ఫ్యామిలీ డాక్టర్
నా వయసు 35 ఏళ్లు. ఒక ప్రైవేటు కంపెనీలో ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నాను. మాకు ఎప్పటికప్పుడు టార్గెట్స్ ఉంటాయి. ఇతర కంపెనీల నుంచి పోటీ వల్ల పని ఒత్తిడి కూడా ఎక్కువైంది. అయితే కొంత కాలం నుంచి నేను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నాను. గుండె బరువుగా ఉండటం, ఛాతీలో నొప్పి రావడంతో పాటు ఒక్కోసారి గుండె అతి వేగంగా కొట్టుకోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాను. డాక్టర్‌ను కలిస్తే బీపీ ఉందని చెప్పారు. మందులు రాసిచ్చారు. వాడుతున్నాను. ఉద్యోగపరమైన ఒత్తిడి తగ్గించుకోవాలన్నారు. కానీ టార్గెట్ పూర్తి చేస్తేనే జీతం వస్తుంది. ఈ వయసులో ఉద్యోగం మారలేను. పని ఒత్తిడి వల్ల నాకు భవిష్యత్తులో ఎలాంటి గుండె సంబంధిత వ్యాధులు రావచ్చు? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో దయచేసి చెప్పండి. - శ్రీధర్, నిడదవోలు
సాధారణంగా బీపీ లేదా గుండెజబ్బులు అప్పట్లో వయసు రీత్యా మాత్రమే వచ్చేవి. కానీ గత దశాబ్దకాలం నుంచి పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. ఉద్యోగం, జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి లేదా ఇతరత్రా కారణాల వల్ల నిండా పాతికేళ్లు నిండని వయసు వాళ్లలో కూడా గుండె సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. ఒక్కోసారి తీవ్రమైన అనర్థాలు కూడా జరుగుతున్నాయి. బీపీతో మొదలైన సమస్య తీవ్రమైన గుండెపోటుకు దారితీస్తుంది. చికిత్స అందించి ప్రాణాలను కాపాడే సమయం కూడా ఒక్కోసారి ఉండకపోవచ్చు. గుండె సమస్యలనేవి ఆ స్థాయిలో లోలోపలే చేయాల్సిన చేటును చేసేస్తాయి. ఇక మీ విషయానికి వస్తే... మీరు చెబుతున్న లక్షణాలు గుండెకు సంబంధించిన సమస్యలేనని కచ్చితంగా చెప్పవచ్చు. పని ఒత్తిడి వల్ల ఇప్పటికే మీరు బ్లడ్ ప్రెషర్ బారిన పడ్డారు. అలాగే మీరు ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి కావడం వల్ల గుండె లయలోనూ మార్పులు సంభవిస్తున్నట్లు కనిపిస్తోంది. మీరు ఎక్కువగా మీ లక్ష్యాల గురించి ఆలోచిస్తుండటంతో అది మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇక పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం భవిష్యత్తులో గుండె జబ్బులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సమస్య ఇప్పుడు చిన్నదిగా కనిపించినా, ఆ తర్వాత బీపీ హెచ్చుతగ్గులకు లోనవుతుంది. మీ కుటుంబలోగానీ, మీ వంశంలో గానీ ఎవరికైనా గుండెజబ్బులు లాంటివి ఉంటే త్వరగా అవి మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
మీరు వెంటనే దగ్గర్లోని కార్డియాలజిస్ట్‌ను కలిసి వీలైనంత త్వరగా సరైన పరీక్షలు చేయించి, గుండె పనితీరును తెలుసుకొని తగిన మందులు వాడాల్సిన అవసరం ఉంది. మీరు సాధ్యమైనంతవరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ లక్ష్యాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్త వహించండి. రోజుకు కనీసం అరగంట పాటు వ్యాయాయం, లేదా వాకింగ్ చేయండి. మంచి జీవనశైలి నియమాలు పాటించండి. పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మానసికంగానూ ప్రశాంతత చేకూరుతుంది. ఆరోగ్యమూ కుదుట పడుతుంది.
డాక్టర్ ఎ. రవికాంత్
సీనియర్ కార్డియాలజిస్ట్
యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్
తలనొప్పి తగ్గేదెలా?
నాకు 26 సంవత్సరాలు. గత మూడు నెలలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాను. తల చుట్టూ తాడు బిగించినట్లుగా నొప్పి వస్తోంది. ఒక్కోసారి రోజంతా కూడా వస్తోంది. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - నీరజ్, వరంగల్
మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు టెన్షన్ తలనొప్పితో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఆలోచనలు ఎక్కువ కావడం, మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి ఎక్కువ కావడం, మానవసంబంధాలలో మార్పులు రావడం వల్ల కూడా తలనొప్పి రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో మనం ఒత్తిడి తగ్గించేందుకు ఉపయోగపడే రిలాక్సేషన్ థెరపీ, కౌన్సెలింగ్‌తో తగిన ఉపశమనం పొందవచ్చు. అప్పటికీ తగ్గకపోతే మందులు వాడటంతో కూడా యాభై శాతం కేసుల్లో తలనొప్పిని తగ్గించవచ్చు. దాదాపు మూడు నుంచి ఆరు నెలల పాటు ఈ మందులు వాడాల్సి ఉంటుంది. అయితే ముందుగా మీ సమస్యకు ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి డాక్టర్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించి, సమస్యను నిర్ధారణ చేసుకున్న తర్వాతే మందులు వాడాలి.
నా వయసు 30 ఏళ్లు. గత పదేళ్లుగా తలనొప్పితో బాధపడుతున్నాను. తలనొప్పి వచ్చే ముందు చూపు సరిగా కనిపించదు. తర్వాత భరించలేనంత నొప్పి వస్తోంది. ఆ తర్వాత ఏ మాత్రం శబ్దం విన్నా, ఎండ చూసినా తట్టుకోలేకపోతున్నాను. నొప్పి వచ్చిన రెండు రోజుల వరకు నీరసించిపోతున్నాను. మా అమ్మగారికి కూడా తలనొప్పి వస్తోంది. దయచేసి నాకు సరైన సలహా ఇవ్వండి. - శైలజ, విజయవాడ
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు మైగ్రేన్ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ముఖ్యంగా యుక్తవయసులో ఉన్న యువతుల్లో ఎక్కువ. వేళకి భోజనం చేయడం, ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండటం, కంటి నిండా నిద్రపోవడం వంటివి చేయడం ద్వారా దీన్ని చాలావరకు నివారించవచ్చు. అయితే బాగా ఎండలోగానీ, చలిలోగానీ బయటకు వెళ్లకపోవడం మేలు. పని ఒత్తిడి ఎక్కువైనా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పనిచేసే చోట సరైన పొజిషన్‌లో కూర్చుని పనిచేయడం కూడా ముఖ్యమే. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చేయడం అవసరం. పైన పేర్కొన్న జాగ్రత్తలను పాటిస్తూ, ఈ మైగ్రేన్ తలనొప్పి మళ్లీ రాకుండా మందులు వాడాల్సి ఉంటుంది. మీరు ముందుగా మీకు దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను సంప్రదించి, సమస్య నిర్ధారణ జరిగాక, తగిన మందులు వాడితే మీ సమస్యను పూర్తిగా నయం చేయవచ్చు.
డాక్టర్ మురళీధర్‌రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్
బంజారాహిల్స్, హైదరాబాద్