తెలుగు క్రైస్తవలోకంలో ఎన్నో ఏళ్లపాటు తనదైన ముద్ర కలిగిన ఎంతో శ్రావ్యమైన క్రైస్తవ భక్తి సంగీత బాణీలతో విశ్వాసులను ఎంతో అలరించి కాంతులీనిన క్రైస్తవ సంగీత దర్శకుడు ఎం.డి.జాకబ్ సన్ అనే ఒక అద్భుతమైన తార కనుమరుగైంది. కొంతకాలంగా అనారోగ్యంగా ఉండి, 67 ఏళ్ళ వయసులో ఇటీవలే ఆయన కన్ను మూశారు. ఆయనకు భార్య రోసెలిన్, ఇద్దరు కూతుళ్లు సునయన, కత్రీనా ఉన్నారు. క్రైస్తవలోకంలో ఈ రోజున గొప్ప గాయకులుగా, సంగీత వాద్యకారులుగా ఉన్న చాలామంది జాకబ్ సన్ చేతిలోనే శిక్షణనొంది, ఆయన బాణీలద్వారానే పేరు పొందారు. ఆయన 1978 నుండి, 1980, 1990 దశకాల్లో ‘విశ్వవాణి’ అనే అద్భుతమైన క్రైస్తవ రేడియో కార్యక్రమాలకు చేసిన సంగీత పరిచర్య చిరస్మరణీయమైనది. అప్పట్లో పల్లెటూళ్లలో ఉన్నవాళ్లకు విశ్వవాణి కార్యక్రమంతోనే తెల్లవారేది, మళ్ళీ విశ్వవాణి కార్యక్రమంతోనే రాత్రయ్యేది. ఆ రోజుల్లో విశ్వవాణి రేడియో కార్యక్రమంలో దైవజనులు ఆరార్కే మూర్తి ప్రసంగం జనహృదయాలకు ఎంతగా హత్తుకునేదో, జాకబ్ సన్ పాటలు కూడా అంతే జనరంజకంగా ఉండేవి.
ఆ తరాల తెలుగు క్రైస్తవులకు జాకబ్ సన్ ఒక సెలెబ్రిటీ!! ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెదధన్వాడ గ్రామానికి చెందిన జాకబ్ సన్ మహబూబ్ నగర్‌లో డిగ్రీ చదువుతున్నపుడు పెట్కార్ గారనే ఇంగ్లీష్ మిషనేరీ గారు. ఆరార్కే మూర్తి అనే దైవజనులు ఆయనలోని సంగీత ప్రతిభను గుర్తించి హైదరాబాద్‌లో తాము కొల్పిన ‘దేవుడు మాట్లాడాడు’ అనే స్టూడియోకు తీసుకొచ్చి తమ సంస్థ నిర్మించి, ప్రసారం చేస్తున్న తెలుగు క్రైస్తవ కార్యక్రమాలకు సంగీత దర్శకుడుగా నియమించారు. అదే కాలక్రమంలో విశ్వవాణి అనే పేరుతో ప్రాబల్యం పొందింది. అలా ఆరంభమైన జాకబ్ సన్ సంగీతపరిచర్య ద్వారా తెలుగు రాష్ట్రంలోని ఎందరో గాయకులూ, సంగీతకారులకు ఆయన స్టూడియోలో పాడి, వాయించి, అలా తెలుగు క్రైస్తవుల మన్నన పొందే ఆధిక్యత లభించింది. ‘దేవా నా దేవా’, ‘నా హృదయ సీమలో’, ‘దేవా నీవే నా ..’, ‘నే పాపినో ప్రభువా’, ‘దేవుని ఉపకారములలోన’, ‘ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు’ వంటి కబ్ సన్ బాణీ, సంగీతం కూర్చిన పాటలు, ఆ రోజుల్లో క్రెస్తవ చర్చిలు, విశ్వాసుల నాలుకలపై ఆడి, దైవికంగా మధురానుభూతులను పంచాయి.
ఆయన సంగీతంలో, బాణీల్లో విశిష్టత ఏమిటంటే, అవి నేరుగా విశ్వాసి హృదయాన్ని తాకి మరో లోకంలోకి తీసుకెళ్తాయి. చాలా సాధారణమైన ఆ బాణీలు, ప్రజల్లోకి సునాయాసంగా వెళ్లి వాళ్లంతా హాయిగా పాడుకునేలా చేస్తాయి. ఆయన బాణీల్లో శ్రావ్యతే ప్రాధాన్యంగా ఉంటుంది. ఇంత గొప్ప ప్రతిభావంతుడైనా, అతిశయం, అహంకారమనేది ఆయనకసలు తెలియదు. ఎంతో నిరాడంబరంగా, వివాదాలకు దూరంగా, మృదుభాషిగా అందరిపట్లా స్నేహభావంతో మెలిగాడాయన. ఎంతోమంది అనామకులైన అతి సాధారణ గాయకులూ కూడా, ఆయన సంగీతం, ఆయన బాణీల్లోని విశిష్టత వల్ల గొప్ప గాయకులుగా పేరు ప్రతిష్టలు పేరొందారు. అందరితో కలిసిమెలిసి, ఆడుతూ, పాడుతూ, హాస్యోక్తులు వేస్తూ, తాను నవ్వుతూ అందరినీ నవ్వించడమే తప్ప ఎప్పుడూ ఎవర్నీ ఆయన నొప్పించిన సందర్భమే లేదు. సంగీతం, పాటలే తన లోకంగా బతికాడాయన.
గోరంత ప్రతిభకు, తమ సొంత ‘మార్కెటింగ్ తెలివితేటలు’ జోడించి చూస్తుండగానే ఎంతో ఎత్తుకు ఆయన పరిచయం చేసిన అతి సాధారణ గాయకులు, సంగీతకారులే ఎదిగిపోయినా, ఎన్నడూ ఆయన వ్యసనపడలేదు. ఎంతటి పరిస్థితుల్లోనైనా తాను నొచ్చుకోకుండా, ఎవరినీ నొప్పించకుండా ఉండడానికే ప్రయత్నించేవాడే తప్ప, ధనార్జన పైన, పేరు సంపాదించడం పైన ఎన్నడూ దృష్టిపెట్టినవాడు కాదాయన. ప్రతి పరిస్థితిలోనూ, ఎంతో గుంభనంగా, నిండుగా జీవించాడు జాకబ్ సన్. జీవితమే క్రైస్తవ స్ఫూర్తితో సాగిన ఒక శ్రావ్యమైన సంగీత బాణీ జాకబ్ సన్!! అసూయకు, విమర్శలకు, వివాదాలకు తావివ్వని అసమానమైన విశ్వాసి ఆయన. తెలుగు క్రైస్తవ భక్తి సంగీత ప్రపంచంలో కొన్ని మైలు రాళ్ళ మీద ఆయన పేరు తప్పకుండా ఉంటుంది. శ్రావ్యమైన సంగీతంతో విలసిల్లే పరలోకంలో జాకబ్ సన్ తప్పక మరింత సంతోషంగా, ఆనందంగా ఉంటాడని సువార్తికుల విశ్వాసం.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
prabhukirant@gmail.com
Comments
Please login to add a commentAdd a comment