ఫ్రీ ఫుడ్‌ | College Students Help To Orphan Childrens | Sakshi
Sakshi News home page

ఫ్రీ ఫుడ్‌

Published Wed, Jan 8 2020 1:36 AM | Last Updated on Wed, Jan 8 2020 1:36 AM

College Students Help To Orphan Childrens - Sakshi

అనూజా బషీర్‌ ‘ఫ్రీ ఫుడ్‌ క్యాంపెయిన్‌’ నడుపుతున్నారు. ఇటువంటి అన్నదానాల గురించి వినీ వినీ ఇదొక పెద్ద విశేషంగా మీకు అనిపించకపోవడం సహజమే. అయితే అనూజ ప్రత్యేకం. ఆమెది కొచ్చి. ఇంజినీరింగ్‌ చదివింది. కాలేజ్‌ ప్రాజెక్టు పని మీద స్నేహితులతో కలిసి బెంగుళూరు వెళ్లి, అక్కడి చర్చిగేట్‌ ప్రాంతంలోని ఓ కాఫీ షాప్‌లో కూర్చొని ఉన్నప్పుడు వచ్చిన ఆలోచనతోనే ఇప్పుడు రోజుకు వంద మందికి పైగా కడుపులు నింపే ఉద్యమాన్ని నడిపిస్తున్నారు! ఆ రోజు.. వాళ్లకు సమీపంలో ఒక చిన్న పిల్లవాడు కడుపు చేతపట్టుకుని తినేందుకు ఏమైనా ఉంటే పెట్టండి అని హోటళ్ల వాళ్లను అడుగుతుండడం వీళ్లు గమనించారు. అలా సంపాదించిన ఫుడ్‌ని అతడు తనకన్నా చిన్న పిల్లలకు పంచడం కూడా వీళ్ల కంటపడింది. అప్పుడే.. ఆకలితో ఉన్నవాళ్లకు తనూ ఏదైనా ‘షేర్‌’ చేయాలని అనుకున్నారు అనూజ. ఎర్నాకులంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో తనకు తెలిసినవాళ్లుంటే ఆర్థిక సహకార సమాచారం కోసం వారిని సంప్రదించారు అనూజ.

అయితే ఈ దేశంలో ఆహారానికి ఎంత కొరత ఉందో, ఆర్థిక సహాయానికీ అంతే కొరత ఉందని ఆమెకు అర్థమైంది. ఇలా లాభం లేదని కొచ్చిలో ఉన్న ఒక అనాధ ఆశ్రయానికి వెళ్లారు. అందరూ మహిళలే నడుపుతున్న ఆశ్రయం అది. దాదాపు 500 మంది ఉంటారు. వాళ్లందరికీ ప్రతిరోజూ భోజనం సమకూర్చడం పెద్ద పని. అప్పటికీ దాతల సహాయంలో నడుస్తోంది. ఆ భారాన్ని కొంతైనా తగ్గించేందుకు, తన వంతుగా రోజుకు వంద భోజన పొట్లాలను అనూజా ఆ ఆశ్రమానికి ఇవ్వడం ప్రారంభించారు. కెట్టో ఓఆర్జీ అనే పేరుతో ఆన్‌లైల్‌లో నిధులను సమీకరించడానికి చేసిన ప్రయత్నం కూడా సఫలం అవడంతో ఇప్పుడు కోళికోడ్, తిరువనంతపురాలలో  కొన్ని ఆశ్రమాలకు భోజనం అందించే ఆలోచనలో ఉన్నారు. రెండేళ్లుగా అనూజా ఈ ఆహార ఉద్యమాన్ని నడుపుతున్నప్పటికీ పేరెక్కడా వినిపించలేదు. అయినా ఆకలి సేవకు ఏ పేరు సరిపోతుంది చెప్పండి?!

ఫ్రీ–కశ్మీర్‌
ప్లకార్డును పట్టుకున్నానని అనుకుంది కానీ, ప్రమాదాన్ని పట్టుకున్నానని అనుకోలేదు ఈ యువతి. ఢిల్లీలోని జె.యన్.యూ  క్యాంపస్‌లో ఆదివారం జరిగిన హింసకు వ్యతిరేకంగా ముంబైలోని ‘గేట్‌ వే ఆఫ్‌ ఇండియా’ దగ్గర సోమవారం రాత్రి పొద్దు పోయేవరకు ప్రదర్శనలు జరిగాయి. ఆ ప్రదర్శనల్లో ఈ మహిళ ‘ఫ్రీ కశ్మీర్‌’ అనే ప్లకార్డ్‌ పట్టుకుని ఉండటం కాస్త ఆలస్యంగా పోలీసుల కళ్లలో పడింది. ఇక అప్పట్నుంచీ ఆమె కోసం గాలిస్తున్నారు. ఫ్రీ కశ్మీర్‌ అనడాన్ని ఇంటిలిజెన్స్‌ కూడా తీవ్రంగా పరిగణిస్తోందనీ, ఆమె కశ్మీర్‌ మహిళ అయుంటుందా అని ఆరా తీస్తోందని కూడా వార్తలు కూడా వచ్చాయి.

ఇవన్నీ ఆమె దృష్టికి వెళ్లినట్లుంది.. వెంటనే సోషల్‌ మీడియాలో ఒక వీడియోను అప్‌లోడ్‌ చేసింది. ‘నేను కశ్మీర్‌ మహిళను కాదు. నా పేరు మెహెక్‌ మీర్జా ప్రభు. మాది ముంబై. నేను రైటర్‌ని. ప్రదర్శనలో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు అక్కడ రకరకాల ప్లకార్డులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి తీసుకున్నాను తప్ప, ఎంపిక చేసుకుని తీసుకోలేదు. అయినా ‘ఫ్రీ కశ్మీర్‌’ అంటే నా ఉద్దేశం.. ఇండియా నుంచి కశ్మీర్‌కు విముక్తి కల్పించమని కాదు.. కశ్మీర్‌లో ఇంటర్నెట్‌ నిషేధాన్ని తొలగించమని అక్కడి పౌరుల స్వేచ్ఛను హరించవద్దని..’’ అంటూ ఆమె వివరణ ఇచ్చింది. ఏమైనా.. కొన్ని ఫొటోలు వార్తల్లో ఎప్పటికీ నిలిచిపోయినట్లుగా.. ఈ ఫొటో కూడా నిరసనల చరిత్రలో ‘నిలిచిపోయే’ స్థానాన్ని దక్కించుకోబోతున్నట్లే కనిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement