బహుమతులు ఆనందాన్నిస్తాయి... అయితే వస్తువుల రూపంలో కన్నా మాటల రూపంలో ప్రేమను వ్యక్తపరిస్తే ఆ ఫీలింగ్ హృదయంలో నిలిచిపోతుంది. అన్నయ్య గౌతమ్ నుంచి అలాంటి ప్రేమనే ఎక్కువగా కోరుకుంటున్నానని చిన్నారి సితార అంటోంది. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, నమ్రతల కుమార్తెగా పన్నెండేళ్ల సితార పాపులర్. ఓ జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్‌గా తనకంటూ పాపులార్టీ తెచ్చుకుంది. సోమవారం రాఖీ పండగ సందర్భంగా ‘సాక్షి’కి సితార చెప్పిన ప్రత్యేకమైన ముచ్చట్లు...
రాఖీ పండగను ఇంట్లో చిన్న పూజతో ప్రారంభిస్తాం. ఆ తర్వాత అన్నయ్యకు రాఖీ కట్టి, ఇద్దరం బహుమతులు ఇచ్చి, పుచ్చుకుంటాం. నాకు ఎనిమిది.. తొమ్మిదేళ్లప్పుడు అనుకుంటా... రాఖీకి అసలైన అర్థం తెలిసింది. చేతికి రాఖీ కట్టడం అనేది ఓ ఆచారం కాబట్టి పాటించాలి. అంతవరకే నాకు తెలుసు. అయితే సోదరుడి అనుబంధం, రక్షణ ఎంతో అవసరమని, అది సూచించే విధంగా కట్టే రాఖీకి చాలా ప్రాధాన్యం ఉందని ఈ పండగ అసలు విషయం అర్థమైంది. ఆచారం అర్థం అయ్యాక ఈ ఫెస్టివల్‌కి ప్రాధాన్యం ఇస్తున్నాను.
రాఖీ కొనడానికి చాలా టైమ్ తీసుకుంటా
ఈ సంవత్సరం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మా అన్నయ్య పై చదువుల కోసం విదేశాలు వెళుతున్నాడు. ఇప్పటిరకూ ఒక విధంగా ఉండేది.. ఇప్పుడు తనకు దూరంగా ఉండటం అనే మార్పు చాలా స్పష్టంగా కనబడుతుంది. రాఖీ కొనడం అనేది పెద్ద పనే. ఎందుకంటే ఒక పట్టాన సెలక్ట్ చేయలేను. చాలా టైమ్ పడుతుంది. మా అన్నయ్య మనస్తత్వానికి దగ్గరగా ఉన్న రాఖీ కొంటుంటాను.
అమ్మ గైడెన్స్‌తో పండగ చేసుకుంటాం
ఈ పండగ అనే కాదు ప్రతి పండగకీ మా అమ్మ గైడెన్స్ ఉంటుంది. అయితే అన్నయ్యకి హారతి ఇవ్వడం, స్వీటు తినిపించడం... ఇలా నేను మాత్రమే చేయాల్సినవే ఉంటాయి కాబట్టి రాఖీ పండగ అప్పుడు ఎక్కువ గైడెన్స్ ఉంటుంది. అమ్మకు సంప్రదాయాలు పాటించడం చాలా ఇష్టం. మేం కూడా పాటించాలని కోరుకుంటారు. అలాఅని ఒత్తిడి చేయరు. మా స్వేచ్ఛ మాకు ఉంటుంది.
నా ప్రేమను మెసేజ్ రూపంలో చెబుతా
ఒకవేళ వచ్చే ఏడాది మా అన్నయ్య రాఖీ పండగ సమయంలో విదేశాల్లో ఉంటే వీడియో కాల్ చేస్తాను. దాంతో పాటు తన మీద నాకు ఉన్న ప్రేమను ఒక మంచి మెసేజ్ రూపంలో చెబుతాను. ఆ మెసేజ్ హృదయపూర్వకంగా తను నాకెంత ముఖ్యమో చెప్పేలా ఉంటుంది. దూరం అనేది విషయం కాదు అని చెప్పేలా ఉంటుంది.
నన్ను సర్‌ప్రైజ్ చేస్తే ఇష్టం
అన్నయ్య నాకు ఫలానా గిఫ్ట్ ఇవ్వాలని అనుకోను. కానీ నన్ను సర్‌ప్రైజ్ చేస్తే నాకు ఇష్టం. తను నా గురించి ఆలోచిస్తున్నాడని సూచించే ఏ గిఫ్ట్ అయినా నాకు ఓకే. పుస్తకం అయినా, ఏదైనా జ్యువెలరీ అయినా లేక తన చేతితో రాసిన లెటర్ అయినా సరే... తను నా గురించి ఆలోచిస్తున్నాడనే ఆ ఫీల్ నాకు ముఖ్యం.
నా బ్రదర్ నా ఆత్మవిశ్వాసం
బ్రదర్ ఒక బెస్ట్ ఫ్రెండ్‌లాంటి వాడు... రక్షణగా నిలబడేవాడు. ఏ విషయంలోనైనా నా బ్రదర్ మీద ఆధారపడిపోవచ్చు అనే భరోసా నాకు ఉంది. తను నా ఆత్మవిశ్వాసం... మా బాండింగ్‌ని నేను చాలా గాఢంగా ఇష్టపడతాను. ఒక బ్రదర్ ఉండటం అనేది ఎప్పుడూ అండగా నిలిచే వ్యక్తి పక్కనే ఉండటంలాంటిది.
– డి.జి. భవాని
Comments
Please login to add a commentAdd a comment