సాహెబ్‌ విశ్వనాథ్‌ | Dadasaheb Phalke Award for K Vishwanath | Sakshi
Sakshi News home page

సాహెబ్‌ విశ్వనాథ్‌

Published Sun, Apr 30 2017 12:26 AM | Last Updated on Tue, Sep 5 2017 9:59 AM

సాహెబ్‌ విశ్వనాథ్‌

సాహెబ్‌ విశ్వనాథ్‌

నదిలో ప్రవాహం ఉంటుంది. కథలో ప్రవాహం ఉంటుంది.క్షణం ముందు ముట్టుకున్న నీటి బొట్టును మళ్లీ ముట్టుకోలేం. అలాంటి ఎన్నో కన్నీటి బొట్లు, ఆనందభాష్పాలతో మనల్నిఅలరించిన విశ్వనాథ్‌గారు ప్రేక్షక తపస్వి. సరస్సులో చలనం ఉండదు, ఆవేశం ఉండదు. స్థిరత్వం ఉంటుంది. దాని ఒడ్డున కూర్చున్న తపస్వి ప్రతిబింబం ఉంటుంది. విశ్వనాథ్‌గారి సినిమాల్లో మన ప్రతిబింబం ఉంటుంది. ప్రవాహం, ప్రతిబింబం కలబోసిన కళా తపస్వి, దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కార గ్రహీత కాశీనాథుని విశ్వనాథ్‌గారితో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ...

స్వప్న: ‘కళా తపస్వి’ గారికి నమస్కారం!
విశ్వనాథ్‌: ‘కళా తపస్వి’ అని ఎందుకు? విశ్వనాథ్‌గారు అనొచ్చు కదా! అలా పిలిస్తేనే నాకు హాయిగా ఉంటుంది.

‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డు వచ్చిన సందర్భంగా మీ ఆనందాన్ని మాతో పంచుకుంటారా?
విశ్వనాథ్‌: ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను... వినగలుగుతున్నాను... మాట్లాడగలుగుతున్నాను. ఈ స్టేజిలో అవార్డు ఇచ్చినందుకు ఆనందపడాలి. ఎందుకంటే... నేను ‘పద్మశ్రీ’ అవీ తీసుకున్న రోజుల్లో అలాంటి పురస్కారాలు దక్కించుకున్నవాళ్లలో చూడలేనివాళ్లు, నడవలేనివాళ్లు, వినపడనివాళ్లు ఉన్నారు. అవార్డు వచ్చిన ఆనందాన్ని నేను అనుభవించడం కంటే కూడా నా వీరాభిమానులందరూ తమ ఆనందాన్ని వెలిబుచ్చుతున్న తీరు చూస్తుంటే... నా వెనక ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందనే ఆనందం ఎక్కువగా కలుగుతోంది.

‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డును అత్యున్నత పురస్కారంగా సినీ పరిశ్రమకు చెందినవారు భావిస్తారు. ఈ అవార్డు అంటే మీ మనసులో కలిగే భావన ఏంటి?
విశ్వనాథ్‌:  కాశీలో ఓ దేవుడు ఉన్నాడు. ఆయన గురించి అందరూ అనుకున్నట్లుగానే నేనూ అనుకుంటాను. శిరిడీలో సాయిబాబా ఉన్నాడు. మీ ఉద్దేశంలో సాయిబాబా అంటే? అనడిగితే... నేను గొప్ప భక్తుణ్ణి లేదా భక్తుణ్ణి అని చెబుతా. అలాగే, శాంతారామ్, సత్యజిత్‌ రే, దాదా సాహెబ్‌ ఫాల్కే వంటి కొందరు ఓ కేటగిరీలో ఉన్నారు. ఇప్పుడు ఒకరు ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ పేరుతో అవార్డు స్థాపించారు. దానికి ఒక విలువ ఏర్పడింది. జనాలు ఏదైతే మంచి, గొప్ప అనుకుంటున్నారో.. నేనూ దాన్నే ఫాలో అవుతా. భవిష్యత్తులో సత్యజిత్‌రే పేరుతో అవార్డు ఇచ్చినా అంతే. ఐయామ్‌ హ్యాపీ.

దర్శకుడిగా చిత్రపరిశ్రమకు మీరెంతో సేవ చేశారు. అసలు మీ ఉద్దేశంలో గ్రేటెస్ట్‌ కంట్రిబ్యూషన్‌ అంటే?
విశ్వనాథ్‌:  దర్శకుడిగా నేనేదో చేశానని ఎప్పుడూ అనుకోను. ఒకవేళ నేను టీచర్‌ను అయ్యుంటే పిల్లలకు బెస్ట్‌ ఆఫ్‌ మై నాలెడ్జ్‌ టీచ్‌ చేయడం నా డ్యూటీ. ఒకవేళ డాక్టర్‌ అయితే నా పేషెంట్స్‌ ఎక్కువ రోజులు బతికేలా ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలి. అలాగే, దర్శకుడిగా నేను ఫాలో కావాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. సమాజానికి మంచి చేయకపోయినా, చెడు చేయకుండా ఉండడం కూడా కొంతవరకూ మేలే కదా. అలా అనుకుంటాను తప్ప నేనేదో మేలు చేశాననుకోను.

మంచి సినిమాలు తీయడం నా బాధ్యత. సినిమాల్లో అనేక రకాలుంటాయి. నేను సంగీత, సాహిత్యాలను ఎంచుకున్నాను. మహానుభావులు త్యాగరాజస్వామి వంటివారు సంగీత, సాహిత్యాలను కాపాడడానికి తమ జీవితాలు ధారపోశారు. వాళ్ల తర్వాతే మనమంతా. ఈ తరం ప్రేక్షకులకు వాటి గురించి అవేర్‌నెస్‌ క్రియేట్‌ చేయడానికి నేనేం చేయగలను? వాట్‌ ఈజ్‌ మై కంట్రిబ్యూషన్‌? అని ఆలోచిస్తా. అంతే తప్ప... ‘నేనేదో గొప్ప చేశా, ఇండస్ట్రీలో కళలను కాపాడా’ వంటి మాటలు చెప్పను.

సినిమా ఇండస్ట్రీ అంతా ఓ పోకడలో కొట్టుకుపోతూ, ప్రవాహంలో వెళ్తున్న టైమ్‌లో అడ్డుకట్ట వేసి మళ్లీ మీరు దాన్ని వెనక్కి తెచ్చారనే భావన మీ అభిమానుల్లో ఉంది...
విశ్వనాథ్‌: నిజమే. ‘పాశ్చాత్య సంగీతపు పెను తుఫానులో రెపరెపలాడుతున్న సత్సంప్రదాయ సంగీతపు జ్యోతిని కాపు కాయడానికి తన చేతులు అడ్డు పెట్టిన వారందరికీ పాదాభివందనం చేస్తున్నా’ అని ‘శంకరాభరణం’లో శంకరశాస్త్రి డైలాగ్‌ చెబుతాడు. నేను అలా చేశానని నాకు పాదాభివందనం చేయమని కాదు. అభిమానుల అభిప్రాయాన్ని నేను ఒప్పుకుంటాను. ఇప్పటికీ ఒప్పుకోకపోతే నేను మూగవాణ్ణి అయిపోతా. నా బుద్ధి మేరకు నేను నిజంగానే చేశాను. క్లాసికల్‌ మ్యూజిక్, డ్యాన్స్‌ పెట్టి సినిమాలు చేస్తే ఎవరు ఆదరిస్తారు? ఇది కమర్షియల్‌ ఆర్ట్‌ కదా? మీ సినిమాలకు డబ్బు వస్తుందా? నిర్మాత ఏమవుతాడు? అన్నదానికి విరుద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది. దాని ఫలితమే నాకు వచ్చిన అవార్డులు... ఈ రోజు వచ్చిన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు కూడా!

మీలో ఆధ్యాత్మిక కోణం, పూర్తి లౌకిక కోణం, ప్రపంచాన్ని ప్రేమించే ఓ కోణం కనిపించాయి. మీలోని జీవం ఈ మూడు పాత్రల్లో ఎక్కడుంది?
విశ్వనాథ్‌: (నవ్వుతూ..) కిచిడీలాగా అన్నీ కలిపి ఉంటాయేమో! ఎందుకంటే... ఏ కథకైనా ఇవన్నీ ముఖ్యమైన పార్శా్వలే. దాంట్లో శృంగారం, ఆధ్యాత్మిక చింతన, మరొకటి, మరొకటి ఉండాలి. చిన్న సందేశం కూడా జోడించి ఉండాలని నా నమ్మకం. సినిమా కావొచ్చు... నాటకం కావొచ్చు... మరొకటి కావొచ్చు... ఈ కోణాలన్నీ ఉండాలి. వీటిని ఎవరికి తగ్గట్టుగా వాళ్ల మోతాదుల్లో చూపిస్తారు. నేను శృంగారం చూపిస్తే లో–కీలో ఉన్నట్టు ఉంటుంది.

కానీ, ప్రేక్షకులను అది తప్పకుండా ఎగ్జయిట్‌ చేస్తుంది. బహుశా... కొన్ని పాత్రలను వాటి పరిమితుల్లో డీసెన్సీగా చూపడంలో నేను స్పెషలిస్ట్‌ అనుకుంటా! ఆడ, మగ.. ఒకరినొకరు ఇష్టపడ్డారంటే... పబ్లిగ్గా ఊటీ లేదా కొడైకెనాల్‌లో 600 మంది డ్యాన్సర్ల మధ్యలో ‘నేను నిన్ను ప్రేమిస్తున్నా’నని చెప్పవలసిన అవసరం ఉందా? లేదా? అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. లేదు, మనిద్దరం ఏ నది ఒడ్డునో, కొండల చాటునో ఉండి... ‘ఐ డోంట్‌ నో, వాట్‌ ఈజ్‌ హ్యాపెనింగ్‌ టు మి. ఐ లైక్‌ యు’ అని కృత్రిమంగా కాకుండా హృదయం లోతుల్లో ఉన్న ప్రేమను ముఖ కవళికలతో, మాటల్లో చెబితే.. అక్కడుండే పవిత్రత ఎవర్‌గ్రీన్‌. కొన్నిటిని గుంబనంగా అట్టిపెడితేనే పదే పదే చూడాలనే ఆశ కలుగుతుంది.

‘మనసు పలికే మౌనగీతం’ పాటలో, ‘సిరివెన్నెల’ సినిమాలో ప్రేమను మీరు చూపించిన విధానం...
విశ్వనాథ్‌: (ప్రశ్న మధ్యలోనే) ఒక్క సినిమా అని కాదు, ప్రతి సినిమాలోనూ అంతే. ‘సాగర సంగమం’లో కమల్‌హాసన్, జయప్రదల పాత్రల మధ్య అనుబంధం అలాగే ఉంటుంది. ‘స్వయంకృషి’లో మోటుగా ఉండే చిరంజీవి, చెప్పులు అట్టిపెట్టుకుని దేవాలయంలో చీటీలు ఇచ్చే విజయశాంతి మధ్య అనుబంధం అయినా అలాగే ఉంటుంది.

ఇప్పుడు మీరు మీ సినిమాలన్నీ తలచుకుంటూ వాటిని అందమైన జ్ఞాపకాలుగా భావిస్తారా? ఇంకా ఏమైనా చేయాలనే తపన  పడతారా?
విశ్వనాథ్‌: నాకు ఏ తపనా లేదంటే సంతృప్తి వచ్చేసిందా? లేకపోతే బ్రెయిన్‌ పని చేయట్లేదు కాబట్టి తపన లేదంటున్నాడా? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. క్రియేటివిటీకి వయో పరిమితులు ఏమీ లేవని నా అభిప్రాయం. చివరి శ్వాస వరకు ఆలోచిస్తూనే ఉంటాం. అలాగని గతమంతా తలచుకుంటూ ఆనందపడిపోయి నేను చేయవలసింది ఏమీ లేదని కాదు. యాక్టర్, సింగర్, పెయింటర్‌... ఏ క్రియేటివ్‌ ఆర్టిస్ట్‌ అయినా ఇది కాదు ఇంకేదో ఉందనుకుంటాడు. ‘నువ్వు చాలా గొప్పగా నటించిన సినిమా ఏది?’ అని ఎవరినైనా అడిగితే... ఠక్కున ఒకటి చెప్పేస్తే అది కరెక్ట్‌ కాదు. అప్పటికి ఓకే. కానీ, మనసు మాత్రం ఇంకా ఎంతో ఉందని చెబుతుంది. అప్పుడే మనుగడ.

నేను అలాంటి నమ్మకం ఉన్నవాణ్ణి. ఇవి చాలా డెలికేటెడ్‌ ఇష్యూస్‌. ఎప్పుడైనా ఎవ్వరూ లేనప్పుడు నాలుగు గోడలే నా ప్రేక్షకులు అనుకుని నా సినిమాలు నేను చూసుకున్నప్పుడు విపరీతమైన ఆనందం కలుగుతుంది. ఎందుకంటే అప్పుడు మనకీ ఆలోచన ఎలా వచ్చింది? అనిపిస్తుంటుంది. దురదృష్టం ఏంటంటే... అన్ని విషయాలనూ అందరితో పంచుకోలేం. కొన్నింటిని మాత్రమే క్లోజ్‌ ఫ్రెండ్స్‌తో పంచుకోగలం. అలా అని పాతవన్నీ తలుచుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నానని కాదు.

నిజజీవిత, వాస్తవిక కథలు మిమ్మల్ని ఆకర్షించలేదా?
విశ్వనాథ్‌: లేకేం! ఒకప్పుడు నాకు ఎమ్‌.ఎస్‌. సుబ్బలక్ష్మిగారి పేరిట ‘విదుషీమణి’ అని సినిమా చేయాలనే ఒక కోరిక వచ్చింది. బయోపిక్స్‌ అనేవి ఒళ్లు దగ్గరపెట్టుకుని చేయాల్సినవి. ధృవీకరించిన విషయాలను చెప్పాలి. వాస్తవికంగా ఉండాలి. కల్పనగా ఉండకూడదు. అలా ఎప్పుడైతే చేయాలనుకుంటామో అప్పుడు భయం వేస్తుంది. అందుకే నేను బయోపిక్స్‌ జోలికి పోలేదు.

ఇప్పుడు ‘శంకరాభరణం’ ఉంది. రాత్రికి రాత్రి శంకరశాస్త్రిగారి పాత్రలో  మార్పులు చేయగలను. నన్నెవరూ అడగరు. అదొక ఫిక్షన్‌. సినిమా ఒక ఎఫెక్షన్‌. నా సినిమాలన్నీ, కథలన్నీ ఎప్పటికప్పుడు సొంతంగా ఆలోచించుకుని, అప్పటికప్పుడు విశ్వామిత్రుని సృష్టిలా.. ఇంచ్‌ బై ఇంచ్‌ పెంచుకుంటూ పోయి, దానిపేరు ‘సిరివెన్నెల’ అనో ‘స్వర్ణకమలం’ అనో ‘సూత్రధారులు’ అనో పేరు పెట్టుకుంటూ పోయి.. నా వస్తువులనే నమ్ముకుంటూ, వాటి మీద శ్రద్ధ పెట్టి కథలను తీర్చిదిద్దాను.

రామ్‌గోపాల్‌ వర్మ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు విశ్వనాథ్‌గారికి తక్కువ.. విశ్వనాథ్‌గారు ఆయన కంటే గొప్పవారు అన్నారు. మీరేమంటారు?
విశ్వనాథ్‌: అతని అభిప్రాయం అతనిది. అంతవరకే.  నా మీద గౌరవం కానివ్వండి... లవ్‌ కానివ్వండి.. అందుకే ఆయన అలాంటి మాటలు అన్నారు.. నన్ను పొగడడానికి.

మీరు తీసిన సినిమాల్లో మిమ్మల్ని కష్టపెట్టిన సినిమా?
విశ్వనాథ్‌: నన్ను మానసికంగా బాగా ఇబ్బంది పెట్టి, బాగా చిత్రవధ చేసేసి, రాత్రీపగలూ ‘ఎందుకు ఈ సబ్జెక్ట్‌ తీసుకున్నాం. మధ్యలో వదల్లేం. కంటిన్యూ చేయలేం, మార్గం కనిపించడం లేదు’ అని బాధ పెట్టిన సినిమా ‘సిరివెన్నెల’. అసలు ఒక మూగ అమ్మాయి ఏంటి? ఒక గుడ్డివాడు ఏంటి? వారిద్దరి మధ్యనా కనెక్షన్‌ ఏంటి? లిటికేషన్‌ ఏంటి? కథకుడిని నేనే కదా... దారిని సుగమంగా చేసుకోవచ్చు కదా. ఏదేమైనా అలాంటి క్లిష్టమైన సినిమాలు తీసినందుకు ఇప్పటికీ గర్వంగా ఉంటుంది.

మీరెంతో మందితో సినిమాలు తీశారు. వాళ్లల్లో మీ ఫేవరట్‌ యాక్టర్‌?
విశ్వనాథ్‌: అలా నాకు ఏ భేదం లేదు. ఆ సినిమా అయ్యేంత వరకు చిరంజీవిగారితో చేస్తుంటే నేను ఆయనకు సొంతం. ఆయన నాకు సొంతమైపోయి నటిస్తారు. అయిపోయింది వదిలేసుకుంటున్నాం అంటే అది అలాగే ఉంటుంది. ఇంట్లో కూడా నేను కొన్ని విషయాలను సీరియస్‌గా ఆలోచించకపోవచ్చు. అమ్మాయి సంబంధానికి కూడా నేను అంత ఇదిగా ఆలోచించకపోయి ఉండవచ్చు.

కానీ, ఈ పాత్ర ఇక్కడ ఏం చేస్తుంది? ఎలా వ్యవహరిస్తుంది? అని నేను పడుతున్న బాధను ఒక ఆర్టిస్టుకు ట్రాన్స్‌లేట్‌ చేసి చెప్పడం, ఆ ఆర్టిస్టు దాన్ని తన నటన ద్వారా చూపించడం... రెండూ సరిగ్గా కుదరడం ముఖ్యం. సీన్స్‌ని ఆర్టిస్టుకి వివరిస్తాను. మేం మా అభిప్రాయాలను పంచుకుంటాం. ఈ సినిమా పూరైన తర్వాత ఆయన ఎవరో? నేనెవరో? అంతే కదా. అయినా ఆ కాసేపు అతను నావాడు. నా మనిషి.. అంతే!

ఆ అయిదు సినిమాలు బాగా నచ్చాయి
విశ్వనాథ్‌గారి సినిమాల్లో నాకు అన్నీ ఇష్టమే. బాగా మనసుకి నచ్చిన ఐదు సినిమాలంటే శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, స్వర్ణకమలం. వీటిలో ‘సిరివెన్నెల’ నా ఇంటి పేరుగా మారిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ విశ్వనాథ్‌గారు సినిమాలు తీశారు. -సిరివెన్నెల సీతారామశాస్త్రి

శంకరాభరణం: శంకర శాస్త్రి గొప్ప సంగీత విద్వాంసుడు. ఊరంతా వెలివేసిన వేశ్య తులసికి మానవీయ దృక్పథంతో ఆశ్రయం కల్పిస్తాడాయన. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న శాస్త్రిని ఆదుకోవడానికి ఆయనకు తెలియకుండానే ఓ సంగీత కచేరీ ఏర్పాటు చేస్తుంది తులసి. ఆ వేదికపై తులసి కొడుకుని తన సంగీతవారసుడిగా ప్రకటించి, కన్నుమూస్తాడు శంకరశాస్త్రి. అతని పాదాల దగ్గరే ఆమె కన్ను మూస్తుంది. ‘మాస్‌’ చిత్రాల హవా సాగుతున్న టైమ్‌లో విశ్వనాథ్‌ తీసిన ఈ మ్యూజికల్‌ మూవీ మేజిక్‌ చేసింది.

సాగర సంగమం: పెళ్లయ్యి, భర్తకు దూరంగా ఉంటుంది మాధవి. నాట్యాన్ని ఇష్టపడే బాలూని ప్రోత్సహించాలనుకుంటుంది. ఒకరి పట్ల మరొకరికి ఆరా«ధన మొదలవుతుంది. ఈలోగా మాధవి భర్త రావడంతో ఇద్దరూ దూరమవుతారు. మద్యానికి బానిస అయిన బాలు కొన్నేళ్లకు మాధవికి తారసపడతాడు. ఆమె కూతురికి నాట్యం నేర్పిస్తాడు. చివరికి మాధవి సమక్షంలోనే తుది శ్వాస వదులుతాడు. ఆ ఇద్దరి గుండెల్లో దాగున్న ప్రేమ ప్రేక్షకుల హృదయాన్ని మెలిపెడుతుంది.

స్వాతిముత్యం: పెద్దలను ఎదిరించి ప్రేమించి, పెళ్లి చేసుకున్న లలిత భర్త చనిపోవడంతో ఒంటరిదవుతుంది. ఆమెకు సహాయం చేయాలంటే పెళ్లి చేసుకోవాలనుకుని, మూడు ముళ్లూ వేసేస్తాడు అమాయకుడు శివయ్య. అప్పటివరకూ పనీపాటా లేకుండా తిరిగిన శివయ్య లలితనూ, ఆమె కొడుకునీ పోషించడానికి గుడిలో ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ తర్వాత జరిగే అనేక మలుపులతో ఎమోషనల్‌గా సాగే ఈ చిత్రం ఓ ఆణిముత్యం.

సిరివెన్నెల: అంధుడైన వేణువు విద్వాంసుడు, మూగ చిత్రకారిణి చుట్టూ తిరిగే ప్రేమకథ ‘సిరివెన్నెల’.  ప్రేమకు మాట రాకపోయినా, చూపు లేకపోయినా మనసు ఉంటే చాలని చెప్పే సినిమా. ‘విధాత తలపున ప్రభవించినది..’, ‘ఈ గాలి ఈ నేల..’, ‘ఆది భిక్షువు వాడినేమి కోరేది..’ వంటి హిట్‌ పాటలతో ప్రేక్షకుల హృదయాలను మీటిన చిత్రం ఇది.

స్వర్ణకమలం: కూచిపూడి నృత్యం నేర్చుకున్న మీనాక్షికి ఈ కళలు కడుపు నింపవనే భావన . విలాసవంతమైన జీవితం గడపాలనుకుంటుంది. మీనాక్షి నాట్యం చూసి చంద్రశేఖర్‌ అభిమానించి, ఓ నృత్యప్రదర్శన ఏర్పాటు చేయిస్తాడు. మీనాక్షికి ఇది నచ్చదు. ఆ తర్వాత అమెరికాలో ఉన్న ఓ భారతీయ నర్తకి సహాయంతో మీనాక్షికి అక్కడికెళ్లే ఏర్పాటు చేస్తాడు. ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టిన క్షణం నుంచి చంద్రశేఖర్‌కి తన పట్ల ఉన్న ప్రేమ అర్థమవుతుంది. మనసు మార్చుకుని అమెరికా వెళ్లకుండానే వెనుదిరుగుతుంది మీనాక్షి. ఈ చిత్రం ఓ స్వర్ణకమలం.

సంపూర్ణమైన జీవితానికి కావాల్సిన అంశాలన్నీ చాలా సున్నితంగా స్పృశిస్తూ, మీ ప్రయాణం సాగింది. ఇది మీరు సంకల్పించుకోకపోయినా... మీకు ఓ బాట ఏర్పడిపోయింది. ఇది దైవేచ్ఛ అంటారా? విశ్వనాథ్‌గారి ఇచ్ఛ అంటారా?
విశ్వనాథ్‌: నాకు ఇచ్ఛ ఉంటే ఉండొచ్చు. అది నెరవేరాలంటే దైవేచ్ఛ ఉండాలి. నాకు ఓ రోల్స్‌ రాయిస్‌ కారు కావాలని కలగనొచ్చు. అది తప్పు కాదు. టు గెట్‌ దట్‌ రోల్స్‌ రాయిస్‌ కార్‌ అండ్‌ ఎంజాయ్‌.... నాకు దేవుడి సహాయం కావాలి. మంచి అవార్డు రావాలి. నా సినిమా చూసి ప్రతివాడు ‘ఇది ఫలానా వాడి సినిమా, ఇది అతని స్టాంప్‌’ అనుకోవాలని లోపల తప్పకుండా నాకు కోరిక ఉంటుంది. అందుకోసమే అహర్నిశలు నేను ప్రయత్నిస్తా. అది బయటకు చెప్పను. కానీ, నా లక్ష్యం అదే. దానికోసం పనిచేస్తాను. దేవుడు నాకు అవకాశం కల్పించాలని వెయిట్‌ చేస్తాను. ‘పని చేస్తా. ఫలితం గురించి ఆలోచించను’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతా.

– స్వప్న, ‘సాక్షి’ టీవీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement