
ఎవరెస్ట్ ఫాలభాగాన్ని ముద్దాడినవాడు...
‘షెర్పాలు తల ఎత్తి పర్వతాన్ని చూస్తారు. తల దించి ఎత్త వలవలసిన బరువు వైపు చూస్తారు. వాళ్లకు తెలిసింది ఆ రెండే’ అంటాడు తేన్సింగ్ నార్గే తన ఆత్మకథలో. అతడు తన జీవితంలో ఒక అద్భుతం చేశాడు. ఆ అద్భుతం కోసమే బతికాడు. మొదటిసారి.. కుదర్లేదు. రెండోసారి.. సాధ్యం కాలేదు. మూడోసారి... సగం పనే అయ్యింది. నాలుగోసారి... పర్వతం మంచు ఖడ్గాన్ని ధరించి ఓడగొట్టి పంపించింది. ఐదోసారి... చలి కోత ఒంటిని నీలం రంగులో మార్చింది. ఆరోసారి... ఇక ఈ శిఖరాన్ని అందుకోవడం అసాధ్యం అని తేల్చిచెప్పింది. అయినా సరే... తేన్సింగ్ ఓడిపోలేదు. పట్టు విడవలేదు. తన తల్లి... మహామాత.. చెమోలుంగ్మా.... ఎవరెస్ట్... తన ఒడిలోకి ఈ పిల్లాణ్ణి తీసుకోదా? తనను ఎత్తుకోదా? ఎందుకు ఎత్తుకోదో చూద్దాం అని ఏడోసారి ప్రయత్నించాడు. ఎడ్మండ్ హిల్లరి... బ్రిటిష్‌వారి పనుపున వచ్చిన న్యూజిలాండ్ పర్వతారోహకుడు.
అతనితో పాటు మరో ఐదారుగురు... అందరూ కలిసి అప్పటికే ‘మంచుపులి’గా బిరుదుపొందిన తేన్సింగ్ సహకారంతో ఎవరెస్ట్ శిఖరంపై పాదాలను తాటించాలనే ఉత్సాహంతో బయలుదేరారు. ఇద్దరిద్దరు ఒక జట్టు. హిల్లరీ-తేన్సింగ్ ఒక జట్టు. మొత్తం మూడు జట్లలో ఏదో ఒక జట్టు శిఖరం ఎక్కినా చాలు. మొదటి జట్టు రెండో జట్టు విఫలమయ్యాయి. మిగిలింది హిల్లరీ- తేన్సింగ్ జట్టు. అమ్మా... దయామయీ... దారి విడువు... ధైర్యం చేసి బయలుదేరారు.
ఎవరెస్ట్ దక్షిణ శిఖరం వరకూ ఎక్కడమే అసాధ్యం. అక్కడి నుంచి అసలు శిఖరంపై ఎగబాకాలంటే మరో మూడునాలుగు వందల అడుగులు ఎక్కాలి. ఆ దూరం నిట్టనిలువుగా ఉంటుంది. ప్రవేశార్హం కానిదిగా ఉంటుంది. పట్టుదప్పితే శవంగా మారి సంవత్సరాల తరబడి పాడవకుండా మంచులో పడి ఉండాల్సిందే. హిల్లరీ, తేన్సింగ్ ధైర్యం చేశారు. మొత్తం 30 అడుగుల తాడు. ఒకరి వెనుక ఒకరు పట్టుకొని... ఒకరికి మరొకరు దారి ఇచ్చుకుంటూ... ఒకరు కొద్ది దూరం మెట్లు చెక్కితే... మరొకరు కొద్ది దూరం మెట్లు చెక్కుతూ... అదిగో... శిఖరానికి చేరుకుంటూ ఉన్నారు.
ఇద్దరి మధ్యా ఎంత దూరం?
కేవలం ఆరు అడుగులు. ఆరు అడుగుల ముందు హిల్లరీ ఉన్నాడు. ఆరు అడుగుల వెనుక తేన్సింగ్ ఉన్నాడు.
పడింది. తొలిపాదం. పరమ పవిత్రమైన, సృష్టి తన సమున్నతకు చిహ్నంగా నిలబెట్టుకున్న, దైవం తన ఏకాంతం కోసం కాపాడుకుంటున్న, దైహిక ప్రయాణం వల్లగానీ ఆత్మిక ప్రయాణం వల్లగాని ఒక మనిషి చేరుకోదగ్గ ఎత్తుకు చిహ్నంగా నిలిచిన ఎవరెస్ట్ శిఖరంపై పాదం పడింది. రెండో పాదం తేన్సింగ్‌ది. అతడి చిన్నారి కూతురు బయల్దేరే ముందు చిన్న పెన్సిల్ ముక్క ఇచ్చింది- ఎవరెస్ట్ మీద ఉంచమని. తేన్సింగ్ దానిని శిఖరం మీద ఉంచాడు. ఐక్యరాజ్య సమితి పతాకం, బ్రిటిష్, నేపాల్, భారతదేశాల పతాకాలు అక్కడ మంచులో సమష్టి విజయానికి గుర్తుగా గుచ్చాడు. ఆత్మీయులను, పెద్దవాళ్లనూ కలవడానికి వెళ్లినప్పుడు మిఠాయి పట్టుకెళ్లడం ఆనవాయితీ. తేన్సింగ్ తాను తీసుకెళ్లిన మిఠాయిని ఎవరెస్ట్‌కు కానుకగా సమర్పించాడు. మొత్తం పదిహేను నిమిషాలపాటు వాళ్లిద్దరూ ఆ పర్వత శిఖరం మీద ఉన్నారు. అక్కడ నుంచి చూస్తే దిగువ నుంచి చూసినప్పుడు మహా మహా పర్వతాలుగా కనిపించే కాంచనజంగా, లోట్సే, మత్సే, మకాలూ... అన్నీ చిన్న చిన్న గుడారాలుగా కనిపించాయి.
నిజమే. ఎవరెస్ట్ సమున్నతమైనది.
కాని సంకల్పం, లక్ష్యసాధన, రుజుదృష్టి ఉన్న మనిషి అంతకు ఏమాత్రం తక్కువ కాడు. ఒక మామూలు షెర్పా, బరువులెత్తే కూలి, జీవితాంతం ఎవరెస్ట్‌ను కళ్లలో పెట్టుకొని జీవించి దానిని అధిరోహించడమే లక్ష్యంగా బతికినవాడూ... నువ్వు నిజంగా సంకల్పిస్తే అది అవుతుంది అని నిరూపించాడు. ఏదైనా సాధించవచ్చు అనేదానికి కొండగుర్తుగా నిలిచాడు.
తిరిగి వచ్చాక ఎన్నెన్ని సన్మానాలనీ? ఎన్నెన్ని సత్కారాలనీ... నెహ్రూ తన ఇంటికి పిలుచుకెళ్లి నీకు బట్టలు లేవా అని అడిగి సూట్‌కేస్‌లు విప్పి తన బట్టలన్నీ తీసుకో తీసుకో అని తేన్సింగ్‌కి ఇచ్చాడు. ‘ఆశ్చర్యం. మా ఇద్దరి కొలతలు ఒకటే. అవి నాకు చక్కగా సరిపోయాయి’ అంటాడు తేన్సింగ్.
ఇలాంటి వివరాలెన్నో ‘మంచుపులి- తేన్సింగ్ నార్గే ఆత్మకథ’లో ఉన్నాయి. దీనికి మూలం ‘టైగర్ ఆఫ్ ది స్నోస్’ కావచ్చు. పీకాక్ క్లాసిక్స్ వారు అసలు పుస్తకం పేరు ఇస్తే ఆసక్తి ఉన్నవారు దానిని కూడా చదువుకుంటారు. ఏమైనా ఇది మంచి పుస్తకం. మంచి అనువాదం (ఎం.రామా రావు)తో వచ్చిన పుస్తకం. తప్పనిసరిగా చదవదగ్గ పుస్తకం. ఎవరెస్ట్ ఎక్కడం మనందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ ఆ అద్భుతమైన లిప్తలో పాలుపంచుకున్నామన్న తృప్తి దొరకాలంటే దీనిని చదవాల్సిందే.
- లక్ష్మీ మందల