
గిన్నిస్ లైట్లు : లైట్లతో... గిన్నిస్ రికార్డులలో!
ఇంకా డిసెంబర్ కూడా రాకముందే క్రిస్‌మస్ సంబరాలను హోరెత్తిస్తోంది ఆస్ట్రేలియాలోని ఒక కుటుంబం. ఆ దేశ రాజధాని కాన్‌బెర్రాలోని డేవిడ్ రిచర్డ్స్ ఫ్యామిలీ తమ ఇంటి ఆవరణలో ఐదు లక్షలకు పైగా లైట్లను అలంకరించి గతంలో ఉన్న రికార్డును తుడిచి పెట్టి మరీ గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
ఇంకా డిసెంబర్ కూడా రాకముందే క్రిస్‌మస్ సంబరాలను హోరెత్తిస్తోంది ఆస్ట్రేలియాలోని ఒక కుటుంబం. ఆ దేశ రాజధాని కాన్‌బెర్రాలోని డేవిడ్ రిచర్డ్స్ ఫ్యామిలీ తమ ఇంటి ఆవరణలో ఐదు లక్షలకు పైగా లైట్లను అలంకరించి గతంలో ఉన్న రికార్డును తుడిచి పెట్టి మరీ గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. నెలరోజుల పాటు వీటిని అవాంతరం లేకుండా వెలిగించి వీరు పండగ సంబరాలు జరుపుతారట. గత మూడు సంవత్సరాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈ విధమైన క్రిస్‌మస్ సంబరాల విషయంలో అనేక మంది పోటీ పడుతున్నారు. తమ ఇళ్ల ఆవరణలో లైట్ల డెకరేషన్‌తో వీరు రికార్డులు సృష్టిస్తున్నారు.
2011లో తొలిసారి రిచర్డ్స్ వాళ్ల ఫ్యామిలీనే 3.3 లక్షల లైట్లను తమ ఇంటి ఆవరణలో అమర్చి గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఆ తర్వాతి యేడాది న్యూయార్క్‌కు చెందిన ఒక కుటుంబం 3.4 లక్షల లైట్లతో వీళ్ల రికార్డును బ్రేక్ చేసి గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించింది. అయితే ఈ విషయాన్ని ప్రతిష్టగా తీసుకొన్న రిచర్డ్స్ ఫ్యామిలీ ఈసారి ఐదు లక్షల లైట్లను ఏర్పాటు చేసి తిరిగి రికార్డును తమ సొంతం చేసుకొంది. క్రిస్‌మస్ పండగ వరకూ రిచర్డ్స్ ఇంటిముందు ఈ ఏర్పాట్లు ఇలాగే ఉంటాయి. విశేషం ఏమిటంటే... వీళ్లింట్లో పండగ సంబరాలు ఇంత వైభవంగా జరుగుతుంటే ఇరుగూ పొరుగూ కుళ్లుకుంటూ రిచర్డ్స్ ఫ్యామిలీతో మాటలు బంద్ చేశారట!