బాల్యమా! ఓ ప్రాణమా!! ఎక్కడున్నావ్‌? | Childrens Day special story | Sakshi
Sakshi News home page

బాల్యమా! ప్రాణమా!!

Published Wed, Nov 14 2018 1:34 AM | Last Updated on Wed, Nov 14 2018 12:02 PM

Childrens Day special story - Sakshi

బాల్యానికి గంతలు కట్టేస్తున్నారు.అలాగే అనిపిస్తోంది. అందరూ చెప్పేవాళ్లే కానీ.. జీవితాన్ని చూపించేవాళ్లు  తక్కువైపోయారు. చూపులేని వాళ్లను నడిపించినట్లు  నడిపిస్తున్నారే కానీ.. రెక్కలు కట్టి ఎగరమని చెప్పడం లేదు.  నిజానికి..  బాల్యం చెక్కినట్లు  జీవితాన్ని మరేదీ చెక్కలేదు.  బాల్యమా! ఓ ప్రాణమా!! ఎక్కడున్నావ్‌?

రేపటి పౌరులు మాత్రమేనా పిల్లలంటే! నేటి మన సంతోషానికి, నిన్నటి మన జ్ఞాపకాల చిరునవ్వులకు, రోజూ ఉదయాన్నే జీవితంపై ఆశతో మనం నిద్రలేవడానికి ఒక అర్థవంతమైన కారణం పిల్లలు. లోకం తీస్తున్న పరుగులన్నీ పిల్లల కోసమే. లోకం నిండా ప్రేమ ఉన్నది పిల్లలకు పంచడానికే. అక్షరాలున్నది పిల్లలకు  నేర్పించడానికే. మేడలు నిర్మిస్తున్నది పిల్లల సౌఖ్యానికే. పిల్లలు.. కుటుంబానికే కాదు, లోకం మొత్తానికే వెలుగు. వాళ్లొక్క నవ్వు నవ్వితే ప్రకృతి పరవళ్లు తొక్కుతుంది. వాళ్లొక్కమారు ఆడుకుంటూ గిర్రున తిరిగితే విశ్వాంతరాళమే వారి చుట్టూ పరిభ్రమిస్తుంది. వాళ్ల కళ్లలోని కాంతులను చూస్తే చుక్కలు చెలిమికొస్తాయి. చెయ్యిచాచి వాళ్లడిగితే చందమామయ్య అమ్మచేతి అద్దంలోకి వచ్చేస్తాడు. ఇల వాళ్లదే, కల వాళ్లదే. భువి వాళ్లదే. దివి వాళ్లదే.  రేపటి పౌరులు మాత్రమేనా పిల్లలంటే. పెద్దల్ని వాచ్‌ చేసేవాళ్లు, పెద్దలకు టీచ్‌ చేసేవాళ్లు కూడా. ఎన్ని తెలిసిన జ్ఞానికైనా, ఒకటేదో మిగిలే ఉంటుంది పిల్లల్నుంచి చేర్చుకోడానికి! ఏమీ తెలియనివారిక్కూడా.. ధైర్యమూ, దారీ ఇచ్చే సంకేతమేదో పిల్లల మాటల్లో దొరుకుతుంది. ‘ఔట్‌ డేటెడ్‌’లను నడిపిస్తారు. ‘అప్‌డేట్‌’లను కూడా అప్‌గ్రేడ్‌ చేస్తారు! 

జవహర్‌లాల్‌ నెహ్రూ అనే ఓ పిల్లాడుండేవాడు. పెద్దయ్యాక దేశ ప్రధాని అయ్యాడు. ప్రధాని అయ్యాక కూడా పిల్లల్తో ఆడాడు. పాడాడు. చాక్లెట్లిచ్చాడు. ఆయనకీ తెలీదు తన పుట్టినరోజు ఏదో ఒక నాటికి ‘పిల్లల రోజు’ అవుతుందని. అయింది. పిల్లలే ఆయనకిచ్చిన కానుక ‘చిల్డ్రన్స్‌ డే’. పిల్లలు ఏదీ ఉంచుకోరు. వెంటనే పంచుకుంటారు! కానీ మనం చేస్తున్నదేమిటి? పిల్లల కోసం బాల్యాన్ని కొద్దిగానైనా మిగల్చడం లేదు. చేస్తున్నదంతా వాళ్ల మంచి కోసమే. వాళ్ల ఫ్యూచర్‌ని చక్కగా ప్లాన్‌ చేస్తాం. కానీ వాళ్ల ప్రెజర్‌ని పట్టించుకోం. విజ్ఞానవంతుల్ని చేయాలని చూస్తాం. వికాసం కోసం చూడం. ఎదుగుతున్నారనే అనుకుంటాం.. లోలోపల గుదులుకుంటున్నారేమోనని చూడం. మన కలల్ని వాళ్లు నెరవేర్చాలని కోరుకుంటాం. వాళ్లకొచ్చే పీడకలల్ని అర్థం చేసుకోం. అన్నీ ఇస్తాం. అనుబంధాలను ఇవ్వం.ఆడుకోమంటాం.ప్లేగ్రౌండ్‌ ఇవ్వం. ఇంత హింసేమిటి? బట్టీల్లో, కర్మాగారాల్లో కనిపించే బాలల వెట్టిచాకిరీ మాత్రమే మనకు హింసగా కనిపిస్తుంది. ఇంట్లో, స్కూల్లో పెట్టే హింస కనిపించదు. చైల్డ్‌ లేబర్‌ని, చైల్డ్‌ ట్రాఫికింగ్‌ని, చైల్డ్‌ హెరాస్‌మెంట్‌ని, చైల్డ్‌ అబ్యూజ్‌ని అరికట్టే చట్టాలు ఉన్నాయి. ప్రయోజకుల్ని చేసే లక్ష్యంతో.. ఎదుగుతున్న మొగ్గల్ని చిదిమేసే హింసను అరికట్టేందుకు ఏ చట్టం ఉంది? పిల్లలకు ఎంతో ఎక్కువ చేస్తున్నాం అనుకుంటున్న మనం.. తక్కువ చేస్తున్నదేమిటో కూడా ఈ బాలల దినోత్సవం రోజు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. 

డిజి  బిజి
ఓ ముప్పయ్‌ ఏళ్ల కిందట... పిల్లలు గ్రౌండ్‌లో ఆటల్లో మునిగిపోతే, సాయంత్రం దాటి చీకట్లు ముసురుకుంటున్నా ఇల్లు గుర్తుకు వచ్చేది కాదు. ‘ఇక ఆడుకున్నది చాలు. ఇళ్లకు వెళ్లండి’ అని ఆ దారిన వెళ్లే పెద్దవాళ్లు ఎవరో కోప్పడే వరకు ఆటలు ఆగవు. మరీ గడుగ్గాయిలైతే... వాళ్లను వెతుక్కుంటూ తల్లులు రావాలి, చెవులు మెలేసి ఇంటికి లాక్కెళ్లాల్సిందే. సంతోషాలు రాశిపోసిన బాల్యం అది. ఆనందం చిందిన బాల్యం అది. ఆరోగ్యం నిండిన బాల్యం అది. గడిచిన తరాలు అనుభవించిన సృజనాత్మకమైన బాల్యం అది. ఈ తరానికి తెలిసిన బాల్యం ఎలక్ట్రానిక్‌ బాల్యం.  ఇంట్లో ఉన్న ముగ్గురు మనుషులూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే రోజు గడిచిపోయే కాలమిది. అమ్మానాన్నలు ఎవరి ల్యాప్‌టాప్‌లో వాళ్లు, ఎవరి స్మార్ట్‌ఫోన్‌లో వాళ్లు మునిగిపోతున్నారు. పిల్లలు కంప్యూటర్‌లో హారర్‌ షోలతో ఉత్కంఠకు గురవుతుంటారు. టామ్‌ అండ్‌ జెర్రీ చూస్తూ కసిగా నవ్వుకుంటుంటారు. ఏడిపించి నవ్వడంలో ఆనందాన్ని వెతుక్కుంటుంటారు.  ఈ తరానికి గేమ్స్‌ అంటే వీడియో గేమ్సే, కదలకుండా కూర్చుని మెడ వంచేసి, వత్తులేసుకున్నట్లు కళ్లు తెరుచుకుని గంటల కొద్దీ గడపడమే వాళ్లకు తెలిసిన ఆటలు. బాల గేయాలంటే సీడీలు ప్లే చేసి ‘చిట్టి చిలకమ్మ’ను చూడడమే తప్ప నోరు తెరిచి ఆలపించాలనే ఆలోచనే ఉండడం లేదు. ల్యాప్‌టాప్, యూ ట్యూబ్, స్మార్ట్‌ ఫోన్, వీడియోగేమ్స్‌లో కుదురుకుపోతున్నారు తప్ప ఒళ్లు కదిలించే ఆటల వైపే చూడడం లేదు. గది నిండా ఎలక్ట్రానికి డివైజ్‌లు. వాటిని ప్లే చేసే ఓ ప్రాణమున్న డివైజ్‌. ఇదే ఈ తరం ఎంజాయ్‌ చేస్తున్న ‘ఈ– బాల్యం’. అంతంత సేపు స్క్రీన్‌ చూస్తే చూపు పోతుందని కోప్పడితే, రిమోట్‌తో డ్రోన్‌ను ఎగిరిస్తారు. బయటకు వెళ్లి ఆడుకోమంటే... జేబు నిండా డబ్బులేసుకుని ప్లే స్టేషన్‌కెళ్లి బంపింగ్‌కార్స్‌తో ఢీ కొట్టుకోవడమే నేటి తరం ఆనందిస్తున్న ఆట. ఈ మోడరన్‌ టెక్‌ లైఫ్‌లో ‘నో ఫుడ్‌ డే’ ఉంటుందేమో కానీ ‘నో టెక్‌ డివైజ్‌ డే’ ఉండదు. డే మొత్తం కాదు ఓ గంట కూడా స్క్రీన్‌కు దూరంగా... తనకు తానుగా మెదడు పెట్టి, మనసుతో గడపలేకపోతోంది ఈ హైటెక్‌ జనరేషన్‌. సాంకేతికాభివృద్ధి మనిషి జీవితాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఉపయోగపడాలి.మనిషిని మరబొమ్మలా చేయకూడదు. నిజానికి అన్నింటికీ నెపాన్ని పిల్లల మీద తోసేస్తారు, కానీ వాళ్లు ఇలా మారడానికి మూలం ఏమై ఉండాలి?‘జో అచ్యుతానంద జోజో ముకుందా...’ అమ్మ ఒడిలో పడుకుని పాట వింటూ నిద్రలోకి జారిపోతుంది ఏడాది పాపాయి.  ఆ పాటను అమ్మ పాడడం లేదు. పక్కనే స్మార్ట్‌ఫోన్‌లో పాట పెట్టేసి పాపాయిని ఒడిలోకి తీసుకుని జో కొడుతుందంతే. అమ్మ గొంతు వినడమే బిడ్డకు భరోసా అని, అమ్మ శ్రావ్యంగా పాడకపోయినా... పాట బాగాలేదని పాపాయి ముఖం చిట్లించదని ఆ అమ్మకు తెలియాలి. తాను జోల పాడి నిద్ర పుచ్చితే, తాను ‘చిట్టి చిలకమ్మ’ అని పలుకుతూ పాపాయికి నేర్పిస్తే... పాపాయి కూడా తన ఆట తాను ఆడుకుంటుంది. తన పాట తాను పాడుకుంటుంది. అది లేకపోతే ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు ప్లే చేయడం మాత్రమే నేర్చుకుంటుంది. తనలో క్రియేటివిటీ ఉందన్న సంగతి కూడా తెలియకుండానే పెద్దదయిపోతుంది. అందుకే... అమ్మలూ! జోల పాడండి, పాపాయికి తాను పాట వినడమే కాదు, పాడాలి కూడా అని తెలిసేలా పెంచండి. సృజనాత్మకతతో వికసించాల్సిన రేపటి తరాన్ని టెక్‌ సీలో ముంచవద్దు.
అమ్మ, నాన్న, ఓ బిడ్డ, నాలుగు స్మార్ట్ఫోన్‌లు,  ఓ టాబ్లెట్, ల్యాప్‌టాప్‌... ఇదీ ఇప్పటి కుటుంబ ముఖచిత్రం. 

బాల్య  సంబంధాలు
నాన్న కోప్పడితే వెళ్లి బాబాయి వీపు వెనుక దాక్కోవడానికి లేదు. లేదా నాన్న భయం లేదని తెలిస్తే బాబాయ్‌తో చెప్తానుండు అని అనడానికీ లేదు. తాతయ్య బజారు నుంచి వస్తూ వస్తూ చేసంచిలో కారాబూందీ పొట్లం కట్టించుకొని వచ్చి, మంచం మీద కూచుంటూ పిలిచి, బుగ్గలు పుణికి దానిని చేతిలో పెడితే, తీసుకుని తింటున్నప్పుడు తాతయ్య నవ్వే నవ్వు చూడ్డానికి లేదు. విసుక్కునే అమ్మను మందలించి దగ్గరకు తీసుకునే నానమ్మ ఒడి లేదు. ‘జామకాయలు కోద్దాం రా’ అని ఉప్పు మూట ఎక్కించుకుని పెరట్లో ఆటలాడే పిన్ని వాత్సల్యం లేదు. ఉన్న అనుబంధాలు పరిమితమైపోయాయి. ప్రతి ఇంట్లో అమ్మా నాన్న అన్న లేదా చెల్లి. నలుగురు మనుషుల కుటుంబంలో అనుబంధపు తీపి తెలుస్తున్నదా నేటి బాల్యానికి. నిన్న మొన్నటి వరకూ కనీసం సెలవుల్లో పెదనాన్న ఇంటికి వెళతాము, మేనమామ ఇంటికి వెళతాము అని అనేవారు. వెళ్లేవారు. ఇప్పుడు వెళ్లినా భరించే స్థితిలో బంధువులు ఉండటం లేదు. రోజులకు రోజులు అట్టి పెట్టుకునే ఓపిక ఉండటం లేదు. వీలు ఉండటం లేదు. బతుకులు బాదరబందీలో చెదిరిన బంధాలలో బాల్యం చాలా విలువైన అనుబంధాలను మిస్‌ అవుతూ ఉంది. ‘మనవాళ్లు’ అనే భావన ఎప్పుడూ పిల్లలకు భద్రతను ఇస్తుంది. నన్ను ప్రేమించే నా వాళ్లు ఉన్నారని రక్త సంబంధీకులను చూసి పిల్లలు సంబర పడతారు. ఉత్సాహ పడతారు. పిల్లలకు కజిన్స్‌ మొదటి స్నేహితులవుతారు. వారి రహస్యాలు పంచుకునే నేస్తులవుతారు. అలకలు, అసంతృప్తులు, కోపాలు, తాపాలు, పిల్లలు మాత్రమే ఆశించే కోరికలు ఇవన్నీ ఒట్టి అమ్మానాన్నల వల్ల తీరిపోవు. వారి ఒక్కరి సమక్షం చాలదు. బంధువులు కావాలి. రక్తసంబంధీకులు కావాలి. బాల్యం డొల్ల కాకుండా తన వారితో కూడిన జ్ఞాపకాలను వారిలో కూరాలి. వేరుగా ఉండొచ్చు కాని వేరుగా ఉంటూ కూడా పిల్లలకు పరస్పరం అనుసంధానం అవుతున్నామా అని నేటి కుటుంబాలు ఆలోచించాలి. ఇరుగు పొరుగు మీద హక్కు ఉండదు.స్నేహితుల మీద డిమాండ్‌ ఉండదు. కాని రక్త సంబంధీకులను నిలదీయవచ్చు. మంచిలో చెడులో భాగానికి పిలుపియ్యవచ్చు. అవి లేని ఒంటరివాళ్లుగా పిల్లలను మారుస్తున్నామేమో ఆలోచించాలి. పిల్లలు అడిగితే బర్గర్‌ చేతిలో పెడుతున్న తల్లిదండ్రులు ఒక బంధాన్ని చేతికి దారంలా చుడుతున్నారా? ఆలోచిద్దామా?
వేరుగా ఉంటూ కూడా పిల్లలకు పరస్పరం అనుసంధానం అవుతున్నామా అని నేటి కుటుంబాలు ఆలోచించాలి. 

కలలు కూడా దోచుకునే...
సినిమాకు వెళ్లాలంటే పెద్ద పథకం. నాన్న పర్మిషన్‌ అడగాలి. అమ్మకు వీలు కుదరాలి. పోపులడబ్బాలో డబ్బులు ఉండాలి.  ఇంటర్‌వెల్‌లో గోల్డ్‌స్పాట్‌ తాగడం కోసం వారం రోజులుగా పోగేసిన చిల్లర జేబుల్లో ఉంటుంది. మసాలా వడలు, పునుగులు న్యూస్‌ పేపర్‌ కాగితంలో పట్టుకుని తింటూ సినిమా చూస్తుంటే మజా వస్తుంది. మరుసటి రోజు స్కూల్లో స్నేహితులకు ‘నేను నిన్న సినిమా చూశాను తెలుసా’ అని చెప్తే గొప్ప వస్తుంది. పిల్లలకు అతి చవకైన వినోదం సినిమా. తల్లిదండ్రులు కూడా సినిమా బడ్జెట్‌ను పెద్ద బడ్జెట్‌గా చూసేవారు కాదు. రోజువారి బాదరబందీలో పిల్లలతో సినిమాకు వెళ్లడం వారికీ ఓ ఆటవిడుపు. కాని ఇవాళ సినిమా వ్యవహారం మారిపోయింది. సింగిల్‌ స్క్రీన్స్‌ పోయాయి. మల్టీప్లెక్సులు వచ్చాయి. రేట్లు ఖరీదయ్యాయి. పాప్‌కార్న్‌ ప్యాకెట్, కూల్‌డ్రింక్‌ ధర టికెట్‌ కంటే ఎక్కువగా ఉంటుంది.ఒక కుటుంబం ఒకసారి సినిమాకు వెళ్లాలంటే పెద్ద ఖర్చు అవుతుంది. దాని వల్ల తల్లిదండ్రులు సినిమాకు వెళ్లడాన్ని నిరుత్సాహపరుస్తున్నారు.పిల్లలు ఒక ముఖ్యమైన ఆనందాన్ని మిస్‌ అవుతున్నారు.‘కలలు కూడా దోచుకునే దొరలు ఎందుకు’ అని ఒక సినిమాలో కవి అన్నాడు. పిల్లలకు రంగుల కలలు ఇచ్చే సినిమాను కూడా దూరం చేసే దొంగలు ఎవరో మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? వాల్‌పోస్టర్లు చూసి ఇమాజినేషన్‌లోకి వెళ్లగలిగిన క్రియేటివిటీని చిదిమేస్తున్నాం. ప్రభుత్వాలు పార్కులు కట్టడం లేదు. స్కూళ్లలో ప్లేగ్రౌండ్‌లు ఉండటం లేదు. వీధుల్లో ట్రాఫిక్‌. ఆటలు దూరమైన పిల్లలు కోరే కనీస వినోదం, బయటకు వెళ్లే వీలు సినిమా. అది కూడా తప్పించి టీవీ లేదా ఫోన్‌లో వారికి దొరికింది చూసే వీలు కల్పిస్తూ కంటి జబ్బులకు కారణం అవుతున్నాం. సినిమా బాల్యంలో ఒక ముఖ్య జ్ఞాపకం. ఇవాళ ఎంతమంది పిల్లలకు ఆ జ్ఞాపకం ఉంటోంది?
కత్తి యుద్ధాలు చేసే హీరోను చూసి ఇంటికొచ్చి చీపురుపుల్లలు పట్టుకునేవారు. టేప్‌ రికార్డుల్లో పాట వస్తుంటే డాన్స్‌ చేసేవారు

అటకెక్కిన ఆటలు
చింటూ ఫస్ట్‌ క్లాస్‌ చదువుతున్నాడు. ఆ రోజు చింటూకి చాలా సంతోషంగా ఉంది. అమ్మనాన్నలతో కలిసి సినిమాకు వెళ్లాడు. బయట ఐస్‌క్రీమ్‌ ఇప్పించాడు నాన్న. ఇంటికి వచ్చేటప్పుడు దారిలో క్రికెట్‌ బ్యాట్, బాల్‌ కొనిచ్చాడు. బ్యాట్‌ పట్టుకోగానే చింటూ ముఖం మతాబులా వెలిగిపోయింది. బ్యాట్‌ని ఎడమచేత్తో ఛాతీమీదుగా గట్టిగా పట్టుకున్నాడు. బాల్‌ని షర్ట్‌ జేబులో కుక్కుతుంటే ‘జేబు చిరుగుతుందిరా! నే పట్టుకుంటా’ అని తల్లి అంటే ‘ఊహూ..’ అని తల అడ్డంగా ఊపి, ఆ రెంటినీ తనే గట్టిగా పట్టుకున్నాడు. అమ్మనాన్నలతో ఉన్నా చింటూ ధ్యాసంతా ఇంటి దగ్గర బంటి, చిన్ను, మున్నాలతో కలిసి ఎప్పుడెప్పుడు క్రికెట్‌ ఆడుకుంటానా ఉంది. ఇంటికి చేరుకునే సరికి చీకటి పడింది. తల్లిదండ్రి వారిస్తున్నా తన స్నేహితుల ఇళ్లవైపు పరిగెత్తాడు. ‘ఇప్పుడెక్కడ ఆడుకుంటారు.. రేప్పొద్దున రా!’ అనడంతో గ్రౌండ్‌లో ఔట్‌ అయిన బ్యాట్స్‌మెన్‌లో బ్యాట్‌ను చంకలో పెట్టుకొని దిగాలుగా ఇంటి ముఖం పట్టాడు. ‘రేపు సండే స్కూల్‌ లేదుగా ఎంచక్కా ఆడుకోవచ్చు’ అని తల్లి చెప్పడంతో మురిపెంగా ఆ రాత్రి బ్యాట్‌ని పక్కనే పెట్టుకొని పడుకున్నాడు రేపటి ఆటను కలగంటూ! తెల్లారి చింటు.. మున్నా, బంటి బ్యాట్‌కి పనిచెబుతూ కేరింతలు కొడుతున్నారు. ‘ఏంటా అల్లరి..? కాస్త పక్కకెళ్లి ఆడుకోండి..’ గద్దించాడు ఎదురింటి పెద్దమనిషి. రెండు బాల్స్‌ వేశారో లేదో ‘ఏం ఆటల్రా.. కాళ్లకు అడ్డంపడుతూ మమ్మల్ని పడేసేట్టున్నారు అరిచేసింది పక్కింటి ఆంటీ. ఇంతలో చిన్ను బ్యాట్‌తో బాల్‌ని కొడితే అది కాస్తా ఎదురింటి కిటికీకి తగిలి అద్దం పగిలింది.అంతే, ఆ ఇంటి వాళ్లతో పెద్ద గొడవ అవడంతో  కోపం వచ్చి చింటూను నాలుగు బాదింది తల్లి. ‘పోయిన వారం ఇలాగే వాలీబాల్‌ అంటూ తీసుకొచ్చారు. ఆ బాల్‌తో ఆడుకుంటూ ఎదురుగా వచ్చే వెహికిల్‌ను చూసుకోలేదు. కాస్తయితే, ఆ వెహికిల్‌ కింద పడేవాడే. ఇప్పుడు చూడండి..’ అంటూ భర్తను కోప్పడి చింటూని ఇంట్లోకి లాక్కెళ్లి కూర్చోబెట్టింది. ఏడుస్తూ ఆ రోజంతా ఇంట్లోనే ఉండిపోయాడు చింటూ. మరుసటి రోజు ఇంట్లో ఆడుకుంటే బాల్‌ వెళ్లి సామాన్లకు తగిలి, అవి పగిలిపోతున్నాయని కొట్టింది. చింటు సైకిల్‌ కూడా బయట తొక్కడానికి లేదు. ఎటు నుంచి ఏ వెహికిల్‌ వస్తుందో అని అమ్మ భయపడుతుంది. ఇంట్లో తొక్కే స్థలం ఉండదు. అప్పుడప్పుడు ఆ సైకిల్‌ మీద కాసేపు కూర్చుంటాడు అంతే! చుట్టూ అపార్ట్‌మెంట్లు. ఇరుకిరుకుగా ఉండే ఇళ్లు. గజం స్థలం దొరికినా డజన్‌ ఇండ్లు కట్టేస్తున్న రోజులివి. తల్లి ఈ మధ్య ఓ కొత్త ఉపాయం కనిపెట్టింది. చింటూ ఉదయం ఏడున్నరకు స్కూల్‌కి వెళితే ఇంటికి వచ్చేసరికి నాలుగు దాటిపోతుంది. రాగానే బట్టలు మార్చి పాలు, స్నాక్స్‌ ఇస్తుంది. ఐదు నుంచి ఏడు గంటల వరకు ట్యూషన్‌లో చేర్చితే సరి. చింటూ ఆటలకు, అల్లరికి ట్యూషన్‌ చెక్‌ పెట్టేసింది. ట్యూషన్‌ నుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మ టీవీ చూస్తూ ఉంటుంది. అమ్మ స్మార్ట్‌ ఫోన్‌లో చింటు గేమ్స్‌ ఆడుకుంటూ ఆమె పక్కనే కూర్చుంటాడు. ఇప్పుడు అమ్మకు నిశ్చింతగా ఉంది. పిల్లవాడు ఎటూ పోవడం లేదు. స్కూల్, ఇల్లు. ఇప్పుడు ఎవరితోనూ గొడవలు లేవు. ఉదయాన్నే బద్దకంగా లేచిన చింటూ టైమ్‌ అయిపోతుందనే హడావుడిలో రెడీ అవుతుంటాడు. పుస్తకాల సంచి భుజాలకు తగిలించుకొని, పాలిష్‌ చేసిన షూస్‌ వేసుకొని, వాటర్‌ బాటిల్‌ని మెడకు వేసుకొని.. స్కూల్‌ బస్సు ఎక్కేస్తాడు. మళ్లీ సాయంత్రం ఇంటికి చేరుకుంటాడు. అటు నుంచి ట్యూషన్‌కి, ఆ తర్వాత ఇంటికి. సైకిల్‌ తొక్కడం లేదని కాళ్లకు అడ్డుగా ఉందని అమ్మ దాన్ని అటకమీదకు చేర్చింది. దాని పక్కనే ఇప్పుడు బ్యాట్‌ కూడా చేరిపోయింది. ఆ పక్కనే దుమ్ము కొట్టుకుపోయిన రెండు బాల్స్‌.. చింటూవైపు దిగాలుగా చూస్తూ ఉన్నాయి ఎప్పుడు చింటూ చేతిలో తమకు ఊపిరి ఆడుతుందో అని. చింటూ ఒక్కడే కాదు బంటి, మున్నా, చిన్ను.. ఇప్పుడు ఎంతో మంది పిల్లల జీవిత పుస్తకంలో బాల్యం పేజీ ఆటల్లేక రెపరెపలాడుతోంది
పిల్లలకు కావల్సిన ఆటవస్తువులు అయితే కొనగలుగుతున్నారు. కానీ, వాటితో ఆ పిల్లలను ఫ్రీగా ఆడుకోవాల్సినంత మైదానాన్ని ఎలా ఇవ్వగలరు. 

గుడి బడి  గుర్తుందా?
చిన్నప్పుడు శ్రీరామ నవమికి పందిళ్లలో స్నేహితులతో తాగిన తియ్యటి పానకం గుర్తుందా? నానమ్మలు, అమ్మమ్మలు చెప్పిన దేవతలు, రాక్షసుల కథలు గుర్తున్నాయా? పరీక్షలప్పుడు పొద్దున్నే లేచి స్నానం చేసి గుడికెళ్లి కొబ్బరికాయ కొట్టి ఫస్టు మార్కు రావాలని మొక్కుకోవడం జ్ఞాపకమేనా? టీవీలో చూసిన రామాయణం, మహాభారతం, బడిలో వ్యాస రచనకో, వక్తృత్వానికో బహుమతిగా ఇచ్చిన బొమ్మల భాగవతం, ధృవచరిత్ర, భక్త మార్కండేయ పుస్తకాల జ్ఞాపకాల పుటలు ఇప్పటికీ తెరుచుకునే ఉన్నాయా? సంపూర్ణ రామాయణం సినిమాలో సీతమ్మవారిని రావణాసురుడు ఎత్తికెళ్లిపోయే సీను చూసి ఏడ్చిన జ్ఞాపకం ఇంకా పచ్చిగానే అనిపిస్తోంది కదా! దేవుళ్లకీ కష్టాలు తప్పవనీ, అయితే అవి ఎంతోకాలం ఉండవనీ, రాక్షసులు, దుర్మార్గులు చివరికి చావక తప్పదనీ పుస్తకాలలో చదివిన, సినిమాలలో చూసిన ఘట్టాలు గుర్తుండే ఉంటాయి కదా! కృష్ణాష్టమి వేడుకలలో ఉట్టి కొట్టడం, హనుమజ్జయంతికి ఉపవాసాలుండి కొబ్బరి కాయలు కొట్టి, బోలెడంత బలం వస్తుందని గట్టిగా నమ్మడం, ఆంజనేయస్వామి అంత మహాసముద్రం మీదుగా ఎగురుకుంటూ లంకకు చేరడం, తోకతో నిప్పంటించటం... ఇవన్నీ మన బాల్యజ్ఞాపకాలు కదా... అవి ఎంత బలాన్నిచ్చేవి. మానసికంగా ఎంత ధైర్యాన్ని నూరిపోసేవి! జబ్బు చేస్తే తగ్గిపోవాలని మొక్కుకోవడం, ఆ తర్వాత కుటుంబమంతా కలసి తిరుపతి కొండకో, అన్నవరానికో వెళ్లి మొక్కు తీర్చుకుని రావడం ఎంత చేదు, తీపి కలగలసిన జ్ఞాపకం? ఇప్పుడవన్నీ ఏవి? ప్రసాదం కోసం గుడికెళ్లడం, ప్రసాదంతోనే పొట్ట నింపుకోవడం, గణపతి నవరాత్రుళ్లలో భజన బృందాలతో గొంతు కలపడం, గుళ్లో పాడటం కోసం పొద్దున్నే లేచి త్యాగరాజు, అన్నమయ్య కృతులు సాధన చేయడం తలచుకుంటుంటే ఇప్పటికీ గొంతులోనుంచి తొంగి చూసే ఆ గమకాలను ఆపగలమా? మైకులో భగవద్గీత శ్లోకాలు పాడటం, పీర్ల పండుగప్పుడు స్నానాలు చేసి పీర్లు పట్టుకుని భక్తితో ఊగిపోతూ గుండాలు తొక్కుతుంటే కళ్లు ఇంతింత చేసుకుని చూడటం, రంజానుకు స్నేహితులు తెచ్చిన ఖీర్‌ తాగిన తియ్యటి జ్ఞాపకం, క్రిస్టమస్‌ పండక్కి భక్తిగీతాలు పాడటం, క్రిస్టమస్‌ ట్రీ తయారు చేయడం... ఇవన్నీ ఇప్పుడేమైనాయి? జ్వరం వచ్చినప్పుడు గుళ్లో పూజారిగారు నీకేం కాదురా, రేప్పొద్దుటికల్లా తగ్గిపోతుంది పో అంటూ విభూతి పెడితే తెల్లారేసరికి జ్వరం జారిపోవడం ఎంత నమ్మకం కలిగించేది?  ఆధ్యాత్మికతలు ఎప్పుడూ మంచి భావనలనే పాదుకొల్పుతాయి. మన ప్రయత్నం మనం చేద్దాం.. ఆ తర్వాత అన్నిటినీ ఆ పై వాడున్నాడనే ధైర్యం ఓ టానిక్కు. చెయ్యరాని పనులు చేస్తే  కళ్లు పోతాయి అనే భయం ఉంటే చెడ్డపనుల జోలికి పోతారా ఎవరైనా?
బాల్యం నుంచి భక్తిగా, ఆధ్యాత్మిక వాతావరణంలో పదిమందితో కలిసి మెలిసి తిరిగితే అదెంత బలం? ఎంత ధైర్యం?

బిట్టర్‌ చాక్లెట్‌
‘‘ఎందుకలా ఉన్నావ్‌?’’ పన్నెండేళ్ల భూదేవి అడిగింది బాల సదన్‌ చూరు కింద అరుగు మీద దిగాలుగా కూర్చున్న ఆకాశ్‌తో. వాడికీ  పదకొండు, పన్నెండేళ్లుంటాయేమో!‘‘ప్చ్‌.. ’’అన్నాడు నిర్లిప్తంగా చేతిలో ఉన్న రేపర్‌తియ్యని చాక్‌లెట్‌ను అటూఇటూ తిప్పుతూ.‘‘ప్చ్‌.. అంటే’’ అంది ఆకాశ్‌ పక్కనే కూర్చుంటూ. ‘‘ఏం లేదు’’అని తన పక్కనే కూర్చున్న ఆమెను అయోమయంగా చూస్తూ అన్నాడు.‘‘ఆ చాక్‌లెట్‌ ఎవరు ఇచ్చారు?’’ మళ్లీ ప్రశ్న భూదేవి నుంచి.‘‘కావాలా.. తీసుకో’’ అంటూ ఇవ్వబోతుంటే ‘‘నా దగ్గరా ఉంది..’’కుర్తీ జేబులోంచి తీస్తూ చూపించింది. ‘‘కొత్తగా జాయినయ్యావా? ఎవరు తీసుకొచ్చారు?’’ అడిగాడు ఆసక్తిగా.ఈసారి ఆ అమ్మాయి జవాబు చెప్పకుండా దిక్కులు చూసింది. ‘‘ఇప్పుడే కనిపిసున్నావైతే అడిగా.. ’’ ఆకాశ్‌. అయినా ఆమె నుంచి సమాధానం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆచాక్‌లెట్‌ను కుడిచేయి బొటనవేలు, నాలుగు వేళ్ల మధ్య ఉంచి ఆడిస్తోంది. ‘‘గర్ల్స్‌ అటువైపే ఉండాలి. సాయంత్రం ఆరు దాటితే ఇటు రాకూడదు’’చెప్పాడు ఆకాశ్‌.‘‘ఊ... తెలుసు. ఇందాక ఇటువైపు వస్తుంటే చెప్పారు.ఏడవుతోంది బాయ్స్‌ వైపు వెళ్లొద్దు అని’’అంది. ‘‘ఎందుకలా ఉన్నావ్‌?’’ మళ్లీ మొదటి ప్రశ్న భూదేవి నుంచి. ‘‘అమ్మ గుర్తొస్తోంది’’ గద్గదిక స్వరంతో ఆకాశ్‌. కాస్త చేరువగా జరిగి.. మోకాళ్ల మీద చేతులు కట్టుకున్నట్టుగా కూర్చున్న ఆకాశ్‌ భుజమ్మీద చేయి వేసింది భూదేవి అనునయంగా. ఆ స్పర్శ.. ఆలంబనకు ఆకాశ్‌ కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. మొహం అటువైపు తిప్పి ఆ వైపు భుజంతో కళ్లు తుడుచుకున్నాడు. వాడి పరిస్థితి అర్థమైంది అమ్మాయికి.  ‘‘అమ్మ, నాన్న.. ’’ అంటూ ఆగింది. ‘‘అమ్మ చచ్చిపోయింది. నాన్నే చంపేశాడు.  నాన్న జైల్లో ఉన్నాడు’’ దూరంగా  ఆగిపోయిన నిర్మాణం ముందున్న ఇసుక కుప్పల వైపు చూస్తూ చెప్పాడు ఏ భావం లేకుండా!‘‘ఎప్పుడు?’’ అడిగింది వాడికి కొంచెం ఎడంగా జరుగుతూ. ఏంటీ ఎప్పుడు? అన్నట్టుగా చూశాడు. గ్రహించిన ఆమె ‘‘అమ్మ ఎప్పుడు చనిపోయింది అని’’ వివరంగా అడిగింది. ‘‘త్రీ ఇయర్స్‌ అవుతోంది’’ చెప్పాడు. ‘‘అప్పటి నుంచీ ఇక్కడే ఉన్నావా?’’ ఆ అమ్మాయి.మళ్లీ ‘‘ప్చ్‌’’ అంటూ అడ్డంగా తలూపాడు. ‘‘మరి’’ అన్నట్టు చూసింది. ఆరు చేతివేళ్లు చూపిస్తూ ‘‘సిక్స్‌ మంత్స్‌ అవుతోందంతే ఇక్కడికి వచ్చి. అంతకుముందు బాబాయ్‌ వాళ్లింట్లోనే ఉన్నాను. బాబాయే ఇక్కడ దింపి వెళ్లాడు’’చెప్పాడు. ‘‘కానీ.. కానీ’’ ఆగాడు.
‘‘ఏమైంది’’ అంటూ మళ్లా ఓరగా జరిగి ఆకాశ్‌ భుజమ్మీద చేయి వేసింది.

‘‘నాకు ఇక్కడ నచ్చట్లేదు. పారిపోవాలనిపిస్తోంది’’ ఈసారి దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. ‘‘ఒరేయ్‌ .. ఏడ్వకురా.. పర్లేదు. సర్దుకుంటుంది’’ అంటూ వాడి చేతిలోని చాక్‌లెట్‌ తీసుకుని రేపర్‌ విప్పి వాడికివ్వబోయింది. ‘‘ఛీ ..’’అంటూ విసిరికొట్టి అక్కడి నుంచి ముందుకు పరిగెత్తి బాదాం చెట్టు కింద ఆగాడు. హతాశురాలైంది భూదేవి. తనూ వాడి దగ్గరకు పరిగెత్తి.. ‘‘ఏమైందిరా’’ కంగారుగా అడిగింది. ‘‘అది వాడిచ్చిన చాక్‌లెట్‌. చేదు.. వాక్‌’’అన్నాడు వస్తున్న ఏడుపును ఆపుకొనే ప్రయత్నం చేస్తూ. ‘‘వాడెవడు?’’అడిగింది. ‘‘బాలసదన్‌ ప్రిన్సిపాల్‌ తమ్ముడు. నేనొచ్చినప్పటి నుంచీ... నన్ను.. ఆ ఇసుక తెన్నెల వైపు తీసుకెళ్లి.. నా బట్టలు.... ’’ చెప్పలేక ఆగిపోయాడు. ఏడుస్తూ నేల మీద పడిపోయాడు. ‘‘నాకు అమ్మ కావాలి అక్కా.. అమ్మ కావాలి. నేను నాన్న దగ్గరుండాలి’’ అంటూ.భూదేవి కళ్లల్లోనూ నీళ్లే. తన దగ్గరున్న చాక్‌లెట్‌ వంక చూసుకుంది. అలాంటి చాక్‌లెట్‌ ఇచ్చే.. ఆర్నెల్ల  కిందట ఓ అంకుల్‌ తనను తీసుకెళ్లిపోయాడు. పుణే అట.. అక్కడ ఎవరో ఆంటీకి అమ్మేశాడు. ఈ ఆర్నెల్లు ఎందరో అంకుల్స్‌.. చాక్‌లెట్స్‌ ఇచ్చి.. నా బట్టలు కూడా.. ’’ భూదేవి మెదడు గతాన్ని గుర్తుచేస్తుంటే.. కళ్లు నీళ్లను కుమ్మరిస్తున్నాయి.. అసంకల్పితంగానే ఆ అమ్మాయీ ఆ చాక్‌లెట్‌ను విసిరి కొట్టింది.
మోకాళ్ల మీద చేతులు కట్టుకున్నట్టుగా కూర్చున్న ఆకాశ్‌ భుజమ్మీద చేయి వేసింది భూదేవి అనునయంగా. 

చిట్టీ...  కొట్టేది బట్టీ
‘‘మా బుజ్జిగాడు రోబోలోని చిట్టీ రా. ఎంత షార్ప్‌ గ్రాస్పింగ్‌ పవర్‌ తెల్సా? అలా చూస్తే ఇలా పట్టేస్తాడు. ఎప్పుడూ చదువే. ఆ చదువు తప్ప మరో లోకం తెలియదు’’ ఫ్రెండ్స్‌ ఇండ్లకు వెళ్లినప్పుడు వినిపించే మురిపెపు మాటలివి. అవి విన్నవాడికి తన కొడుకు గుర్తొస్తాడు. ఆ రోబోగాడెవడో కనీసం కళ్లతో స్కాన్‌ చేశాడు. కానీ నా కొడుక్కు ఇలా పుస్తకాన్ని టచ్‌ చేస్తే... అలా మెదడులోకి మెటీరియల్‌ పంపే ట్యుటోరియల్‌ ఏదైనా దొరికితే బాగుండని ఆశ.పే‘రెంట్స్‌’ అనే పేరున్నందువల్ల అవసరాలకనీ రెంట్స్‌ పే చేస్తూ చదువులకు బిల్స్‌ పే చేస్తున్నందున పే చేసేదానికి   ఫలితం తప్పక రావాలన్నదే ఇప్పటి తల్లిదండ్రుల ఆశ. అందుకే వాళ్లు కార్పొరేట్‌స్కూళ్లూ, కాలేజీలలో బందీలయ్యారు. ఇంకా విపరిణామం ఏమిటంటే... నెక్ట్స్‌ ఇయర్‌ ఇంటర్‌లోకి వస్తున్న పేరెంట్స్‌ ఫోన్‌ నంబర్లు సంపాదించి, వాడి క్వార్టర్లీ ఎగ్జామ్స్‌ కంటే అర్లీగానే ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు చిన్ననాటి ఆటలు చదువులకు సాయం చేస్తున్నాయా లేదా చూద్దాం. గోడకేసి బంతి కొడుతూ ఆటాడినవాడికి న్యూటన్స్‌ థర్డ్‌లా చిన్నప్పుడే వచ్చేసి ఉంటుంది. గోలీలాడుతున్నప్పుడు గీసిన బాక్స్‌లో మనం గురి చూసిన గోలీని కొడితే... అసలది బయటకు వచ్చిన  మన కొట్టుడుగోలీ అక్కడే కూర్చుండిపోయి మనం ఔటయ్యిన్నాడు ఉక్రోశం మాత్రమే ఉంటుందేమోగానీ... ఇంటర్‌కొచ్చాక మొమెంటమ్, ఫోర్సూ, డైరెక్షన్‌ అనే వెక్టార్స్‌ గురించి తెలిసిన నాడు అలనాటి ఉక్రోశం గుర్తొచ్చి ఉల్లాసం మిగులుతోంది. ఎప్పుడూ పదేళ్ల నాడు కాలేజీలో చదవబోయే అడ్వాన్స్‌డ్‌ చదువులన్నింటికీ అడ్వాన్స్‌గా గల్లీల్లో మనం ఆల్రెడీ ప్రాక్టికల్స్‌ చేసే ఉన్నామని తెలిసిపోతుంది. దాంతో చదువు గోలీలాటంత ఈజీ అవుతుంది. కాన్సెప్ట్‌ బుర్రలోకి గిల్లీదాండంత సిల్లీగా ఎక్కిపోయి సింపులవుతుంది. ఈలోపు మావాడు రోబో అంటూ స్వయానా ఆ తండ్రే చెబుతున్న మాటలు వింటుంటే... అదీ నిజమే కదా అని జాలేస్తుంది. సంస్కారం అడ్డొచ్చిగానీ... లేకపోతేనా ‘‘ఒరే పేరెంట్స్‌లారా... వాడు ఒక రకంగా నిజంగానే రోబో అవునో కాదో తెలియదు గానీ... వాడు మాత్రం కచ్చితంగా ఒరిజినల్‌లంత విలువ లేని కాపీలను సృష్టించే జిరాక్స్‌ మెషీన్‌ రా’’ అని అరవాలనిపిస్తుంది. 
నెక్స్‌ట్‌ ఇయర్‌ ఇంటర్‌లోకి వస్తున్న పేరెంట్స్‌ ఫోన్‌ నంబర్లు సంపాదించి ఫోన్లు చేస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement