గజ దొంగలు పోలీసులను మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు.ఈ దొంగ ఏకంగా కావేరీ నీళ్లు తాగించాడు.ఇతని చేతిలో విద్యను చూస్తే చోరత్వాన్ని ఒక కళగా ఎందుకు చెబుతారో అర్థమవుతుంది.తాళాలు పగలగొట్టడంలో ఉన్న లాఘవం కష్టపడి పని చేయడంలో లేదు.అందుకే దొరికిపోయాడు. జైల్లో కార్పొరేషన్ నీళ్లు తాగుతున్నాడు.దొంగతనానికి అలవాటు పడిన తోడేలు పదే పదే తిరిగి వస్తుంది.2017 ఫిబ్రవరి 19. మధ్యాహ్నం.హైదరాబాద్. బండిమెట్.‘సబ్‌మెరైన్ మీద తెలుగులో తీసిన ఫస్ట్ సినిమా అట. పదండి వెళ్దాం’ అని కుటుంబాన్ని మేట్నీకి బయల్దేరదీశాడు రత్నాకర్.మల్టీప్లెక్స్‌లో చూపించాలని కాస్త ఇంటి ఆడపిల్లలకు కాలక్షేపంగా ఉంటుందని నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్న ప్రసాద్స్‌కు తీసుకువెళ్లాడు. భార్యా ఇద్దరు కూతుళ్లు సినిమాను ఎంజాయ్ చేశారు.సాయంత్రం ఏడు గంటలకు అందరూ తిరిగి వచ్చారు. గేటు తీసుకుని లోనికి అడుగుపెడుతుంటే గుండె ఝల్లుమంది.తాళం విరగ్గొట్టి ఉంది. తలుపులు ఓరగా వేసి ఉన్నాయి.అంతే. అందరూ ఒక్కసారిగా లోపలకు అడుగు పెట్టారు.‘చోరీ... చోరీ జరిగింది’ అని మెల్లగా గొణిగాడు రత్నాకర్ షాక్‌లో పెదాలు కదిలిస్తూ.
‘మొత్తం 55 తులాలు ఎస్.ఐ.గారు. పిల్లల పెళ్లిళ్ల కోసం నోరూ కడుపూ కట్టుకుని దాచాం. అన్నీ పోయాయి’ అని ఏడుస్తూ ఉంది రత్నాకర్ భార్య. పెళ్లికెదిగిన ఆడపిల్లలు ఈ హఠాత్ పరిణామంతో బిక్కచచ్చి ఉన్నారు. రత్నాకర్ సాయం ఆశిస్తున్నట్టుగా ఎస్.ఐ వైపు చూస్తున్నాడు. ‘కంగారు పడకండి. దొంగల్ని పట్టుకుంటాం’ అన్నాడు ఎస్.ఐ.పోలీసులు ఇలాగే చెప్తారు... వాళ్లు దొంగను పట్టి రికవరీ చేయకపోతే కుటుంబం చాలా కష్టాల్లో పడుతుంది అని అందరూ బెంబేలెత్తుతున్నారు.ఇరుగూ పొరుగూ కూడా పోగయ్యారు.విశాలంగా ఉన్న వీధి అది. మధ్యాహ్నం పూట కావడంతో పెద్దగా సంచారం లేదు. అందుకని దొంగ పని సులువయ్యింది. ఎవరి కంటా పడకుండా చోరీ చేసుకు వెళ్లాడు.‘మీకు ఎవరిమీదైనా అనుమానం ఉందా?’ అడిగాడు ఎస్.ఐ.లేదన్నట్టు తలాడించాడు రత్నాకర్.‘సిసి కెమెరాల ఫుటేజ్ మొత్తం తీయండి’ అన్నాడు పోలీసులతో.
పోలీసులు సిసి కెమెరాల ఫుటేజ్ మీద దృష్టి పెట్టారు.రత్నాకర్ ఇంటి సమీపంలో ఉన్న సిసి కెమెరాల ఫీడ్ పరిశీలించారు. అనుమానితుడి కదలికలు రికార్డు అయ్యాయి. ఆ రోజు మధ్యాహ్నం 2.12 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి దయానంద్ ఇంట్లోకి ప్రవేశించినట్లు, 2.23 నిమిషాలకు బయటకు వచ్చినట్లు రికారై్డంది. ‘అంటే 11 నిమిషాలే అతడు లోపల ఉన్నాడా’ అన్నాడు ఎస్.ఐ.‘అవును సార్’ అన్నాడు కానిస్టేబుల్.‘కేవలం 11 నిమిషాల్లో గ్రిల్స్, తలుపులు, బీరువా పగులగొట్టి ఉడాయించాడంటే ఇతను ప్రొఫెషనల్’ అన్నాడు ఎస్.ఐ.ఘటనాస్థలిని మరోసారి పరిశీలించారు. గేటు దగ్గర బీడీముక్క కనిపించింది. దాని మీద ‘శివాజీ బీడీ’ అని లేబుల్ ఉంది.‘సార్.. ఈ బీడీలు కేవలం కర్ణాటకలోనే లభిస్తాయి. మన ప్రాంతంవి కావు’ అన్నాడు కానిస్టేబుల్.దీంతో నేరం చేసిన వ్యక్తి కర్నాటక వాడై ఉంటాడని అర్థమైంది. కాని ఈ ఒక్క క్లూతో దొంగను పట్టుకోవడం సాధ్యం కాదు. దొంగను వెతకాలి. అందుకని మరిన్ని సిసి కెమెరాల ఫుటేజీని పరిశీలించే పనిలో పడ్డారు.
వేట మొదలైంది.చోరీ జరిగిన బండిమెట్ దగ్గరి నుంచి చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న కెమెరాల ఫుటేజ్‌ను అంగుళం కూడా వదలకుండా జల్లెడ పట్టారు పోలీసులు.రత్నాకర్ ఇంట్లో అడుగుపెట్టిన మనిషి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లినట్టు గుర్తించారు. అతడిని గుర్తు పట్టడం ఒక విధంగా సులువైంది. ఆ సులువుకు కారణం అతడు వేసుకున్న బూట్లు. నల్లగా ఎత్తుగా బరువుగా ఉన్న ఆ బూట్ల వల్ల అతడు ఈడ్చినట్టుగా నడుస్తున్నాడు. మనిషి పొట్టివాడు కావడం వల్ల పొడవు కనిపించడానికి అతడా షూలను ఉపయోగిస్తుండొచ్చని పోలీసులు అనుకున్నారు. ట్యాంక్‌బండ్ వద్ద నిందితుడు ఓ ఆటోడ్రైవర్‌తో సంభాషించినట్లు రికార్డు అయ్యింది.‘ఆ ఆటోనంబర్ జూమ్ చేసి డ్రైవర్‌ని పట్టుకొని రండి’ అన్నాడు ఎస్.ఐ.అందుకు రెండు రోజులు పట్టింది. డ్రైవర్ పేరు యాదయ్య.‘ఇతను నీ ఆటో ఎక్కాడా?’ అనడిగాడు ఎస్.ఐ.‘లేదు సార్. శివాజీ బీడీ కహా మిలేగా అని అడిగాడు. ఆ బీడీలను నేను వినలేదు. తెలియదని చెప్పాను’‘తెలుగు మాట్లాడలేదా?’‘హిందీయే మాట్లాడాడు. కాని అది హైదరాబాదీ హిందీ కాదు’ అన్నాడు.వెంటనే పోలీసులు నిందితుడి ఫొటోను కర్ణాటక పోలీసులకు పంపారు. ఎలాంటి వివరాలు దొరకలేదు. ఐదేళ్ళ కాలంలో నగరంలో నమోదైన ఈ తరహా నేరాలు, అరెస్టు అయిన నిందితుల ఫొటోలతో పోల్చి చూసినా దర్యాప్తు ముందుకు కదల్లేదు. ‘ఈ దొంగ కావేరీ నీళ్లు తాగించేదాకా వదిలిపెట్టేట్టు లేడే’ అని ఒక కానిస్టేబుల్ విసుక్కున్నాడు.
రత్నాకర్ గతంలో ఆ ప్రాంతంలో ఓ టైపు ఇన్‌స్టిట్యూట్ నిర్వహించాడు. అదే ప్రాంతానికి చెందిన రాజు అక్కడ టైపు రైటింగ్ నేర్చుకోవడంతో వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. మార్కెట్ ప్రాంతంలో వ్యాపారం చేస్తున్న రాజు దగ్గరకు రోజూ వచ్చే రత్నాకర్ తన ఇంట్లో జరిగిన దొంగతనం గురించి మాట్లాడటంతో పాటు సీసీ కెమెరాల నుంచి సేకరించిన ఫొటోలు, చోరీ సమయంలో దొంగ ధరించిన బూట్ల గురించి చెప్పేవాడు. రాజు ఆ ఫొటోల సెట్ ఒకటి తన దగ్గర పెట్టుకున్నాడు. బూట్ల గురించి పదే పదే చర్చ వచ్చేది కాబట్టి ఆ బూట్లను కూడా గుర్తు పెట్టుకున్నాడు. ఓపక్క పోలీసుల దర్యాప్తు సాగుతుండగానే 2017 మే 3న నిందితుడు రాజుకే తారసపడ్డాడు.కోళ్లకు మరిగిన తోడేలు పదే పదే అక్కడికే వచ్చినట్టుగా దొంగతనాలకు అలవాటు పడ్డ దొంగ మళ్లీ సిటీకి వచ్చాడు. ఫిబ్రవరిలో చోరీ చేసి వెళ్లినవాడు మళ్లీ జూన్‌లో వచ్చాడు. నాంపల్లిలోని ఓ లాడ్జిలో బస చేసి అనువైన ఇళ్ళను వెతుక్కుంటూ సికింద్రాబాద్ ప్రాంతానికి వచ్చాడు. క్లాక్‌టవర్ వద్ద ఉన్న రాజు ఇతణ్ణి చూశాడు.పొట్టిగా ఉన్న మనిషి... పొడుగ్గా కనిపించడానికి వేసుకున్న మందమైన బూట్లు.. అవే కదలికలు... ఫుటేజ్‌లో చూసిన పోలికలు..రాజు ఆలస్యం చేయలేదు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.కానిస్టేబుల్ లక్ష్మణ్ మఫ్టీలో క్షణాల్లో అక్కడకు చేరుకున్నాడు.‘ఎక్కడా?’ అడిగాడు లక్ష్మణ్.రాజు చూపించాడు.‘సడన్‌గా పట్టుకుంటే వాడు పారిపోయే ప్రమాదం ఉంది. లేదా మన మీద అటాక్ చేయవచ్చు’ అన్నాడు కానిస్టేబుల్.క్షణాల్లో ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు.కానిస్టేబుల్ సీసీ కెమెరాల్లో నమోదైన ఫొటోని తీసుకొని దొంగ దగ్గరకు వెళ్లాడు.‘మిస్టర్. ఇతన్ని మీరెక్కడైనా చూశారా. ఇతను చనిపోయాడు. ఇన్సూరెన్స్ వచ్చింది. ఆ డబ్బులు ఇవ్వాలి’ అన్నాడు.‘ఇది నేనే. నేను చనిపోవడం ఏంటి’ అన్నాడు దొంగ.‘ఒక్కసారి ఇన్సూరెన్స్ ఆఫీసుకు వస్తే క్లారిటీ వస్తుంది’ అని స్కూటర్ ఎక్కించుకున్నాడు.ఆ స్కూటర్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు దారి తీసింది.దొంగను క్షణాల్లో పోలీసులు చుట్టుముట్టారు.
గజదొంగ మహ్మద్ ఇక్బాల్ జిలానీది కర్ణాటకలోని హుబ్లీ. ఆ ప్రాంతంలో 35 నేరాలు చేసి, ఏడు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయి ఉండటంతో ఎనిమిదేళ్ళుగా పరారీలో ఉన్నాడు. 2000లో హుబ్లీ నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు మకాం మార్చి అక్కడా చోరీలు చేశాడు. అప్పుడప్పుడు హైదరాబాద్‌లోని నాంపల్లి దర్గాకు వచ్చి వెళ్ళే నేపథ్యంలో సిటీతో పరిచయం ఏర్పడింది. వృత్తిరీత్యా టైర్లకు పంక్చర్లు వేసే ఇతగాడు తన ప్యాంటు లోపల పంక్చర్ రాడ్ పెట్టుకుని సంచరించేవాడు. దాంతోనే నిమిషాల్లో ఎలాంటి తాళమైనా పగులకొట్టేవాడు. రాజు ఇచ్చిన సమాచారంతోనే ఇక్బాల్‌ను అరెస్టు చేసి మొత్తం 55 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. రాజుతోపాటు పోలీసు సిబ్బందినీ సన్మానించిన పోలీసులు... ప్రతి పౌరుడూ రాజు మాదిరిగా బాధ్యతతో వ్యవహరిస్తే ‘సేఫ్ సిటీ’ ఎంతో దూరం ఉండదని వ్యాఖ్యానించారు.
– శ్రీరంగం కామేష్, సిటీబ్యూరో (హైదరాబాద్)
'షూ'ట్ కేసు
Published Wed, Sep 26 2018 1:05 AM | Last Updated on Wed, Sep 26 2018 1:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment