
పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మా బాబుకు తొమ్మిది నెలలు. వాడికి ఈమధ్య మాటిమాటికీ జ్వరం వస్తోంది. డాక్టర్‌కు చూపిస్తే యూరినరీ ఇన్ఫెక్షన్ కారణంగా ఇలా తరచూ జ్వరం వస్తోందంటున్నారు. మాకు తగిన పరిష్కారం చెప్పండి.
– మాధవి, కందుకూరు
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబుకు ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్’గా చెప్పవచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నెలల పిల్లల్లోనూ చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి. ఏడాది లోపు వయసుండే చిన్నపిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు మగపిల్లల్లోనే ఎక్కువ. అయితే పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ ఈ పరిస్థితి తారుమారై... మగపిల్లల కంటే ఆడపిల్లల్లోనే ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. చిన్న పిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు అనేక కారణాలుంటాయి. వయసు, జెండర్, వ్యాధి నిరోధక శక్తి, మూత్ర కోశ అంతర్గత అవయవ నిర్మాణంలో ఏవైనా తేడాలు, విసర్జన తర్వాత ఎంతో కొంత మూత్రం లోపలే మిగిలిపోవడం (వాయిడింగ్ డిస్‌ఫంక్షన్), మలబద్దకం, వ్యక్తిగత పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వంటివి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు కొన్ని కారణాలుగా చెప్పవచ్చు. లక్షణాల ఆధారంగా కొన్నిసార్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నిర్ధారణ చేయడం కాస్త కష్టమే. ఎందుకంటే ఈ లక్షణాలు నిర్దిష్టంగా ఉండవు. రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి. అంటే... కొన్ని లక్షణాలు సెప్సిస్, గ్యాస్ట్రోఎంటిరైటిస్‌లా కూడా ఉంటాయి.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న పిల్లల్లో జ్వరం, త్వరగా చిరాకు పడటం, ఆహారం సరిగా తీసుకోకపోవడం, వాంతులు, నీళ్లవిరేచనాలు, మూత్రవిసర్జనను నియంత్రించుకోలేకపోవడం, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, పొత్తికడుపులో నొప్పి, చుక్కలు చుక్కలుగా మూత్రం పడటం వంటి లక్షణాల ఉంటాయి. వాటి సహాయంతో దీన్ని గుర్తించవచ్చు. పిల్లల్లో... మరీ ముఖ్యంగా నెలల పిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌ను డయాగ్నోజ్ చేసినప్పుడు వారిలో మూత్ర కోశ వ్యవస్థ (జెనిటోయూరినరీ సిస్టమ్)కు సంబంధించి ఏదైనా లోపాలు (అబ్‌నార్మాలిటీస్) ఉన్నాయేమో పరీక్షించడం తప్పనిసరిగా అవసరం. ఉదాహరణకు ఇలాంటి పిల్లల్లో ఫైమోసిస్, విసైకో యూరేటరీ రిఫ్లక్స్ (వీయూఆర్), కిడ్నీ అబ్‌నార్మాలిటీస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్లకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి పిల్లల్లో పదేపదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తే తప్పనిసరిగా కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ విత్ కల్చర్ పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎమ్‌సీయూజీ, మూత్రపిండాల పనితీరు తెలుసుకోడానికి న్యూక్లియర్ స్కాన్ వంటి పరీక్షలతో పాటు రీనల్ ఫంక్షన్ పరీక్షలు తప్పక చేయించాలి. పిల్లలకు ఏవైనా అవయవ నిర్మాణపరమైన లోపాలు (అనటామికల్ అబ్‌నార్మాలిటీస్) ఉన్నట్లు బయటపడితే... వాటికి అవసరమైన సమయంలో సరైన శస్త్రచికిత్స చేయించాల్సి ఉంటుంది. ఇక ఇన్ఫెక్షన్‌ను తగ్గించడానికి తప్పనిసరిగా యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయడం చాలా ముఖ్యం. అలాగే చిన్నపిల్లలకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ పదే పదే వస్తున్నప్పుడు... కిడ్నీకి ఇన్ఫెక్షన్ (పైలో నెఫ్రైటిస్) సోకకుండా నివారించడానికి మూడు నుంచి ఆరు నెలల పాటు తప్పనిసరిగా ప్రొఫిలాక్టిక్ యూరినరీ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. కొద్దిగా పెద్ద పిల్లల విషయానికి వస్తే వారిలో మలబద్దకం లేకుండా చూడటం, తరచూ మూత్రవిసర్జన చేసేలా చూడటంతో పాటు మంచినీళ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా తాగేలా వారికి అలవాటు చేయడం అవసరం. మీరు పైన పేర్కొన్న విషయాలపై అవగాహన పెంచుకొని, మీ పిల్లల వైద్య నిపుణుడి ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోండి.
రంగరంగుల ఆహారాలు తీసుకోవచ్చా?
మా బాబు స్వీట్లు, ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకుంటుంటాడు. అందులోనూ అవి బాగా ఆకర్షణీయమైన రంగులతో ఉంటే వాటిని ఇప్పించమని అడుగుతుంటాడు. అవి తినడం మంచిదేనా?
– శ్రీవాణి, బెంగళూరు
ఆహారపదార్థాల్లో కృత్రిమ రంగులు, నిల్వ ఉంచేందుకు వాడే ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారం వారి ఆరోగ్యానికి, వికాసానికి, ఎదుగుదలకు కీడు చేస్తుంది. కొన్ని కృత్రిమ రంగులు అసలు తీసుకోవడమే మంచిది కాదు. ఎందుకంటే వాటిని బయటకు పంపేందుకు మూత్రపిండాలు చాలా ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. దాంతో వాటి దుష్ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. ఆహారం ఆకర్షణీయంగా ఉండటంతో పాటు అది చాలాకాలం నిల్వ ఉండటానికి ఉపయోగపడే ప్రిజర్వేటివ్స్‌లో సన్‌సెట్ ఎల్లో, ట్యాట్రజైన్, కార్మోయిసైన్, పాన్‌క్యూ 4ఆర్, సోడియం బెంజోయేట్ వంటి ప్రిజర్వేటివ్స్, క్వినోలిన్ ఎల్లో, అల్యూరా రెడ్ వంటి రసాయనాలతో పిల్లల్లో అతి ధోరణలు (హైపర్‌యాక్టివిటీ) పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది. సోడియం బెంజోయేట్ వంటి రసాయనాలు విటమిన్ ’సి’తో కలిసినప్పుడు అది క్యాన్సర్ కారకం (కార్సినోజెన్)గా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రసాయనం లివర్ సిర్రోసిస్‌కు, పార్కిన్‌సన్ డిసీజ్‌లాంటి వాటికి దారితీస్తుందని కూడా వెల్లడయ్యింది. అందుకే అతిగా రంగులు ఉండే ఆహారం తీసుకునే విషయంలో పిల్లలను ప్రోత్సహించకూడదు. దీనికి బదులు స్వాభావిక ఆహారాలు, పానీయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించాలి.
బాబు నోట్లో పొక్కులు... ఎందుకిలా?
మా బాబు వయస్సు తొమ్మిదేళ్లు. పెద్దల్లో కనిపించినట్టే వాడి నోట్లోనూ పొక్కులు వస్తున్నాయి. దీనికి కారణం ఏమిటి? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి. – లక్ష్మీప్రసన్న, ఖమ్మం
మీ బాబుకు ఉన్న కండిషన్‌ను యాఫ్తస్ అల్సర్స్ లేదా యాఫ్తస్ స్టొమటైటిస్ అని అంటారు. ఈ పొక్కులు ముఖ్యంగా నోట్లో, పెదవులు, గొంతుపై భాగం (అప్పర్ థ్రోట్)లో ఎక్కువగా వస్తుంటాయి. వీటికి ఫలానా అంశమే కారణమంటూ నిర్దిష్టంగా చెప్పలేం. అయితే నిమ్మజాతి (సిట్రస్) ఫ్రూట్స్, పులుపు పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు, బాగా కారంగా ఎక్కువ మసాలాలతో ఉండే ఆహారం తీసుకున్నప్పుడు ఇవి రావచ్చు. కొందరిలో ఇవి విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ లోపాలతోనూ రావచ్చు. ఎక్కువ సాంద్రత ఉన్న టూత్‌పేస్టులు వాడేవారిలో, బాగా మానసిక ఒత్తిడికి గురయ్యేవారిలో ఇవి కనిపిస్తాయి. కొందరిలో ఇవి తీవ్రంగా అలసిపోయిన (ఫెటిగ్) సందర్భాల్లో చూస్తూ ఉంటాం. మరికొందరిలో జబ్బుపడ్డప్పుడు కనిపిస్తాయి. కొన్ని హార్మోన్ల అసమతౌల్యత వల్ల, జీర్ణకోశవ్యాధులు ఉన్న సందర్భాల్లోనూ కనిపించవచ్చు. ఇవి రాకుండా నివారణ చర్యలివే...
∙నోటికి బాధ కలిగించే పదార్థాలు తీసుకోకపోవడం ∙బాగా పుల్లగా ఉండే పదార్థాలు అవాయిడ్ చేయడం ∙నోరు ఒరుసుకుపోయేందుకు దోహదపడే ఆహారపదార్థాలు (అబ్రేసివ్ ఫుడ్స్) తీసకోకపోవడం. ∙నోటి పరిశుభ్రత (ఓరల్ హైజీన్) పాటించడం వంటివి చేయాలి. ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు లోకల్ అనస్థిటిక్ జెల్స్‌తో పాటు కార్టికోస్టెరాయిడ్స్, సిల్వర్ నైట్రేట్ వాడటంతో పాటు కొన్ని సందర్భాల్లో ఓరల్ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. సమస్య మాటిమాటికీ వస్తున్నట్లయితే నాన్ ఆల్కహాలిక్ మౌత్‌వాష్, తక్కువ లో కాన్సంట్రేటెడ్ మౌత్ వాష్ వంటివి ఉపయోగిస్తే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఇక మీ బాబు విషయానికి వస్తే నోటి పరిశుభ్రత (గుడ్ ఓరల్ హైజీన్) పాటించడంతో పాటు అతడికి విటమిన్ బి12, జింక్ సప్లిమెంట్స్ ఇవ్వండి. లోకల్ అనస్థిటిక్ జెల్స్ కూడా వాడవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే మీ పిల్లల వైద్య నిపుణుడిని కలిసి చికిత్స తీసుకోండి. ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment