వాయిదా పద్ధతొద్దు దేనికైనా
బద్ధకిష్టులకు పరిష్కార మార్గాలు
‘అబ్బబ్బ... ఎన్నాళ్ళుగానో అనుకుంటున్న పని.ఇప్పటికీ పూర్తి కాలేదు... ’ మనలో చాలామంది నోట తరచూ వినిపించే మాట ఇది. నిజానికి ఇది ఒక లోపమే! ఒక్క ముక్కలో చెప్పాలంటే - వాయిదా మనస్తత్త్వం. స్థాయిలో తేడా ఉండవచ్చేమో కానీ, మనస్తత్త్వం మాత్రం కామన్. చెడు అలవాట్లు మానుకోవడం, మంచి అలవాట్లు చేసుకోవడం, చదువులో పూర్తి చేయాల్సిన పోర్షన్, ఆఫీసులో పూర్తి చేయాల్సిన పని - ఇలా రకరకాల వాటిలో ఈ లక్షణం తొంగి చూస్తుంటుంది. ఇలాంటి మనస్తత్త్వం ఉండేవారందరినీ మనస్తత్త్వ నిపుణులు వివిధ వర్గాలుగా విభజించారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఎలా ఉంటారు, ఒత్తిడి పెరిగితే తడబడిపోతారా, ఫెయిల్యూర్ వస్తే తట్టుకుంటారా లాంటి పలు అంశాల ఆధారంగా ఈ వర్గీకరణ చేశారు. ఆ వర్గీకరణ, అలాంటి వాయిదా మనస్తత్త్వం ఉన్నవాళ్ళు తమను ఎలా చక్కదిద్దుకోవాలో చూద్దాం...
అతి ధైర్యవంతుల రకం
ఈ రకమైన వాయిదా వ్యక్తులు ఆఖరు క్షణంలో పని మొదలుపెడతారు. ఆఖరు క్షణం దగ్గర పడుతోందనే ఒత్తిడి ఉన్నప్పుడే తాము బాగా పనిచేయగలుగుతామని భావిస్తారు. సర్వసాధారణంగా వీళ్ళు తమ బద్ధకం కారణంగా ఆఖరు నిమిషం వరకు పని వాయిదా వేసుకుంటూ వస్తారు. చివరికి వచ్చేసరికి హడావిడిగా పని పూర్తి చేయాల్సొచ్చి, పొరపాట్లు చేసే ప్రమాదం ఉంటుంది. ఈ రకం వ్యక్తులు పని విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు కానీ, ఆ పని ఎంత నాణ్యంగా పూర్తయిందన్న దానిపై పట్టింపు పెట్టుకోరు.
పరిష్కారం: ఇలాంటి వ్యక్తులు మెడ మీద కత్తి లాంటి డెడ్‌లైన్‌లు పెట్టుకోవాలి. ఒక క్రమపద్ధతిలో పనులు చేసుకుంటూ వెళ్ళాలి. తమ పనిని తామే అంచనా వేసుకుంటూ పోవాలి. పనిని అనుకున్నట్లు పూర్తి చేస్తే తమను తాము అభినందించుకోవాలి. పూర్తి చేయకపోతే తమకు తామే పనిష్‌మెంట్ కూడా వేసుకోవాలి. అలా స్వీయ నియంత్రణ వల్ల వాయిదా మనస్తత్త్వాన్ని దూరం చేసుకోగలుగుతారు.
పనికి అడ్డంకులు సృష్టించుకొనే రకం
ఈ రకం వాయిదా మనుషులు కూడా ఆఖరి నిమిషంలో ఒత్తిడి మధ్య పనిచేస్తేనే తాము బాగా పనిచేయగలమని పొరపడుతుంటారు. వీళ్ళలో విచిత్రం ఏమిటంటే - తమ పనికి తామే అడ్డంకులు సృష్టించుకుంటూ ఉంటారు. పనిచేసే క్రమంలోని ఈ అడ్డంకుల రీత్యా తమకు తామే ఆ పని నుంచి పక్కకు వస్తారు. పనిలో ఆలస్యమేమిటని అడిగితే, ఆ తప్పు మరొకరి మీద నెట్టేస్తుంటారు. అయితే, ఎన్ని అడ్డంకులు వచ్చినా, పనిలో క్వాలిటీ మాత్రం తగ్గకూడదనుకుంటారు.
పరిష్కారం: మీరు గనక ఇలాంటి రకం వ్యక్తులైతే, అడ్డంకుల గురించి కూడా ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకు, పనిలో కాసేపు విరామం తీసుకొని, ఆ టైమ్‌లో ఫేస్‌బుక్ చూసుకోవడం మీకు అలవాటు అనుకుందాం. దీని వల్ల పని టైమ్ వృథా అవుతుంది. ఆ మేరకు పని ఆలస్యమవుతుంది. ఈ సంగతి గ్రహించి, మీ లంచ్ బ్రేక్ టైమ్‌లోనో ఏమో ఈ ఫేస్‌బుక్ చూసే వ్యవహారం పెట్టుకున్నారనుకోండి. ఇటు ఫేస్‌బుక్ చూడడం ఆగదు. అటు పని సమయం వృథా కాదు. మామూలు టైమ్‌కే పని పూర్తయిపోతుంది.
డెసిషన్‌ని తప్పించుకొనే రకం
ఈ రకం వాయిదా మనుషులు ఏ నిర్ణయమూ తీసుకోకుండా వాయిదా వేస్తుంటారు. వీళ్ళకు పని విషయంలోనూ భయమే. ఆ భయంతో పని అసలు మొదలే పెట్టరు. ఇలా నిర్ణయం తీసుకోవడాన్ని వాయిదా వేయడం వల్ల ఫెయిల్యూర్ వస్తుందని కానీ, ఇతరులు తమను అంచనా వేస్తారని కానీ భయం ఉండదు కదా అని తృప్తి పడుతుంటారు. ఫలానా టైమ్‌లోగా పని పూర్తి కావాలనే డెడ్‌లైన్లు ఉన్నాయంటే, తెగ బాధపడిపోతారు. చేసే పని నాణ్యంగా ఉండాలని అనుకుంటారు కానీ, ఆఖరు నిమిషంలోని ఒత్తిడిని సరిగ్గా సంబాళించుకోలేరు. సాధారణంగా ఈ రకం వ్యక్తులు తమ పనితో సంతోషంగా ఉంటారు. కానీ, ఇతరులు తమ గురించి ఏమనుకుంటారో అని తెగ వర్రీ అవుతుంటారు.
పరిష్కారం: ఇలాంటి వ్యక్తులు తమ ప్రవర్తనను మార్చుకొనేందుకు గట్టిగా నిర్ణయించుకోవాలి. ‘‘మనం ఏం చేసినా ఎదుటివాళ్ళు కొందరు జడ్జ్ చేసి, ఏదో ఒకటి అంటారు. కొన్ని విషయాల్లో మనం ఫెయిల్ కూడా అవుతాం. అయినా ఫరవాలేదు. ప్రపంచమేమీ తలకిందులు కాదు. దాని నుంచి కూడా నేర్చుకుంటా’’ అని తమకు తామే గట్టిగా చెప్పుకోవాలి.
పక్కవాళ్ళ మీద నెట్టేసే రకం
ఇలాంటి రకం వ్యక్తులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో గందరగోళంలో ఉంటారు. అందుకే, ఇతరులనే నిర్ణయం తీసుకోనిస్తారు. ఈ గందరగోళం వల్ల పని ఆలస్యమవుతుంది. ఫెయిల్యూర్ భారాన్ని కూడా ఇతరుల మీదే పడేస్తారు. వీళ్ళకు కూడా తమ పని పట్ల సంతృప్తి ఉంటుంది కానీ, ఇతరులు ఏమంటారోనన్న శంక పీడిస్తూ ఉంటుంది. ఈ రకం వాయిదా మనుషులు ఒక పట్టాన పని మొదలుపెట్టరు.
పరిష్కారం: ఇలాంటి వ్యక్తులకు ఏది ముందుగా ఎంచుకోవాలనే మీమాంస వచ్చినప్పుడు - రెండు రకాల మార్గాలున్నాయి. ఉన్నవాటిలో అతి పెద్ద పనిని ముందుగా చేపట్టి, అది అయ్యాక మిగిలిన చిన్న పనుల్లోకి వెళ్ళాలి. ఇక, రెండో పద్ధతి ఏమిటంటే - పెద్ద పనిని ముందుగానే చిన్న చిన్న పనులుగా విడగొట్టుకోవాలి. ఒక్కొక్కటీ పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి.
మొత్తం మీద తమలోని వాయిదా మనస్తత్త్వాన్ని ఎవరికి వారు గుర్తించి, సరిదిద్దుకోవాలి. బద్ధకాన్ని వదిలించుకొని, పనిలో పడాలి. పైన చెప్పిన పరిష్కార మార్గాల్ని అలవాటు చేసుకోవాలి. అందుకోసం మానసికంగా కృతనిశ్చయంతో ఉండాలి. వాయిదా పద్ధతిని సరైన సమయంలో మార్చుకుంటే, మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. పనిలో పురోగతితో, జీవితం కూడా ఆనందంగా మారుతుంది. మరింకేం... వాయిదా వేయకుండా ఆచరణలో పెట్టండి. ఆల్ ది బెస్ట్!
ఏదైనా పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకొనే రకం
ఈ రకం వ్యక్తులు తమ పని ఏ మాత్రం తప్పు లేకుండా పర్‌ఫెక్ట్‌గా ఉండాలని, అసలు విమర్శలే రాకూడదనీ అనుకోవడం వల్ల ఆలస్యం జరుగుతుంటుంది. ఈ పర్‌ఫెక్షనిజమ్‌కి మూలకారణం ఏమిటంటే మనస్సులోని ఆందోళన. వీళ్ళు పని మొదలుపెట్టేస్తారు కానీ చేయాల్సిన పనుల జాబితా మాత్రం కొండవీటి చాంతాడంత ఉంటుంది. కాబట్టి ఒత్తిడి ఎదురైనప్పుడు తడబడతారు. ఇలాంటి పర్‌ఫెక్షనిస్టులు అవతలివాళ్ళు ఏమంటారో అన్న దాని గురించి అతిగా ఆలోచిస్తుంటారు. ఇతరుల్ని నిర్ణయం తీసుకోనిచ్చి ఆందోళనను అప్పటికి దూరం చేసుకుంటూ ఉంటారు.
పరిష్కారం: పర్‌ఫెక్షనిజమ్ తప్పు కాదు కానీ పనిని వాయిదా వేయకుండా టైమ్‌కి పూర్తి చేయడం కోసం ఇలాంటి వ్యక్తులు ‘ఎస్.ఎం.ఎ.ఆర్.టి’ (స్మార్ట్ -స్పెసిఫిక్, మెజరబుల్, ఎటైనబుల్, రిలవెంట్, టైమ్ బౌండ్) లక్ష్యాలను పెట్టుకోవాలి. లక్ష్యాలు నిర్ణీతంగా, అంచనా వేయడానికి వీలుగా, అందుకోదగినట్లుగా ఉండాలి. సమయానికి తగ్గవై ఉండాలి. నిర్ణీత కాలంలో పూర్తి చేసేలా ఉండాలి. ఎవరం ఏ పని చేసినా అందులో అసలు తప్పులే లేకుండా ఉండడం అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు. జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. చేసే పనిలో ఎప్పటికప్పుడు మెరుగుదల సాధించాలి.