కీరాతకం | Family crime story of the week 19 dec 2018 | Sakshi
Sakshi News home page

కీరాతకం

Published Wed, Dec 19 2018 12:21 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

Family crime story of the week 19 dec 2018 - Sakshi

తెల్లవారి లేచినప్పుడు ఇంటి ముందు ముగ్గు కనిపిస్తే ఆనందంగా ఉంటుంది. రక్తపు కళ్లాపి కనబడితే?

రెండు నెలల క్రితం. అక్టోబర్‌లో దసరా మరుసటి రోజు. ఉదయం 5 గంటలు. పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట.మరి కాసేపటిలో గుడి నుంచి మేలుకొలుపు మొదలుకానుంది.ఆ లోపే పోలీస్‌ స్టేషన్‌లో ఫోన్‌ అదేపనిగా మోగింది.నైట్‌ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ కునికిపాట్ల నుంచి బయటపడి ఫోన్‌ ఎత్తాడు.‘చెప్పండి’...‘సార్‌.. నేను తూరుపు వీధి నుంచి మాట్లాడుతున్నాను. ఐదు నిమిషాల క్రితం మార్నింగ్‌ వాక్‌ కోసమని నిద్ర లేచి ఇంటి బయటకు వచ్చాను. మా ఇంటి ముందంతా రక్తపు మరకలు పడి ఉన్నాయి. ఏం జరిగిందో తెలియడంలేదు. భయంగా ఉంది..’ వెంటనే సమాచారం ఎస్‌.ఐకి వెళ్లింది. మరి కాసేపటిలోనే ఎస్‌.ఐతో పాటు పోలీసు సిబ్బందీ అక్కడకు చేరుకున్నారు.ఆ ఇంటి ముందంతా రక్తపు మరకలు ఉన్నాయి. ఇద్దరు ముగ్గురు పెనుగులాyì నట్టు నేల ఒరుసుకున్నదానిని బట్టి అర్థమవుతోంది. అయితే  రక్తం ఎవరిదన్న విషయమై ఎలాంటి ఆధారాలూ లభించలేదు. ఎవరిదా రక్తం?  ఏదైనా అనుకోని ఘటన జరిగి ఉంటుందా?  రకరకాల అనుమానాలతో సిబ్బంది తిరుగుముఖం పట్టారు.


అక్టోబర్‌ 19న దసరా.  భక్తుల రాకపోకలకు తోడు పండక్కి బంధువుల రాకపోకలు కూడా ఉండేసరికి ఊరంత సందడి సందడిగా ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటలు జరుగకుండా పోలీసులు యాదగిరిగుట్ట పట్టణంలో పెట్రోలింగ్‌ నిర్వహించారు. అంతా సక్రమంగా ఉంది అనుకుంటూ ఉండగా తెల్లారే సరికి ఈ రక్తపు మరకల సంఘటన ఎదురై ఎస్‌.ఐ మనసును చేదుగా మార్చింది. ‘ఎవరిదైనా హత్య జరిగి ఉంటుందా?  ఎవరు చేసి ఉంటారు..? హత్య కాబడిన వ్యక్తి ఎవరు..?  అక్కడికి రక్తపు మరకలు ఎలా వచ్చాయి’ స్థానికులను ఆరా తీశారు పోలీసులు. ఎవరి నుంచీ సరైన సమాధానం గానీ, ఆనవాలు కానీ లభించలేదు. యాదగిరిగుట్ట రూరల్‌ సీఐకి సమాచారం ఇచ్చాడు ఎస్సై. సీఐ హుటాహుటినా వచ్చాడు. ఇద్దరూ కలిసి విషయం చర్చించి, మరోసారి రక్తపు మరకలు ఉన్న స్థలాన్ని పరిశీలించారు. 

రక్తపు మరకల వార్త యాదగిరిగుట్టలో దావానలంలా వ్యాపించింది. రక్తం చిందిన చోటు కనిపిస్తోంది. అయితే ఆ చుట్టుపక్కల ఎక్కడా శవం లేదు. అసలు ఆ రక్తం మనిషిదేనా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.ఇదే విషయం మీడియాలో, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. జనం పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. చనిపోయింది ఒకరా, ఇద్దరా..  అనే కోణంలో విపరీతమైన ప్రచారం సాగుతోంది. క్లూస్‌ టీం రంగంలోకి దిగి గాలించారు. వాళ్ల అన్వేషణ ఫలించింది. రక్తపు మరకలకు కొద్ది దూరంలో వారికో వస్తువు కనిపించింది.చేతిలోకి తీసుకుని చూశారు.బైక్‌ కీ. మరికొంత వెతికితే చేతి వాచీ కనిపించింది. ఆ రెండూ ఎవరివి?

ఒకరోజు గడిచింది.పోలీస్‌ స్టేషన్‌కు ఒక మహిళ వచ్చింది. వాలకం చూస్తుంటే ముస్లిం అని వెంటనే తెలిసిపోతోంది. ‘సార్‌... మా ఆయన పేరు జాఫర్‌. ఆయన తన ఫ్రెండ్‌ బైక్‌ మీద హైదరాబాద్‌ వెళుతున్నానని తెల్లారే వస్తానని చెప్పిన వ్యక్తి రెండు రోజులు గడిచినా రాలేదు’ అంది. ఆమె ఏడుస్తూ ఉంది.ఈ జాఫర్‌ ఎవరు? ఆ రక్తపు మరకలకు ఇతనికీ ఏమైనా సంబంధం ఉందా?పోలీస్‌లు జాఫర్‌ కోసం వెదకడం ప్రారంభించారు. ఇంతలో.. యాదగిరిగుట్ట నుంచి గంగసానిపల్లి వెళ్లే రోడ్డుపై పల్సర్‌ బైక్‌ ఒకటి పడి ఉందని స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంతకు మునుపు కీ దొరికింది. ఇప్పుడు బైక్‌ దొరికింది.  ఆ కీ ఈ బైక్‌దేనా? ట్రై చేసి చూశారు. ఆ బైక్‌ దే. దెబ్బకు స్టార్ట్‌ అయ్యింది. కేసు         కూడా. దెబ్బకు సాల్వ్‌ అయిపోతుందా? 


ఆర్‌టిఏ నుంచి బైక్‌ నెంబర్‌ ఆధారంగా దాని యజమాని అడ్రస్‌ తీసుకున్నారు. అది సురేష్‌ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్‌ అయి ఉంది. అతని ఫోన్‌ నెంబర్‌ కోసం ట్రై చేస్తే స్విచ్చాఫ్‌ వస్తోంది. పోలీసులు సురేష్‌ ఇంటికి వెళ్లారు. ‘సార్‌.. రెండు రోజుల క్రితం బైక్‌ను జాఫర్‌ అని నా భర్త స్నేహితుడు తీసుకెళ్లాడు. మా ఆయన ఊరెళ్లి నాలుగు రోజులైంది’ అని చెప్పింది.‘మరి ఫోన్‌ ఎందుకు పలకడం లేదు?’‘ఫోన్‌ పాడైంది. ఇంకా కొత్తది కొనలేదు. అందుకే స్విచ్చాఫ్‌ వస్తోంది’ అని చెప్పింది.బైక్‌ కీ ఎవరిదో తేలిపోయింది. ఇక వాచీ ఎవరిదో తేలాలి.. అనుకుంటూ జాఫర్‌ భార్యకు కబురుపెట్టారు. సంఘటన స్థలంలోదొరికిన వాచీని చూపించారు. ‘ఇది మా ఆయనదే సార్‌’ చెప్పిందామె ఏడుస్తూ... ఏదో అనర్ధం జరిగే ఉంటుందని భయపడుతూ! ‘రక్తపు మరకలు కనిపించిన రోజు నుంచి జాఫర్‌ కూడా కనిపించడం లేదు. అంటే హత్యకు గురైంది జాఫరేనా..?’వెంటనే సురేశ్‌ కోసం సెర్చింగ్‌ మొదలైంది. పోలీసులు అనుమానాస్పద పరిసరాల్లో ఏదైనామృతదేహం దొరుకుతుందేమో అని వెతకడం ప్రారంభించారు. చివరకు హైదరాబాద్‌లోని నాగోల్‌ వద్ద గల మూసీకాలువలో జాఫర్‌ మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఆలస్యం చేయలేదు. జాఫర్‌ స్నేహితులు ఎవరెవరు అని కూపీ లాగారు. వాళ్లల్లో అనుమానితులుగా ఉన్న సంతోష్, వర్ధన్‌లను అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌లో బంధువులింట్లో ఉన్న సురేశ్‌నీ పట్టుకొచ్చారు. విచారణలో అసలు విషయంవెలుగులోకి వచ్చింది. 


సంతోష్, వర్ధన్‌లు అన్నదమ్ములు. వీరికి సురేష్, జాఫర్‌ స్నేహితులు. నలుగురూ చిన్ననాటి నుంచి కలిసి తిరిగారు. నలగురికీ వ్యసనాలు ఉన్నాయి. దొంగమార్గంగా డబ్బులు సంపాదించడం, వచ్చినదాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెట్టడం చేసేవారు. ఇటీవల జాఫర్‌కు ఎక్కడి నుంచో అనుకోకుండా పెద్ద మొత్తంలో పైకం చేతికి అందింది. ఏం సెటిల్‌మెంట్‌ చేశాడో తెలియదు. ఆ డబ్బు చూసుకొని స్నేహితులను లెక్క చేయకుండా ఉండటం మొదలెట్టాడు. అతనికి హేళన ఎక్కువ. ఎంతమాటంటే అంత మాట అనేవాడు. కార్లు బేరం చేయడం, ఫోన్లు కొనడం.. ఇవన్నీ చేస్తుండేసరికి జాఫర్‌ మీద ఈ ముగ్గురికీ అసూయగా ఉంది. దసరా రోజున ‘పండగ రోజు పార్టీ ఇస్తున్నాను రా’ అని జాఫర్‌ని పిలిచారు సంతోష్, వర్థన్‌లు. రోజూ మందు పార్టీ అంటే భార్య తిడుతుందని ఆమెకు హైదరాబాద్‌ వెళుతున్నానని అబద్ధం చెప్పి పార్టీకి వచ్చాడు జాఫర్‌. వీరితో సురేశ్‌ కూడా జాయిన్‌ అయ్యాడు.నలుగురూ ఊళ్లోనే ఒక వీధి మలుపులోని అడ్డా మీద చేరి తాగడం మొదలుపెట్టారు. ఒంటి గంట దాటి పోయింది. ఊరంతా గాఢంగా నిద్ర పోతూ ఉంది. మేలుకుని ఉన్నది ఈ ఇద్దరే.ఇంతలో ముందు అయిపోయింది.‘మీరు ఇళ్లకెళ్లి చీప్‌ లిక్కర్‌ తాగి పడుకోండి. నేను బ్లాక్‌ లేబుల్‌ తాగి పడుకుంటా’ అని హేళనగా మాట్లాడాడు జాఫర్‌. అసలే మంట మీద ఉన్న స్నేహితులకు ఈ మాటలు ఇంకా మంట పుట్టించాయి.‘ఏమన్నావ్‌’ అని సంతష్‌ అతని మీదకు వెళ్లాడు. ఇద్దరూ కలబడ్డారు. మధ్యలో అడ్డు పడబోయిన వర్థన్‌ను రెండు పీకాడు జాఫర్‌. అది చూసే సరికి సంతోష్‌కు ఇంకా కోపం వచ్చింది. ‘నా తమ్ముడినే కొడతావా..’ అంటూ చేతికి అందిన వస్తువుతో ఇష్టం వచ్చినట్టు జాఫర్‌ని కొట్టాడు. ఆ పెనుగులాటలో వారు తమ అడ్డా నుంచి కదిలి ఒక ఇంటి ముందుకు వచ్చి పడ్డారు. ఆ ఇంటి ముందే జాఫర్‌ మీద దాడి చేశాడు సంతోష్‌. చివరి దెబ్బ పడటానికి చాలాసేపటికి ముందే జాఫర్‌ చనిపోయాడు, తన చావుకు ఆనవాలుగా రక్తపు మరకలను వదిలి.మత్తు దిగింది. ఆవేశం తగ్గింది. కాని ఎదురుగా మాత్రం శవం పడి ఉంది. జరగరాని తప్పు. చెరపలేని తప్పు.  


ఏం చేయాలో ఈ ముగ్గురికీ అర్ధం కాలేదు. అక్కడ ఉన్నది ముగ్గురు మనుషులు, ఒక శవం, ఒక బైక్‌. సురేశ్‌ ముందు అక్కడి నుంచి తన బైక్‌తో సహా మాయమవ్వాలని అనుకున్నాడు. కాని స్టార్ట్‌ చేద్దామంటే కీ కనిపించలేదు. ఈ గొడవలో ఎక్కడో పడిపోయింది. బైక్‌ అక్కడే ఉంటే ప్రమాదమని బైక్‌ని తోసుకుంటూనే మెయిన్‌ రోడ్‌ వరకు తీసుకెళ్లాడు సురేష్‌. అటు నుంచి ట్రాలీ ఆటో వెతికి పట్టి దానిలోకి ఎక్కించాడు.సంతోష్, వర్ధన్‌లకు సొంత ఆటో ఉంది. వర్థన్‌ వెంటనే వెళ్లి ఆ ఆటో తెస్తే తమ్ముడితో కలిసి సంతోష్‌ జాఫర్‌ శవాన్ని అందులోకి చేర్చాడు. వాళ్లు అక్కడి నుంచి హైదరాబాద్‌ శివారు వరకు వచ్చి నాగోల్‌కి దగ్గరలో పారుతున్న మూసి కాలువలో శవాన్ని పడేసి వెళ్లిపోయారు.. సురేశ్‌ తన పల్సర్‌ను యాదగిరిగుట్ట నుంచి గంగసానిపల్లికి వెళ్లె దారిలో ట్రాలీ నుంచి దింపించి ట్రాలీ వెళ్లిపోయిందని నిర్ధారించుకున్నాక చెట్ల పొదల్లో బైక్‌ని ఉంచేసి, మరుసటి రోజు డూప్లికేట్‌ కీ తెచ్చి తీసుకెళ్దామని ఇంటికి వెళ్లాడు. భార్యకు జరిగిన విషయం అంతా చెప్పి ‘ఎవరైనా అడిగితే బండిని జాఫర్‌ తీసుకెళ్లాడని చెప్పు. నేను ఊళ్లో లేనని చెప్పు’అని హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు. కాని కీ దొరకడంతో కేసు తాలూకు క్లూ కూడా దొరికినట్టయ్యింది.  

స్నేహితులం అని చెప్పుకు తిరిగిన ఈ నలుగురూ స్నేహానికి మచ్చ తీసుకొచ్చారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసిన ఏ ప్రయతమూ ఫలించలేదు.  నిందితులు ముగ్గురు ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్నారు. 
– యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement