‘రక్షాబంధనం’ అనేది అన్న చెల్లెలికి ఇచ్చేరక్షణకు సంబంధించినది మాత్రమే కాదు. సమాజం పట్ల బాధ్యతను తెలియజేసేది.ఒక్క మార్పుతో ఈ పండగను మరింతవేడుకగా జరుపుకోవచ్చు. అదెలాగో చెబుతున్నాయి కొన్ని పర్యావరణహిత సంస్థలు.
1. మొక్కలకే రాఖీలు
మీరు మనసు పెడితే మొక్కలకే రాఖీలను పూయించవచ్చు అంటున్నారు గార్గి. ‘బా నో బాట్వో’ వ్యవస్థాపకులు గార్గి ఔరంగాబాద్ నివాసి. చెట్లు, మొక్కల నుంచి ఆకులు, గింజలు, షెల్ ..వంటి భాగాలను సేకరించి వాటిని రాఖీల తయారీ కోసం వాడుతున్నారు. ఆన్‌లైన్ ప్రచారం ద్వారా ‘నా సోదరి నా బలం’ అనే ట్యాగ్‌తో క్యాంపెయిన్ ద్వారా గార్గి మరో మైలురాయి దాటారు.
2. హెచ్‌ఐవీ పిల్లలకు రాఖీ
బెంగుళూరులోని జీసస్ హెచ్‌ఐవీ హోమ్‌లో ఏడాది నుంచి పదేళ్ల వయసున్న హెచ్‌ఐవీ ప్రభావిత పిల్లలు తలదాచుకుంటున్నారు. వీరికి ‘సీడ్ పేపర్ ఇండియా’ వ్యవస్థాపకులు రోషన్ రాయ్ పర్యావరణ హితమైన రాఖీలను రెండేళ్లుగా అందిస్తున్నారు. ఈ రాఖీలు ఎలా ఉంటాయంటే .. మొక్క వచ్చేందుకు అనువైన విత్తనాలు, సేంద్రీయ ఎరువులు, కొబ్బరినారతో తయారు చేసిన కార్డులను.. ఇలాంటి వాటితో ఒక కిట్‌ని రూపొందించి వారికి ఇస్తున్నారు.
3. స్లమ్ మహిళలకు ఉపాధి
ప్రజలతో కలిసి పనిచేస్తేనే అనుభవాలు పువ్వుల పరిమళాలవుతాయి. ఢిల్లీ వాసి సౌరభ్ డిగ్రీ తర్వాత సొంతంగా బాల్ పెన్ తయారీ వ్యాపారం పెట్టుకున్నాడు. ఏడాది గడిచాక పెన్నులన్నీ ప్లాస్టిక్‌వే అని ఆ వ్యాపారాన్ని వదులుకున్నాడు. ‘బయో క్యూ’ పేరుతో ‘పర్యావరణహితమైన స్టేషనరీ’ని ఏర్పాటు చేశాడు. ఈ కంపెనీ ద్వారా ప్రతి నెలా 5–6 లక్షల విత్తనాల పెన్నులు, పెన్సిళ్లను తయారు చే యడం మొదలుపెట్టాడు. ఈ ఆలోచన నుంచే మొక్కల రాఖీలను తయారు చేయాలనే ఆలోచన వచ్చిందని చెప్పాడు సౌరభ్. ‘కిందటేడాది 6,000ల సీడ్ రాఖీలు తయారుచేశాం. ఈ ఏడాది 15,000 చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఢిల్లీలోని చుట్టుపక్కల స్లమ్ ఏరియాల నుంచి 20 మంది మహిళలతో ఈ గ్రీన్ రాఖీల తయారీ చేస్తున్నాం. దీనిద్వారా వారికి ఉపాధి కల్పిస్తున్నాం’ అని ఆనందంగా తెలిపారు సౌరభ్.
4. ఒక్కో దారం ఒక్కో కథ
సామాజిక సమస్యల గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు మధ్యప్రదేశ్‌కి చెందిన గ్రామ్‌ఆర్ట్ ఈ వేడుకను ఒక అవకాశంగా తీసుకొని ఈ రాఖీలను రూపొందించింది. ముంబయ్‌లో ఆదివాసీల హక్కుల కోసం ర్యాలీ చేసిన మానవ హక్కుల కార్యకర్త నవ్లీన్ 19 కత్తి పోట్లకు గురయ్యారు. ఆమె జ్ఞాపకార్థం ‘గ్రామ్ ఆర్ట్’ 19 ముడులతో కూడిన రాఖీని తయారుచేసింది. అలాగే గర్భాశయ ఆకారంలో ఉన్న రాఖీ ద్వారా సమాజంలో లింగ అంతరాన్ని ఎత్తి చూపుతుంది. ఇలా ఒక్కో దారం ఒక్కో కథను కళ్లకు కట్టేలా చేస్తుంది గ్రామ్ ఆర్ట్. ‘హమ్ కమ్జోర్ నహీ’ ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌కి చెందిన 100 మంది గ్రామీణ మహిళలతో కలిసి ఈ విత్తన రాఖీల తయారీని చేపట్టారు. కిందటేడాది 12,000 రాఖీలను అమ్మిన ఈ సంస్థ ఈ ఏడాది 20,000ల సీడ్ రాఖీలను అమ్మాయిలని నిర్ణయించుకున్నామని సంస్థ వ్యవస్థాపకులు లలిత్ వంశీ తెలిపారు.
5. మట్టితో అనుబంధం
అభికా క్రియేషన్స్ మట్టితో రాఖీలను తయారు చేస్తుంటుంది. ఈ రాఖీలను బటర్ పేపర్‌లో ప్యాక్ చేస్తారు. మట్టి రాఖీ, పేపర్ నేలలో సులువుగా కలిసిపోతుంది. ‘వీటిని కొంతమంది తమ ఆప్తులకు కానుకలుగా కూడా ఇస్తుంటారు’ అని ఆనందంగా తెలిపారు వ్యవస్థాపకులు.
6. పేపర్ రాఖీ
పేపర్‌తో తయారు చేసిన రాఖీతో పాటు కిట్‌లో అరుదైన జాతి మొక్కల విత్తనాలు చుట్టి ఉన్న కాగితం పాకెట్ కూడా ఉంటుంది. ఈ విత్తనాల ద్వారా మొక్కల పెంపకం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. నేటి తరాన్ని రకరకాల గ్యాడ్జెట్లు తమవైపుకు తిప్పుకుంటున్నాయి. ఇలాంటప్పుడు పర్యావరణ మూలాలకు వారిని తీసుకెళ్లడం అత్యవసరం’ అంటారు బైస్మిటా వ్యవస్థాపకులు స్మిత. రాఖీని సోదర ప్రేమకు, రక్షణకు, సంఘీభావనకు గుర్తుగా ఉపయోగిస్తారు. అయితే, చాలా వరకు రాఖీలో ఉపయోగించే ప్లాస్టిక్, రసాయనాల రంగులు పర్యావరణానికి హాని చేస్తున్నాయి. వీటికి సరైన పరిష్కారం పర్యావరణ హితమైనవి ఎంపిక చేసుకోవడమే. మన చుట్టూ ఉన్నవారికి ప్రకృతి పట్ల వారి బాధ్యతను గుర్తుచేయడమే.
Comments
Please login to add a commentAdd a comment