ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెల్లవారుజామున బాలభోగ నివేదనతో పాటు మధ్యాహ్నం మహానివేదన సమర్పిస్తారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు వంటశాల నుంచి నివేదనలను ఆలయానికి తీసుకువచ్చి దుర్గా మల్లేశ్వరస్వామివార్లతో పాటు ఉపాలయాలలోని దేవతామూర్తులకు సమర్పిస్తారు. ఈ ప్రసాదాలను మహా మండపం ఆరో అంతస్తులో ఉన్న వంటశాలలో తయారుచేస్తారు. అమ్మవారికి నివేదనను సకాలంలో సమర్పించేందుకు వీలుగా ఉప ప్రధాన అర్చకులు కోటప్రసాద్, అర్చకులు రంగావఝల శ్రీనివాసశాస్త్రి పర్యవేక్షకులుగా ఉంటారు. తొలిపూజ – నివేదన లోక కళ్యాణార్థమే తెల్లవారుజామున 2–30 గంటలకు అమ్మవారి ఆలయం తెరిచిన తరువాత తొలిపూజను లోకకళ్యాణార్థం చేస్తారు. అర్చనానంతరం అమ్మవారికి బాలభోగంగా దద్ధ్యోదనాన్ని ఉదయం ఆరు గంటలకు నివేదన చేస్తారు. ఉదయం 8–30 గంటలకు కట్టె పొంగలి, బూందీ లడ్డూ, ఉదయం 10–30 గంటలకు పులిహోర, సాయంత్రం 4–30 గంటలకు సెనగలు, పాలు సమర్పిస్తారు. ఉదయం 11–40 గంటలకు అన్ని దర్శనాలను నిలిపివేసిన, ఆలయాన్ని శుభ్రం చేసి, మహానివేదనగా అన్నం, రెండు కూరలు, పప్పు, సాంబారు, పాయసం, గారెలను అమ్మవారికి నివేదిస్తారు. అమ్మవారికి సమర్పించిన చిత్రాన్నాన్ని ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. తాజాగా ఈ సంవత్సరం దసరా ఉత్సవాల నుంచి అమ్మవారికి అప్పాలను నివేదించి, భక్తులకు ఉచితంగా అందచేయనున్నారు.
దసరా ఉత్సవాలలో ప్రత్యేకం...
సాధారణ రోజులలో మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన సమర్పిస్తుండగా, దసరా ఉత్సవాల సమయంలో మాత్రం సాయంత్రం 6–30 గంటలకు మహా నివేదన సమర్పిస్తారు. ఉదయం ఏడు గంటలకు వడలు, పది గంటలకు అమ్మవారికి రాజభోగాలుగా చక్కెర పొంగలి, పులిహోర, పాయసం, రవ్వకేసరి, పరమాన్నం, బూందీ లడ్డూ, గారెలను సమర్పిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు పంచభోగాలను నివేదిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు అన్ని దర్శనాలను నిలిపివేసిన తర్వాత ఆలయాన్ని శుభ్రం చేసి మహానివేదన సమర్పిస్తారు. అనంతరం పంచహారతులు, చతుర్వేద స్వస్తి జరుగుతుంది. దసరా ఉత్సవాలలో మహానివేదనతో పాటు మరికొన్ని వంటకాలను అమ్మవారికి నివేదనగా సమర్పిస్తున్నామని ఆలయ అర్చకులు చెబుతున్నారు.
దసరా ఉత్సవాలు – అలంకారాలు – నివేదనలు
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి– స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి (మైసూర్‌పాక్, పులిహోర)
ఆశ్వయుజ శుద్ధ విదియ – బాలాత్రిపుర సుందరీదేవి (లడ్డూ, పెసర వడ)
ఆశ్వయుజ శుద్ధ తదియ– గాయత్రీదేవి (సున్నుండలు, అరటికాయ బజ్జీ)
ఆశ్వయుజ శుద్ధ చవితి – లలితాత్రిపుర సుందరీదేవి (కొబ్బరి లవుజు, మినప వడ)
ఆశ్వయుజ శుద్ధ పంచమి – సరస్వతీదేవి (జాంగ్రీ, ఆవడ)
ఆశ్వయుజ శుద్ధ షష్ఠి – అన్నపూర్ణాదేవి (గోధుమ హల్వా, సెనగ వడ)
ఆశ్వయుజ శుద్ధ సప్తమి – మహాలక్ష్మీదేవి (చక్కెర పొంగలి, బొబ్బర్ల గారె)
ఆశ్వయుజ శుద్ధ అష్టమి – దుర్గాదేవి (పాయసం, బూందీ)
ఆశ్వయుజశుద్ధ నవమి/దశమి – మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరీదేవి (అప్పాలు, పెసర పునుగులు)
– ఉప్పులూరు శ్యామ్ ప్రకాష్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment