జీవిత కాలమంతా బాలలు, యువకుల పట్ల పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు ఎంతో ఆసక్తీ, అభిరుచీ ఉండేవి. వారి సంక్షేమానికి, విద్యావ్యాప్తికి, అభివృద్ధికి ఆయన చేసిన కృషి, చేపట్టిన విధానాల గుర్తింపుగా ఆయన జన్మదినమైన నవం బర్ 14ను బాలల దినోత్సవంగా జరుపు కుంటున్నాము. దేశాభివృద్ధికి, భావి తరాల బాగుకు నెహ్రూ ప్రదర్శించిన దార్శనికత, రాజనీతిజ్ఞతలను ఈ తరం విద్యార్థులు, యువకులు తెలుసుకోవాలి. జవహర్ లాల్ నెహ్రూ దార్శనికుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రపంచజ్ఞాన అనుభవజ్ఞుడు, రాజనీతిజ్ఞుడు. అంతే కాకుండా ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను గొప్ప నాయకుల కంటే మెరుగ్గా పాటించినవాడు. ‘‘భారత స్వాతంత్య్ర, ప్రజాస్వామ్య సూర్యుడు అస్తమించరాదు. మన ఆశలు మోసానికి గురికారాదు. ఏ మతస్థులమైనా మనమంతా సమాన హక్కులు, అధికారాలు, బాధ్యతలు గల భారతీయులం. మనం మత తత్వాన్ని, సంకుచిత స్వభావాలను ప్రోత్సహించరాదు.’’ ఇది భారత్ భవిష్యత్తు నిర్మాణంపై నెహ్రూ దార్శనిక ప్రకటన.
నెహ్రూ మీద బురదజల్లే ప్రయత్నాలు నేడు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రత్యేకించి నేటి దేశ నాయకుల స్థాయిలో ఉన్నవారే నెహ్రూను అవమానిస్తున్నారు. వారి భక్తులు సిగరెట్ తాగుతున్న, స్త్రీల ప్రక్కన కూర్చున్న (సందర్భాన్ని ప్రస్తా వించకుండా) ఆయన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను సామా జిక మాధ్యమాల్లో ఉంచి దుష్ప్రచారం చేశారు, చేస్తున్నారు. చరిత్ర చదవని విద్యార్థులు, యువకులు వాటిని ఉపయోగించి నెహ్రూ వ్యక్తిత్వంపై అవాంఛనీయ వ్యాఖ్యానాలు చేశారు.
1905 లో నెహ్రూ ఇంగ్లండ్ ‘హారొ’ నగరంలో పేరుగాంచిన పాఠశాలలో విద్య అభ్యసించారు. ఆ పాఠశాలలో సాధించిన విద్యా ప్రావీణ్యతలకు గానూ నెహ్రూకు ప్రఖ్యాత ఆంగ్ల చరిత్ర కారుడు జార్జ్ మెకాన్లె ట్రెవెల్యాన్ రచించిన ‘గారిబాల్డి‘ పుస్తకా లను బహూకరించారు. గారిబాల్డి ఇటలీ సైన్యాధికారి, రాజకీయ నేత. ఇటలీ జాతిపితలలో ఒకరిగా పేరొందారు. నెహ్రూ ఈ పుస్త కాలను క్షుణ్ణంగా చదివారు. ఆయన దృష్టిలో గారిబాల్డి ఒక విప్లవ వీరుడు. ఆయన జీవితం నుంచే నెహ్రూ భారత స్వాతంత్ర పోరా టానికి స్ఫూర్తి పొందారు. తర్వాత నెహ్రూ 1907 అక్టోబర్‌లో కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటి కాలేజీలో చేరారు. 1910లో జీవశాస్త్రంలో ఆనర్స్ పట్టా పొందారు. తన పాఠ్యాంశాలతో సంబంధం లేక పోయినా రాజకీయ, ఆర్థిక, సామాజిక శాస్త్రాలను, చరిత్ర, సాహి త్యాలను అధ్యయనం చేశారు. ప్రఖ్యాత ఆంగ్ల కవులు, రచయి తలైన జార్జ్ బెర్నార్డ్ షా, హెచ్.జి.వెల్స్, జె.ఎమ్. కీన్స్, బెర్ ట్రాండ్ రస్సెల్, లొజెస్ డికెన్సన్, మెరెడిత్ టౌన్ సెండ్‌ల రచనలు నెహ్రూ ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చాయి.
క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో (1942) కారాగార నిర్భంధవాసం గడుపుతున్న సమయంలో కూడా నెహ్రూ వివిధ దేశాల చరిత్రలు, సామాజిక, ఆర్థిక, రాజకీయాంశాలకు సంబం ధించిన 55 పుస్తకాలను అధ్యయనం చేసి విశేష పరిజ్ఞానాన్ని సంపాదించారు. పాఠ్యాంశాలను కూడా సరిగా చదవని విద్యా ర్థులు, ఏమీ అధ్యయనం చేయకుండా అవాకులు చవాకులు వాగే రాజకీయ నేతలు గ్రంథ పఠన ప్రాముఖ్యతను గురించి నెహ్రూ నుండి నేర్చుకోవాలి. పాఠ్యపుస్తకాలకు మించి సామాజిక శాస్త్రా లను జీవితాంతం అధ్యయనం చేయాలని, అప్పుడే సంపూర్ణ అవగాహన, సామాజిక స్పృహ కలుగు తాయని గుర్తించాలి.
భారత ప్రప్రథమ ప్రధానిగా నెహ్రూ ప్రగతిశీల సామాజిక విధానాలను అమలుచేశారు. బాలలకు, యువకులకు సమర్థ, ప్రతిభా నైపుణ్యతల విద్యను అందించాలని కోరుకున్నారు. భవి ష్యత్ భారత ప్రగతికి ఇది ముఖ్యమని భావించారు. అందుకోసం ప్రపంచ స్థాయి విద్యాసంస్థలైన అఖిల భారత వైద్య సేవల సంస్థ, భారతీయ సాంకేతిక సంస్థలు (ఐఐటీలు), భారతీయ నిర్వహణ సంస్థలు(ఐఐఎమ్‌లు), సాంకేతిక జాతీయ సంస్థలు (ఎన్‌ఐటీలు) స్థాపించారు. సోవియట్ యూనియన్ బాటలో పంచవర్ష ప్రణాళి కల ద్వారా బాలలందరికి ఉచిత, నిర్భంధ ప్రాథమిక విద్యను అందజేసే విధానాలను రూపొందించారు. దీనికోసం గ్రామీణ ప్రాంతాల్లో మూకుమ్మడి పాఠశాల విద్యార్థుల నమోదు పథకా లను ప్రవేశపెట్టారు. వేల సంఖ్యలో పాఠశాలలు స్థాపించారు. పోషకాహార లోపం నుండి పిల్లలను రక్షించడానికి ఉచిత పాల, భోజన సదుపాయాలు కల్పించారు. దేశమంతా ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో పెద్దల కోసం వయోజన విద్యాకేంద్రాలను, వృత్తి, సాంకేతిక పాఠశాలలను ఏర్పాటు చేశారు. ప్రజా స్వామ్యం, సామ్యవాదం, ఐక్యత, లౌకికత్వం నెహ్రూ స్వదేశీ సూత్ర మూలస్తంభాలు. భారతదేశాన్ని లౌకికదేశంగా ప్రకటిం చారు. సామ్యవాద సమాజ స్థాపన లక్ష్యంగా నిర్దేశించారు.
డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, టువర్డ్స్ ఫ్రీడం (ఆత్మ కథ) లాంటి పుస్తకాలను నెహ్రూ రచిం చారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్, డెహ్రాడూన్ జిల్లాలోని ముస్సోరి బోర్డింగ్ పాఠశాలలో చదువుతూ ఉండిన పదేళ్ళ కుమార్తె ఇందిరా ప్రియదర్శినికి 30 ఉత్తరాలు రాశారు. ఈ ఉత్తరాలలో బాగా చదవమని, ఫస్ట్ మార్కులు తెచ్చుకోమని రాయలేదు. దేశాల చరిత్రలు, ప్రపంచ ప్రజల నాగరికతలను వివరించారు. ఈ ఉత్త రాలను ‘తండ్రి నుంచి తనయకు ఉత్తరాలు’ అన్న శీర్షికతో పుస్త కంగా అచ్చువేశారు. తమ జ్ఞానాన్ని భావి తరాలకు అందజేసి విజ్ఞానంగా మార్చాలి. లేకపోతే మన సమాచార సంపదకు సార్థకత శూన్యం. నేడు నెహ్రూకు పూర్తి విరుద్ధ భావాలున్న నేతలు దేశాధినేతలయ్యారు. ఎంత గొప్పవారయినా తప్పులు చేయని, మచ్చలు లేని మానవులుండరు. పనిచేసే వారిలో పొర పాట్లు, తప్పులు సహజం. అయినా ఎదుటివారు ఏ పక్షం అన్న పట్టింపులు మాని, వారినుండి మంచిని గ్రహించి, చెడును వది లేయాలి. వెలుగులను మరిచి మచ్చలనే వెదికితే మన భవిష్యత్తు కూడా మచ్చలమయం కాకతప్పదు.
వ్యాసకర్త: సంగిరెడ్డి హనుమంత రెడ్డి
ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి ‘ మొబైల్ : 94902 04545
(నేడు బాలల దినోత్సవం, నెహ్రూ జయంతి)
అవమానించడం కాదు! అనుసరిద్దాం!!
Published Sun, Nov 14 2021 2:03 AM | Last Updated on Sun, Nov 14 2021 2:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment