
ఆలయంలో అర్ధమండపం దాటాక కొన్ని ఆలయాలలో రంగమంటపం కనిపిస్తుంది. మధ్యలో గుండ్రటి వేదిక, చుట్టూ నాలుగు స్తంభాలు, దాని చుట్టూ పన్నెండు స్తంభాలతో ఇలా పదహారు స్తంభాలతో నిర్మితమయ్యే మండపాన్ని రంగమండపం అంటారు.రంగం అంటే వేదిక. దాన్ని మధ్యలో ఉంచి నిర్మించబడేదే రంగమండపం. అర్ధమంటపానికి ముందు ఈ రంగమండపాన్ని నిర్మించే సంప్రదాయం ఉత్తరాది ఆలయాలలో ఎక్కువగా, కర్ణాటకలో కొన్నిచోట్ల కనబడుతోంది. ఆలయ సంప్రదాయ క్రియలలో ఒకటైన నాట్యసేవ ఈ రంగమండపంలోనే జరుపబడుతుంది.
ఏ ఆలయం గొప్పతనాన్నయినా ఆ దేవుడి భోగాన్ని బట్టే బేరీజు వేస్తారు. ఆలయంలో జరిగే దేవభోగం సక్రమంగా జరిపే ఏర్పాట్లు అనాదిగా ఆలయాల్లో జరుగుతున్నాయి. వాటికోసం రాజులు ఎన్నో మాన్యాలను ఆలయాలకు రాసిచ్చారు. కాలక్రమేణా దేవభోగం రెండు రకాలుగా మారింది. అంగభోగం, రంగభోగం. అంగభోగం అంటే స్వామివారి పూజాదికాలు, విశేషసేవలకు సంబంధించినదని అర్థం. రంగభోగం అంటే ఆయా కాలాల్లో ఒకవేదికపై ఒకరు లేక అనేకమంది కళాకారులు నృత్య, గీత, వాద్యాలతో సమర్పించే స్వామిని సేవించుకోవటం.
ఆలయంలో భగవంతుని వైభవానికి తగినట్లు అన్ని భోగాలను కల్పించడం ఆగమ సంప్రదాయం. విశేష ఉపచారాలలో నృత్యం, గీతం, వాద్యం వంటి సేవలు కూడా ఉన్నాయి.కనుక వీటి కోసం ఏర్పాటుచేసినదే రంగమండపం. అంగభోగం రంగభోగం అనే పదాల్ని సంక్షిప్తం చేసి నేడు అంగరంగవైభోగంగా అని అంటున్నారు. ఈ రంగ భోగమంటపానికే నవరంగం అని మరో పేరుంది. తొమ్మిది రకాలైన అలంకారాలు గల స్తంభాలతో నిర్మిస్తారు కనుక అది నవరంగం. ఆలయం అంతటిలో ఎక్కువ అలంకరణ కలిగిన మండపం అంటే అది రంగమండపమే.
పూరీజగన్నాథస్వామి, కోణార్క్ సూర్య దేవాలయం, జగ్మోహన మందిరం వంటి ఉత్తరాది ఆలయాలతో పాటు కర్ణాటకలోని బేలూరు, హళేబీడు,పట్టదకల్ వంటి ఆలయాలలో రంగమంటపాలున్నాయి. హంపిలోని విఠ్ఠల దేవాలయంలో సప్తస్వరాలు పలికించే స్తంభాలున్నాయి. తెలుగునాట చాలా మటుకు ఆలయం బయట ప్రత్యేకంగా నాట్యమండపాలను నిర్మించారు.నృత్యంతో భగవంతుని లీలా విశేషాలను భక్తులకు దృశ్యరూపంగా చూపుతూ, గానంతో భగవంతుని గుణవైభవాన్ని కీర్తించి, వాద్యంతో వీనులనిండుగా సుశబ్దాలతో మనస్సును లయింపజేసే ఆ రంగస్థలం నిరుపమాన భక్తికి కార్యస్థలం.
– కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు