
సారమింతేనయా!
సమ్‌థింగ్ స్పెషల్
ఉన్నట్టుండి ఒక పెద్దాయన దారిన పోయే దానయ్యపై రెడ్‌వైన్ చిలకరించవచ్చు. ఒక చిన్నది చిన్నోడిని వైన్ వానలో తడపవచ్చు. పరిచితులే కాదు...అపరిచితులు కూడా ఒకరి మీద మరొకరు హోలి రోజు రంగులు మీద పోసుకున్నట్లుగా మద్యం పోసుకోవచ్చు. మామూలు రోజుల్లో అయితే పిచ్చ కోపం వస్తుందిగానీ, ఆరోజు మాత్రం ఎంత మంది మద్యం చల్లినా ఎవరి మీద ఎవరికీ కోపం రాదు. స్పెయిన్‌లో జరిగే సెయింట్ పీటర్ డేకు ఉన్న ప్రత్యేకత ఇది.
ఈ పండగరోజు ఒకరిమీద ఒకరు మద్యం చల్లుకోవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది. కొందరు వాటర్ పిస్టోల్‌లో వైన్ నింపుకొని ఒకరితో ఒకరు సరదా సరదాగా యుద్ధం చేసుకుంటారు. ఈ వ్యవహారాన్ని ‘వైన్ ఫైట్’ అని పిలుస్తారు. వైన్ ఒకరి మీద ఒకరు చల్లుకుంటున్నప్పుడు కొన్ని ప్రాంతాలలోనైతే... వినసొంపైన సంగీతం వినిపిస్తుంటారు. మధ్య యుగాల కాలంలో ఒక ఆస్తి సమస్య పరిష్కారమైన నేపథ్యాన్ని పురస్కరించుకొని సరదాగా ఒకరి మీద ఒకరు మద్యం చల్లుకున్నారట. అదే కాలక్రమంలో ఆచారంగా మారింది. అదీ విషయం!