
ఛల్ ఛల్ గుర్రం... కలలో గుర్రం!
స్వప్నలిపి
గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు, గుర్రంతో కలిసి ఈత కొడుతున్నట్లు, గుర్రం పరుగెడుతున్నట్లు...ఇలా రకరకాలుగా మీ కలలో గుర్రం ఎప్పుడైనా కనిపించిందా? అలా కనిపించడం వెనకాల ఉన్న అర్థం ఏమిటో తెలుసుకుందాం...
గుర్రం అనేది హుందాతనానికి, శక్తిసామర్థ్యాలకు ప్రతీక.కలలో గుర్రం కనిపించడం అనేది విస్తృత పరిధిలో సానుకూల ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా స్వాతంత్య్రం, అధికారం, లైంగిన స్వేచ్ఛ తదితర భావాలకు కలలో గుర్రం ప్రతీకగా నిలుస్తుంది. వివిధ సందర్భాలు, సన్నివేశాలను బట్టి కూడా కలల అర్థాలు మారుతుంటాయి. శ్వేత గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లు కల వస్తే... మీరు ఆర్థికంగా, మానసికంగా ఆనందంగా ఉన్నారని, కుటుంబ బంధాలు గట్టిగా ఉన్నాయని అర్థం. భూమి మీద ఏ వస్తువునైనా తాకి ఉన్నట్టుండి ఆ శ్వేత గుర్రం పడబోయినట్లు కల వస్తే... మీ సుఖసంతోషాల పట్ల మీ శత్రువులో, మిత్ర శత్రువులో ఈర్ష్యాద్వేషాలతో ఉన్నారనేది ఒక అర్థం. రెండోది... సజావుగా సాగుతున్న మీ జీవితంలోకి ఊహించని మార్పు ఏదో వచ్చి, అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లు రెండో అర్థం.
నల్లగుర్రం మీద స్వారీ చేస్తున్నట్లుగా కల వస్తే... ఆర్థిక పరంగా మీరు ఉన్నతస్థితిలో, ఏ లోటు లేని స్థితిలో ఉన్నా... మానసికంగా మాత్రం ఎక్కడో అసంతృప్తితో ఉండడాన్ని లేదా జీవనోత్సాహం తగ్గడాన్ని సూచిస్తుంది. వర్తమాన జీవితంలో ప్రతికూల ప్రభావం చూపే గత చేదు జ్ఞాపకాలను కూడా ఈ కల ప్రతిబింబిస్తుంది. గుర్రాలు పోట్లాడుకుంటున్నట్లుగా కల వస్తే... మీ సన్నిహితులతోనో, స్నేహితులతోనో విభేదాల వల్ల కలిగే మానసిక అశాంతిని సూచిస్తుంది.
పరుగెడుతున్న గుర్రం వెనకాల పరుగెత్తి దాన్ని అందుకొని సవారీ చేయాలనుకునే కల వస్తే... మీరు లేనిపోని ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని, రిస్క్ చేస్తున్నారని అర్థం. నీటిలో మీతో పాటు గుర్రం ఈత కొడుతున్నట్లు కల వస్తే... మీరు కోరుకున్నవి నిజమైనట్లు అర్థం. ఇదే కల ఒక వాప్యారస్థుడికి వస్తే వ్యాపారంలో భారీ లాభం గడించబోతున్నట్లు, లేదా గడించినట్లు అర్థం.