పొట్టి అని చింత ఏలనోయ్...
అధ్యయనం
పొట్టిగా ఉన్నామని బాధపడనక్కర్లేదనీ, ఆత్మన్యూనతకు గురి కావలసిన అవసరం లేదనీ చెబుతున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. వాళ్లు చెప్పే శుభవార్త ఏమంటే, పొడుగైన పురుషులతో పోల్చితే పొట్టిగా ఉన్నవాళ్ల జీవితకాలం ఎక్కువ.
షార్ట్ స్టేచర్(చిన్న రూపం)కూ, ఎక్కువకాలం జీవించడానికి సంబంధించిన జీన్స్‌కూ సంబంధం ఉంటుందని ఆ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రొటెక్టివ్ జీన్‌ను జ్ఠౌ03 అని పిలుస్తారు. అంతేకాదు, పొట్టిగా ఉన్న వాళ్లలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు పొడుగు వాళ్లతో పోల్చితే తక్కువగా ఉంటాయి.
పొట్టి, పొడుగు వాళ్లను ఎంచుకొని జీవనశైలి, ఆరోగ్య పరిస్థితి...తదితర విషయాలు అధ్యయనం చేసింది ప్రొఫెసర్ విల్‌కాక్స్ బృందం.
‘‘మేము చెప్పిందే అంతిమసత్యం అనుకోవడం లేదు, కానీ ఎత్తుకు, జీవితకాలానికి బలమైన సంబంధం ఉందని బలంగా చెప్పవచ్చు’’ అంటున్నాడు విల్‌కాక్స్.
‘‘జంతువుల రూపాలకు, జీవితకాలానికి గల సంబంధం గురించి మనకు తెలుసు. మనిషి విషయంలో మాత్రం తెలియదు. ఆ దిశగా మేము ప్రయత్నించాం’’ అంటున్నాడు ఆయన.
పరిశోధనకు ఎంచుకున్న పురుషులలో కొందరి వయసు 90, 100 వరకు ఉంది. ఇటాలియన్ దీవి సార్టినియాలో పొట్టిగా ఉన్న పురుషులు, తమ వయసు ఉన్న పొడవైన పురుషులతో పోల్చితే రెండు సంవత్సరాలు ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు కనుగొన్నారు.
చివరగా ఓ మాట: పొట్టిగా ఉన్న ఎలుకలు, కోతులు సాధారణంగా ఎక్కువ కాలం జీవిస్తాయి. చిన్నగా ఉండే ఆసియన్ ఏనుగు, పెద్దదైన ఆఫ్రికన్ ఏనుగు కంటే ఎక్కువ కాలం జీవిస్తుంది.