పెయిడ్‌ లీవ్‌ ఇస్తున్నారా? | Corona Effect Story On Paid Leaves In Family | Sakshi
Sakshi News home page

పెయిడ్‌ లీవ్‌ ఇస్తున్నారా?

Published Thu, Mar 26 2020 7:20 AM | Last Updated on Thu, Mar 26 2020 7:22 AM

Corona Effect Story On Paid Leaves In Family - Sakshi

ప్రపంచం స్తంభించి పోయింది. కరోనా కనుచూపుతో ప్రపంచాన్ని శాసిస్తోంది. అత్యవసర సర్వీసుల ఉద్యోగులు మరింత బాధ్యతగా పని చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో పని చేసుకోగలిగిన రంగాలు యథావిధిగా పని చేసుకుంటున్నాయి. ఆ ఉద్యోగులు ఇంటి నుంచే సేవలందిస్తున్నారు. విరామం తీసుకోగలిగిన సర్వీసులన్నీ విశ్రాంతిలోకి వెళ్లిపోయాయి. ఆ ఉద్యోగులు ఇంటిపట్టునే ఉంటున్నారు. ఇవన్నీ వ్యవస్థీకృత రంగాలే. ఈ ఉద్యోగుల్లో ఎవరికీ జీతాల ఇబ్బంది లేదు. నెల పూర్తయ్యేటప్పటికి బ్యాంకు అకౌంట్‌లో జీతం జమ అయిపోతుంది. పైగా యాభై వేలకు పై బడిన జీతాలు, ఆరంకెల జీతాలు అందుకుంటున్న కుటుంబాలే ఎక్కువ. అయితే ఈ కరోనా సంక్షోభం కారణంగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్న కుటుంబాలు లెక్కకుమించి పోతున్నాయి. (కష్టకాలంలో క్రీడాకారుల ఔదార్యం)

పై ఇళ్లలో పని చేసే ఇంటిపని మనుషులకు జీతాల భద్రత మీద వేటు పడుతోంది. ‘ఇంటి పనులకు వచ్చే డొమెస్టిక్‌ హెల్పర్‌లు నాలుగైదు ఇళ్లలో పని చేస్తుంటారు. కాబట్టి కరోనా వ్యాప్తికి కారణమయ్యే ప్రమాదం ఉంది’ అనే ముందు జాగ్రత్తతో అనేక మంది పనివాళ్లను పనులకు రావద్దని చెప్పేస్తున్నారు. ఆరోగ్యపరమైన జాగ్రత్త విషయంలో ఈ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే. అయితే వాళ్లకు నెల చివరి రోజున ఇచ్చే జీతంలో కోత పడే దుస్థితి నెలకొంటోంది. ఎన్ని రోజులు పని చేశారో లెక్క చూసి, రోజు వంతున లెక్క చూసి డబ్బిచ్చే వాళ్లే ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు డొమెస్టిక్‌ హెల్పర్స్‌ని కరోనా వైరస్‌ కంటే రాబోయే నెల బడ్జెటే ఎక్కువగా భయపెడుతోంది. వైట్‌ కాలర్‌జాబ్‌ వాళ్లకు వర్తిస్తున్న పెయిడ్‌ లీవ్‌ వీళ్లకు వర్తించదా?

‘‘డొమెస్టిక్‌ హెల్పర్స్‌ శ్రమ దోపిడీ తప్ప, వారికి భద్రత లేని వ్యవస్థ మనది. అసంఘటిత రంగంలో కూడా జీత భద్రత కోసం తమ యూనియన్‌ నలభై ఏళ్లుగా పోరాడుతూనే ఉంద’’ని చెప్పారు మేరీ క్రిస్టీన్‌. ఆమె ముంబయిలోని ‘నేషనల్‌ డొమెస్టిక్‌ వర్కర్స్‌ మూవ్‌మెంట్‌’ కో ఆర్డినేటర్‌. యాభై వేల మంది సభ్యులున్న యూనియన్‌ ఇది. ‘‘ముంబయిలో ఊర్మిళ అనే మహిళ అనేక ఇళ్లలో వంట చేస్తుంది. ఆమె మార్చి నెలలో 18 రోజులు మాత్రమే పని చేయగలిగింది. సోషల్‌ డిస్టెన్స్‌ మెయింటెయిన్‌ చేయడంలో భాగంగా ఆమెను పనికి రావద్దని చెప్పారు యజమానులు.

అయితే నెలలో మిగిలిన రోజులకు జీతం ఇవ్వడానికి నిరాకరించారు. వాళ్లు పని చేసే ఇళ్లలో ఏ ఇంట్లో ఎవరు ఎప్పుడు బయటి దేశాల నుంచి వస్తారో, ఎవరి నుంచి వాళ్లకు వైరస్‌ సంక్రమిస్తుందో ఎవరమూ ఊహించలేం. అయినా పని చేయకపోతే గడవదనే భయంతో పని చేయడానికి సిద్ధమవుతున్నారు. వైరస్‌ వ్యాప్తికి మేము వాళ్లు కారణం కావచ్చనే జాగ్రత్తను కాదనం. కానీ వాళ్లు కూడా నెల పొడవునా తిండి తినాలి కదా, జీతంలో కోత పెడితే ఎలా బతకాలి’’ అని డొమెస్టిక్‌ హెల్పర్‌లకు ఎదురైన కష్టాన్ని చెప్పారు క్రిస్టీన్‌. 

దొడ్డ బెంగళూరు 
ముంబయిలో పరిస్థితి ఇలా ఉంటే... బెంగళూరు, ఆర్‌టీ నగర్‌కు చెందిన భాగ్యమ్మ అనుభవం మరోలా ఉంది. ఆమె క్వీన్స్‌ కార్నర్‌ అపార్ట్‌మెంట్‌లో పని చేస్తోంది. ఆమె యజమాని గీత రాచ్‌ కూడా ఈ సంక్షోభం ముగిసే వరకు భాగ్యమ్మను పనికి రానక్కరలేదని చెప్పింది. కానీ నెల మొత్తానికి జీతం ఇచ్చేసింది. అలాగే గుర్‌గావ్‌కి చెందిన మీడియా రంగ ఉద్యోగి గీత కూడా తన డొమెస్టిక్‌ హెల్పర్‌కి నెల జీతం మొత్తం ఇచ్చేసింది. మరి హైదరాబాద్‌ పని వాళ్లను కదిలిస్తే... ‘రావద్దని చెప్పారు. కానీ నెల జీతం ఎలాగిస్తరో ఏమీ చెప్పలేదు. చాలా మంది మాకు నెల దాటిన తరవాత ఐదారు రోజులకు కానీ ఇవ్వరు. వచ్చే నెల ఎంత చేతిలో పెడతారో? ఆ నెల ఎలా గడవాలో తెల్వట్లేద’ని ఆవేదనగా చెప్పారు.

హైదరాబాద్‌లో గచ్చిబౌలి వంటి కొన్ని చోట్ల మాత్రం నెల జీతం మొత్తం ఇచ్చే పద్ధతిలోనే డొమెస్టిక్‌ హెల్పర్స్‌కి పెయిడ్‌ హాలిడే ప్రకటించారు. మధ్య తరగతి నివసించే ప్రదేశాల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. వాళ్లందరికీ ఒక విన్నపం. భగవంతునికి పూజలు చేసి భక్తిగా హుండీలో వేసే డబ్బుని మన ఇంట్లో పని చేసే వాళ్లకు ఇస్తున్నాం అనుకోగలిగితే చాలు. పని చేయని రోజులకు జీతం ఇస్తున్నామని మనసు బాధ పడదు. పైగా సాటి మనిషికి ఇవ్వడంలో ఉన్న సంతోషం సొంతం అవుతుంది. పూర్తి జీతం ఇచ్చి మన ఇంటి పని మనిషి కళ్లలో సంతోషాన్ని 
ఆస్వాదించవచ్చు. – మంజీర 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement