద్దవాళ్లే మృత్యువు పేరు చెబితే కంగారుపడిపోతారు. అలాంటిది ఓ పదకొండేళ్ల పిల్లాడు... జీవించడం కంటే మరణించడం మేలు అంటున్నాడంటే అది ఎంత బాధాకరం! అందుకే రీస్ పుడ్డింగ్టన్ మాటలు విన్నవారంతా కళ్లనీళ్లు పెట్టుకుంటున్నారు.
బ్రిటన్‌కు చెందిన రీస్ వయసు పదకొండేళ్లు. ఐదేళ్ల వయసులో అతడికి అరుదైన క్యాన్సర్ సోకింది. తల్లి కే, తండ్రి పాల్‌లు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. చికిత్స చేయించి బిడ్డను బతికించుకున్నారు. కానీ దురదృష్టం... రీస్ శరీరంపై క్యాన్సర్ రెండోసారి దాడి చేసింది. ఈసారి కాలేయానికి, ఛాతీకి, తొడ ఎముకకు కూడా వ్యాధి సోకడంతో పరిస్థితి దిగజారింది. అతడిని కాపాడాలని వైద్యులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అంతలోనే రీస్ ఒక ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఇక వైద్యం అవసరం లేదని, చికిత్స తీసుకుని ఆ సైడ్ ఎఫెక్ట్స్‌తో ఇబ్బందులు పడేకంటే... చికిత్స ఆపేసి మరణించడమే మంచిదని అన్నాడు. అతడి మాటలకి తల్లిదండ్రులు, వైద్యులే కాదు... యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోయింది.
రీస్ కోసం చాలాకాలం క్రితమే సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లో ఒక అకౌంట్ తెరిచారు అతడి తల్లిదండ్రులు. అందులో రీస్ ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను తెలుపు తుంటాడు. తాజాగా తన ఈ నిర్ణయాన్ని తెలిపాడు. ‘‘అమ్మ నా కోసం ఏడుస్తోంది. నాన్న చాలా కష్టపడుతున్నారు. వాళ్లని చూస్తే బాధేస్తోంది. కానీ చికిత్స నన్ను అంతకంటే ఎక్కువ బాధపెడుతోంది. ఆ బాధలు ఇక నేను పడలేను. అందుకే ఇక ట్రీట్‌మెంట్ తీసుకోకూడదని నిర్ణయించు కున్నాను.
మరణాన్ని ఆహ్వానిస్తాను’’ అంటూ ఆ చిన్నారి రాసిన అక్షరాలు... వాటిని చదివిన లక్షల మంది కళ్లలో నీళ్లు నింపాయి. రీస్ బతకాలని అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. కానీ అది జరిగేది కాదని స్వయంగా అతడి తల్లే అంటోంది. రీస్ సంతోషం కోసం మనసు చంపుకుని అతడి నిర్ణయాన్ని సమర్థిస్తోందామె. చనిపోయే ముందు తన అభిమాన హీరో జానీ డెప్‌ని కలవాలని, తన తల్లి కారు నడుపుతుంటే చూడాలని ఆశపడుతున్నాడు రీస్. ఆ చిన్నారి కోరికలు నెరవేరాలని, అతడు ఆనందంగా జీవించాలని ఆశిద్దాం!