భర్త అనుమానపు వైఖరికి రమ్య మనసు భగ్గున మండింది. వెంటనే సూట్‌కేస్ సర్దుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లి గుండెల మీద తలవాల్చి భోరుమంది. విషయం తెలుసుకున్న తల్లి ‘‘ఇంత చిన్నదానికే ఇల్లు వదిలి వచ్చేయడం ఏంటమ్మా’’ అనడంతో అవాక్కయింది రమ్య.
అనుమానంతో వేధించే భర్తలు సమాజంలో చాలామంది ఉన్నారు. అది ఒక రకంగా బాధాకరమైనదే. కాకపోతే దానికి పరిష్కారం భర్తని వదిలేయడం కాదు. అందుకే కూతురు చేసినదాన్ని సమర్థించకుండా నిజానిజాల్ని విశ్లేషించి, కర్తవ్యాన్ని బోధించింది రమ్య తల్లి.
ఆమె చెప్పినదాని ప్రకారం... కొందరు భార్యలు ఏం చేసినా తప్పు పట్టాలని చూస్తారు. ఇలాంటి వారిని మార్చడం కష్టం. మరికొందరు తన భార్యవైపు ఎవరైనా చూసినా, సన్నిహితంగా ఉన్నా తట్టుకోలేరు. అది నిజానికి అనుమానం కాదు. భార్యమీది అతిప్రేమతో కలిగే అభద్రతాభావం... అంతే!
భర్త అనుమానించడానికి కారణం ఏమిటో తెలుసుకుంటే... ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థమైపోతుంది. ఇదంతా వివరించి, ఆ పైన నీ ఇష్టం అంది. అందరూ ఆమెలా ఆలోచిస్తే సమస్యే ఉండదు. ప్రేమపూరితమైన మాటలతోనే వారిని దారిలోకి తెచ్చుకోవచ్చు. వాళ్లు అర్థం చేసుకోకపోతే కౌన్సెలింగ్ ఇప్పించవచ్చు. అదీ వర్కవుట్ కాకపోతే అప్పుడు ఆలోచించాలి. అంతే కానీ, రమ్యలా చేయడం కరెక్ట్ కాదు.
బంధాలు దారపు పోగుల్లాంటివి. కాస్త గట్టిగా లాగితే చాలు... పుటుక్కున తెగిపోతాయి. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అందుకే నిర్ణయం తీసుకునేముందు పరిస్థితిని విశ్లేషించుకోవాలి. ఫలితం ఉండదనుకుంటేనే నిర్ణయాలు తీసుకోవాలి.
నిర్ణయం తీసుకునేముందు విశ్లేషించుకోవాలి
Published Mon, Dec 9 2013 12:41 AM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM
Advertisement
Advertisement