కొడుకిచ్చిన డాక్టరేట్‌ | Dr Stravanthi is an Employee of the Social Welfare Department | Sakshi
Sakshi News home page

కొడుకిచ్చిన డాక్టరేట్‌

Published Mon, May 13 2019 1:30 AM | Last Updated on Mon, May 13 2019 9:19 AM

Dr Stravanthi is an Employee of the Social Welfare Department - Sakshi

డాక్టర్‌ స్రవంతి సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగిని. ఒక వైపు ఉద్యోగ నిర్వహణ, మరోవైపు తల్లిగా నిర్విరామ శ్రమ. రెండేళ్లకోసారి బదలీలు. ఉద్యోగరీత్యా తరచు క్షేత్రస్థాయిలో తిరగాల్సి రావడం. వీటన్నిటి ఒత్తిడిలో ఆటిజంతో బాధపడుతున్న తన కుమారుడ్ని చూసుకోవడం ఆమెకు శక్తికి మించిన బాధ్యత అయింది. అయినా కూడా ఆమె నిస్పృహ చెందలేదు.  మానసిక ఎదుగుదల లేని తన బిడ్డను కంటికి రెప్పలా కాడుకుంటూ వస్తున్నారు. అంతేకాదు, తనబిడ్డలా ఇంకా ఎంతమంది ఉన్నారు, ఈ సమస్యకు పరిష్కారమేమిటి అనే అంశాలపై ఆమె పరిశోధన చేశారు.    ఎస్వీయూ నుంచి డాక్టరేట్‌ పొందారు.

ఆ వివరాలు స్రవంతి మాటల్లో..‘‘మా స్వస్థలం అనంతపురం జిల్లా. ఉద్యోగ రీత్యా తిరుపతిలో స్థిరపడ్డాం. సాంఘిక సంక్షేమ శాఖలో వివిధ ప్రాంతాల్లో పనిచేశాను. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే రవికుమార్‌తో 1996లో వివాహమైంది. 1999లో బిడ్డ పుట్టాడు. పేరు చందన్‌. అయితే ఏడాది వయస్సు వచ్చినా వాడిలో ఎలాంటి స్పందనలు లేవు. చాలాచోట్ల చూపించాం. ఫలితంలేదు. మూడు సంవత్సరాల వయస్సు వున్నప్పుడు సికింద్రాబాద్‌లోని ఎన్‌ఐహెచ్‌ఎం సంస్థ వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాం. ఆటిజం అని చెప్పారు! ఈ సమస్యతో బాదపడేవారు వారిలో మానసిక ఎదుగదల వుండదు. చూసేవాళ్లు ఎవరూ లేక చందన్‌ని వెంట పెట్టుకునే విధులకు హాజరయ్యేదాన్ని.

ఓసారి చందన్‌ తనకు తెలియకుండా మా ఇంటికి సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకున్నాడు. దాంతో శరీరమంతా షాక్‌కు గురై 16 సర్జరీలు జరిగాయి. ఆ సందర్భంలో ఎంతో ఒత్తిడికి గురయ్యాను. నా బిడ్డకు ఇలా అవుతోందేమిటి అని మనోవేదనకు గురయ్యాను. సాధారణంగా తల్లిదండ్రులు ఈ సమస్యతో బాధపడే పిల్లలను కొంత నిర్లక్ష్యం చేస్తారు. బాగా వుండే పిల్లలపై చూపే శ్రద్ధ వీరిపై చూపరు. ఆ స్థితి నా బిడ్డకు రాకూడదనే లక్ష్యంతో ఇంకో బిడ్డను వద్దనుకున్నాను. ఇలాంటి సమస్య ఉన్న పేరెంట్స్‌కి పరిష్కారం చూపాలని అనుకుని పరిశోధనకు పూనుకున్నాను. ఈ పరిశోధనకు నా అనుభవమే గ్రంథాలయమైంది. ఇల్లే ప్రయోగశాలగా మారింది. నా బిడ్డే నా పరిశోధనకు కేంద్రబిందువయ్యాడు. 

పదకొండేళ్ల పరిశోధన 
నేను 1992లో సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగంలో చేరాను. ఒక వైపు  ఉద్యోగం చేస్తూనే మరోవైపు చందన్‌ని కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చాను. ఆటిజంపై పరిశోధన కోసం 2008లో ఎస్వీయూ సైకాలజీ విభాగంలో పిహెచ్‌డీకి చేరాను. ‘హ్యాండ్లింగ్‌ ప్రాబ్లమ్‌ బిహేవియర్‌ ఆఫ్‌ ఆటిస్టిక్‌ మెంటల్లీ చాలెంజ్డ్‌ చిల్డ్రన్‌’ అనే అంశాన్ని తీసుకున్నాను. అలా పదకొండేళ్ల నా పరిశోధనలో అనేక విషయాలను తెలుసుకున్నాను. ఆటిజం ఉన్న పిల్లలు తమకు ఏం కావాలో చెప్పలేరు.

కమ్యూనికేట్‌ చేయలేరు. కొంతమంది ఎక్కువగా మాట్లాడుతుంటారు. అలాంటి వారిని నియంత్రించలేం. ప్రతి చిన్నవిషయానికీ బాధపడుతుంటారు, భయపడుతుంటారు. వీళ్ల విషయంలో ఎక్కువ శ్రద్ద చూపాలి. ఆటిజం ఉన్నపిల్లలను త్వరగా గుర్తించలేం. అయితే తగినంత ప్రత్యేక పద్దతుల్లో రెండుమూడు వారాల్లోనే గుర్తించవచ్చు. ఇలా గుర్తించినప్పుడు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుంటేకొంత మేలు చేకూరుతుంది.

రీహాబిలిటేషన్‌ కల్పించాలి
ఆటిజంతో జన్మించిన పిల్లలు తమ తప్పులేకపోయినా తమ  ప్రమేయం లేకుండానే భూమిపైకి వస్తారు. ఇలాంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు అశ్రద్ధ చేయకూడదు. బిడ్డలు లేని స్థితికన్నా ఎవరో ఒకరు ఉన్నారన్న సంతోషంతో వారిపట్ల ప్రేమానురాగాలు చూపిస్తూ పెంచాలి. వృద్ధులు, అనాథలకు ఆశ్రమాలు ఉన్నాయి. కాని ఇలాంటి వారికి ఆశ్రమాలు లేవు. ఎన్జీవోలు, కార్పొరేట్‌ సంస్థలు చొరవ చూపి రీహాబిలిటేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి.

ఇలాంటి పిల్లల విషయంలో తల్లిదండ్రులు బతికి ఉన్నంత వరకు ఎలాంటి సమస్య వుండదు. అయితే  వారు చనిపోయాక ఏమిటనేదే ప్రశ్నార్థకం. నా పరిశోధనలో గరిష్టంగా అరవై సంవత్సరాల వయస్సు వున్న మానసిక ఎదుగదల లేని వ్యక్తిని కూడా గుర్తించాను. మన రాష్ట్రంలో ఈ తరహా తొలి పరిశోధన బహుశా నేను చేసిందే కావచ్చు. సైకాలజీ విభాగం ప్రొఫెసర్‌ డి.జమున పర్యవేక్షణలో నేను ఈ పరిశోధన చేశారు’’ అని తెలిపారు డాక్టర్‌ స్రవంతి. 

బూచుపల్లి హరిమల్లికార్జున రెడ్డి, 
సాక్షి, తిరుపతి ఫొటో: షేక్‌ మహమ్మద్‌ రఫీ

సంగీతంతో చికిత్స
నా బిడ్డ ఎలాంటి స్పందన లేకుండా వుండడం, మానసిక ఎదుగదల లేకపోవడంతో చిత్రవధ అనుభవించాను. పరిష్కారం దిశగా ప్రయత్నించాను. ఈ ప్రయాణంలో నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. కొన్ని పాటలకు బిడ్డ స్పందించడం గుర్తించాను. ఐదు పాటలను ఎంచుకుని ఆకలి, బాధ, దుఃఖం, సంతోషం, కోపం వీటికి.. స్పందించేలా చేశాను. అప్పుడు చందన్‌ తనలోని భావాలను ఈ పాటలకు ప్రతిస్పందించడం ద్వారా నాకు అర్థమయ్యేలా చేసేవాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement