కొంతమంది పిల్లల్లో మల విసర్జన చేయిస్తున్నప్పుడు పేగు కిందికి జారినట్లుగా అనిపిస్తుంది. ఇలా జరగడం వల్ల పిల్లలకు బాధగా కూడా అనిపించదు గానీ దాన్నిచూసి చాలామంది తల్లిదండ్రులు ఆందోళన పడటం చాలా సాధారణం. ఇలా మల ద్వారం నుంచి పేగు కిందికి జారినట్లుగా కనిపించే సమస్యను రెక్టల్ ప్రొలాప్స్ అంటారు. మలద్వారానికి సంబంధించిన మ్యూకస్ పొరల్లో కొన్ని లేదా అన్ని పొరలూ బయటకు చొచ్చుకు రావడంతో ఇలా జరుగుతుంది. (కొన్ని సందర్భాల్లో రెక్టల్ పాలిప్ ఇదే విధంగా మనకు కనపడవచ్చు). పిల్లల్లో అయితే అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఈ సమస్య కనిపించినా, పెద్దవారి విషయానికి వస్తే మహిళల్లో ఈ సమస్య ఎక్కువ.
పిల్లల్లో ఈ సమస్యకు కారణాలు
►ఇది పిల్లలు నిలబడటం మొదలుపెట్టాక (స్టాం డింగ్ పొజిషన్‌లోకి వచ్చాక) బయటపడవచ్చు. ఒకసారి కండరాల బలం పెరగగానే తగ్గిపోవడం కూడా చూస్తుంటాం.
►ఈ సమస్యకు నిర్దిష్టంగా కారణం లేకపోయినప్పటికీ డయేరియా, మలబద్దకం వంటివి ముఖ్యకారణాలు.
►ముక్కుతూ ఎక్కువసేపు మలవిసర్జన చేయాల్సి వచ్చిన పిల్లల్లో కనిపిస్తుందిది.
►నిమోనియా, కోరింత దగ్గు, పోషకాహార లోపం, కడుపులో నులిపురుగులు ఉండటం వల్ల, నరాలకు సంబంధించి ముఖ్యంగా వెన్నుపూస వంటి ఇతర సమస్యలు కూడా కారణాలు.
►సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి సమస్య వల్ల కూడా రెక్టల్ ప్రొలాప్స్ వచ్చే అవకాశం ఉంది.
చికిత్స
►చాలామంది పిల్లల్లో సహజంగా ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంటుంది. ఐతే మలబద్దకం లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
►పీచుపదార్థాలు, నీటిశాతం ఎక్కువ ఉన్న ఆహారం ఇవ్వడం.
►అవసరమైతే స్టూల్ సాఫ్ట్‌నర్స్ అంటే... లాక్టిలోస్, మినరల్ ఆయిల్ వంటివి వాడితే మలవిసర్జన సాఫీగా జరుగుతుంది.
►నులిపురుగులు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పోవడానికి చికిత్స చేయాలి.
►కొన్ని సందర్భాల్లో మాన్యువల్ రిడక్షన్ అనే ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా చాలావరకు ఫలితం ఉంటుంది. మరి కొన్ని సందర్భాల్లో మలద్వారంలో ఇంజెక్షన్స్ చేయాల్సి రావచ్చు.
►కొద్దిమందిలో అల్సర్, దానిపై గాయం అవ్వడం వల్ల సమస్య మరింత తీవ్రతరమైతే ప్రత్యేకమైన చికిత్స తీసుకోవాల్సి వస్తుంది.
ఈ సమస్య విషయంలో ఆందోళన అవసరం లేదు. సాధారణంగా ఈ సమస్య దానంతట అదే తగ్గిపోవడానికి అవకాశాలు ఎక్కువ. అయితే మరింత సమస్యాత్మకంగా మారకుండా ఉండటానికి పిల్లల డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్,
రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్
పిల్లల్లో రెక్టల్ ప్రొలాప్స్
Published Thu, Nov 21 2019 1:23 AM | Last Updated on Thu, Nov 21 2019 1:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment