పెళ్ళయింది కానీ... ఆజన్మ బ్రహ్మచారి
మహా బలశాలి, అమిత పరాక్రమవంతుడు, ప్రభుభక్తి పరాయణుడు అయిన హనుమంతుడు ‘బ్రహ్మచారి’. అంటే బ్రహ్మచారిగా ఉంటేనే అలా ఉండటం సాధ్యమనుకునేరు. అది ఆయన సహజ గొప్పతనం. ఇప్పటికీ హనుమంతుడిని మనం ‘బ్రహ్మచారి’గానే చూస్తున్నా ఆయన అవివాహితుడు కాదు!
గురువుగారైన సూర్యదేవుల వారి ఆనతి మేరకు ఆయన పుత్రిక అయిన సువర్చలాదేవినే పరిణయమాడాడు. అయితే ఆమెను తన హృదయంలోనే నిలుపుకున్నాడు. సతిగా ప్రేమించాడు. అంతకు మించి హనుమంతుడు ఆమెతో ఎటువంటి సంసార బంధాలనూ ఏర్పరచుకోలేదు. మరి పెళ్లెందుకు చేసుకున్నట్టో..! అని కొందరు ప్రబుద్ధులు పెదవి విరవవచ్చు. అలాంటి వారికి సమాధానం ఏమిటంటే... కల్యాణం చేసుకోనిదే సర్వేశ్వరుడికైనా పరిపూర్ణత సిద్ధించదని లోకోక్తి. అదీగాక సాక్షాత్తూ సూర్యభగవానుడంతటి వాడు గురుదక్షిణ కోరిన తర్వాత తీర్చకుండా ఉంటే ఏం బాగుంటుంది? దానికితోడు బ్రహ్మాది దేవతలు కూడా ఆమె నీకు తగిన వధువు అని సిఫార్సు చేశారాయె. పెద్దలంటే ఉన్న గౌరవం కొద్దీ హనుమంతుడు అందుకు ఒప్పుకున్నాడు కానీ, ఒక షరతు విధించాడు.
అదేమిటంటే... ‘‘సంసార బంధాలలో చిక్కుకోవడం నాకు ఇష్టం లేదు. మీరందరూ చెబుతున్నారు కాబట్టి నేనామెను పెళ్లాడతాను. అయితే వివాహ బంధం రీత్యా ఆమె నా భార్యగా ఉంటుంది. అంతకుమించి ఆమెతో నాకు ఎటువంటి సంబంధమూ ఉండదు. అలాగని ఆమెను విడిచిపెట్టేది లేదు. నా గుండెలోనే ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి, అందులో ఆమెను నిలుపుకుంటాను. అందుకు మీరు సరేనంటేనే మీరు చెప్పినదానికి నేను సమ్మతిస్తాను’’ అంటూ తిరకాసు పెట్టాడట. ‘నువ్వు మా మాట విన్నప్పుడు మా పెద్దరికం కూడా నిలుపుకోవాలి కదా’ అన్నట్టు దేవతలందరూ సరేనన్నారట. కాబట్టి... హనుమంతుడు సంప్రదాయాలకు వివాహితుడు, ఆలోచనల్లో మాత్రం నిత్య బ్రహ్మచారి.
కొసమెరుపు: పెళ్లి విషయంలో సూర్యపుత్రిక సువర్చలా దేవి కూడా అచ్చం అలాగే ఆలోచించిందట! బహుశా పురాణాల్లో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదేనేమో!