చిత్రవర్ణాలే శ్రవణస్వరాలుగా... | Chitra listening tunes in a range of colors | Sakshi
Sakshi News home page

చిత్రవర్ణాలే శ్రవణస్వరాలుగా...

Published Tue, Dec 16 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

చిత్రవర్ణాలే  శ్రవణస్వరాలుగా...

చిత్రవర్ణాలే శ్రవణస్వరాలుగా...

ఆమె మాట్లాడలేదు. కానీ తన బొమ్మలతో  మాట్లాడిస్తుంది.ఆమెకు వినపడదు. కానీ ఆమె చిత్ర వర్ణాలు శ్రావ్యగీతాలను వినిపిస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే... భగవంతుడు ఏ జీవికైనా ఒక లోపం ఇచ్చినప్పుడు, దానిని  సరి దిద్దుకునేలా మరో రూపంలో  మంచి చేస్తాడని మానసి నిరూపించింది...
 
 డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై    ఆవిడ పేరు శ్రీరాణి, బీఫార్మసీ చేశారు. ఆయన బి.ఎస్.మూర్తి. మద్రాసు ఐఐటీలో సివిల్ ఇంజినీరింగ్‌లో ప్రొఫెసర్. వారి గారాల కుమార్తె మానసి. తనకు ఫలానాది కావాలి అని నోరు విప్పి చెప్పలేని కుమార్తెకు బంగారు భవిష్యత్తునివ్వడం కోసం  ఆ తలిదండ్రులు తమ జీవన గమ్యాన్ని పూర్తిగా మార్చుకున్నారు.  ఆమెని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి మార్గం సుగమం చేశారు. ఆ వివరాలు ఆవిడ మాటల్లోనే...

పంచేంద్రియాల్లో ఏ ఒక్క ఇంద్రియం సరిగ్గా పని చేయకపోయినా మిగిలిన ఇంద్రియాలు మరింత ఉత్సాహంతో పనిచేస్తాయి. మా అమ్మాయి విషయంలో కూడా అదే జరిగింది. మానసి పేరుకు తగ్గట్టు మనసుతోనే వింటుంది. తను 1991 జూన్ 9 న సౌత్ కర్ణాటకలోని మణిపాల్‌లో పుట్టింది. అప్పటికి మా వారు కాన్పూర్ ఐఐటిలో పనిచేస్తున్నారు. మానసి పుట్టిన ఏడాది తర్వాత గానీ ఆమెకు వినికిడి శక్తి లేదని మాకు తెలియలేదు. ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న మాకు ఈ వార్తతో తలమీద పిడుగు పడ్డట్లే అయింది. అయితే కర్తవ్యం గుర్తుకు తెచ్చుకుని, డాక్టర్ల సూచన మేరకు అమ్మాయిని స్పీచ్ థెరపిస్ట్‌కు చూపించాం. వారు అమ్మాయికి వినికిడి యంత్రం అమర్చారు. కాన్పూర్‌లో స్పీచ్ థెరపీ ప్రారంభించాం. మానసికి నాలుగు సంవత్సరాల వయసులో పాఠశాలలో చేర్పించాం. ఆ స్కూల్‌లో అంతా హిందీ మీడియమే. అందువల్లనో ఏమో మానసి పెద్దగా ప్రతిభ ప్రదర్శించలేకపోయింది. అయితే అదే సమయంలో మానసిలోని మరో కోణం బయటపడేసరికి తల్లిగా నేనెంతో ఆనందించాను. అదేమంటే...   డ్రాయింగ్ వేయడంలోనూ, ఆ వేసిన డ్రాయింగ్‌కి రంగులు పూయడంలోనూ చెప్పలేనంత శ్రద్ధాసక్తులు చూపుతోంది. ఒక్కోసారి నా దగ్గరకు కాగితాలు పెన్సిల్ తీసుకువచ్చి, నన్ను డ్రాయింగ్ వేసి, వాటికి రంగులు వేయమని అడిగేది. నేను వేస్తున్నంతసేపూ పక్కనే కూర్చుని, నిశితంగా పరీక్షించేది. ఆ తరవాత తనంతట తాను ఏవేవో బొమ్మలు వేస్తుండేది. అమ్మాయిలోని శ్రద్ధ గమనించిన అక్కడి టీచర్లు ‘సౌత్‌లో అయితే మంచి మంచి ఆర్ట్ స్కూల్స్ దొరుకుతాయి. మీరు అక్కడకు వెళ్లి అమ్మాయిని అక్కడ చేర్పించండి’ అని సూచించారు. అప్పుడు మావారు ప్రత్యేకించి తనకోసమే చెన్నై ఐఐటీకి ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. చెన్నై ‘క్లార్క్ స్కూల్ ఫర్ ద డెఫ్’లో చేర్పించాం.

అప్పటికి మానసి వయసు ఆరు సంవత్సరాలు. మానసిని అక్కడ చేర్పించినప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. చెవిటి పిల్లల టీచర్‌గా నేను ట్రెయినింగ్ తీసుకున్నాను. అదే స్కూల్‌లో టీచర్‌గా కొత్త జీవితం ప్రారంభించాను. ఆ స్కూల్‌లో చేరాక మానసి మంచి ప్రతిభ చూపింది. అక్కడ స్థానికంగా ఉండే టీచర్ దగ్గర డ్రాయింగ్‌లో జాయిన్ చేశాను. తనకి తొమ్మిది పది సంవత్సరాలు వచ్చేసరికి, రామ సురేశ్ అనే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ దగ్గర  డ్రాయింగు నేర్చుకోవడం ప్రారంభించింది. అలా మానసి కళా యాత్ర ప్రారంభమైంది. స్కూల్ డేస్‌లో డ్రాయింగ్‌లో ఎన్నో బహుమతులు పొందింది. ఏడో తరగతి చదువుతుండగా ఒరాకిల్ కంపెనీ మొత్తం 13 పెయింటింగ్‌లు తీసుకుంది. చెన్నై టి.నగర్‌లోని ఒరాకిల్ ఆఫీసులో తన పెయింటింగ్‌లు చూడవచ్చు. 11 వ తరగతి చదువుతున్న సమయంలో, చెన్నైలో ఒక ప్రదర్శన కూడా నిర్వహించింది. అందులో చాలా పెయింటింగ్‌లను ఎందరో ఇష్టంతో కొనుక్కున్నారు. ఆ ప్రోత్సాహంతో ఢిల్లీలోని అపర్ణ ఆర్ట్ గ్యాలరీలో ప్రతి సంవత్సరం డిసెంబరు 3 నుంచి 10 వరకు ‘ఫ్యామిలీ ఆఫ్ డిసేబుల్డ్’ అని వికలాంగుల విభాగంలో ‘బియాండ్ లిమిట్స్’ పేరున జరిగే కార్యక్రమంలో పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తోంది. అక్కడ తనవి చాలా పెయింటింగ్స్ సేల్ అయ్యాయి.

తన నుంచి నేను నేర్చుకున్నాను..!

 మా అమ్మాయి నా నుంచి ఎంత నేర్చుకుందో, మా అమ్మాయి నుంచి నేను అంతకు రెట్టింపు నేర్చుకున్నాను. అమ్మాయితో మాట్లాడటానికి వీలుగా, అదేవిధంగా వినికిడి లోపం ఉన్నవారికి ఏ విధంగా శిక్షణ ఇవ్వాలనే విషయంలో ముందుగా నేను ప్రత్యేక శిక్షణ తీసుకుని, డిప్లమా, బిఈడీ పూర్తి చేసి, అమ్మాయి చదివిన ‘క్లార్క్ స్కూల్ ఫర్ ద డెఫ్’ (మైలాపూర్)లో చాలా ఏళ్లుగా పాఠాలు బోధిస్తున్నాను.

ప్రస్తుతం తను మద్రాసులోని ‘స్టెల్లా మేరీస్’ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్‌లో ఫైనలియర్ చదువుతోంది. ఆ తరవాత మాస్టర్స్ డిగ్రీ చేస్తానంటోంది. డ్రాయింగ్‌లో రకరకాల ప్రయోగాలు చే స్తోంది. ఆయిల్, అక్రిలిక్, పెన్ ఆన్ పేపర్, డ్రై క్రేయాన్స్... ఇలా ఎన్నో. అయితే మానసికి మాత్రం వ్యక్తిగతంగా లాండ్‌స్కేప్స్ అంటే చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా స్నో స్కేప్స్. ఇంతవరకూ అన్నీ గ్రూప్ ఎగ్జిబిషన్‌లే నిర్వహించింది. ప్రస్తుతం సింగిల్ షో పెట్టాలనుకుంటున్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే... మా అమ్మాయి మాకు దేవుడిచ్చిన వరం. తన లోపాన్ని తను సరిదిద్దుకోగలగటమే కాక మమ్మల్ని కూడా చైతన్యవంతులుగా చేసింది. అది ఆమె మాకిచ్చిన వరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement