నా భార్య వయసు 35 ఏళ్లు. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా?
– టి. లక్ష్మణ్‌రావు, విజయనగరం
రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో వాళ్లలోని రెండు అండాశయల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అలా జరగకుండా అపరిపక్వమైన అండాలు వెలువడి అవి నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోయే కండిషన్‌ను పీసీవోడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు.
లక్షణాలు : నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానం కలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో విధానంలో సరైన హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా దుష్ఫలితాలేవీ లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
సీఎండీ, హోమియోకేర్
ఇంటర్నేషనల్, హైదరాబాద్
మావాడికి ఆస్తమా... తగ్గుతుందా?
ఇప్పుడు మా కొడుకు వయసు 22 ఏళ్లు. వాడికి పుట్టినప్పటి నుంచి దగ్గు, ఆయాసం ఉన్నాయి. ఆయాసపడే సమయంలో పిల్లికూతలు వినిపిస్తుంటాయి. మావాడికి ఉన్న ఉబ్బసం ఎలా తగ్గుతుంది?
– మోహన్ ప్రసాద్, కొత్తగూడెం
ఉబ్బసం (ఆస్తమా) అనేది ఊపిరితిత్తుల్లోని వాయునాళాలకు సంబంధించిన దీర్ఘకాలిక మొండి వ్యాధి. వాయునాళాలు మూసుకుపోయి గాలిపీల్చడం, వదలడం కష్టంగా మారుతుంది. దీన్ని ఉబ్బసం, ఆయాసం, ఆస్తమా అనే పేర్లతో పిలుస్తుంటారు. దాదాపు 80 శాతం మంది ఆస్తమా రోగుల్లో ఈ వ్యాధి 18 ఏళ్ల లోపు వయసులోనే మొదలవుతుంది.
కారణాలు : ∙దుమ్ము, ధూళి, కాలుష్యం ∙వాతావరణ మార్పులు, చల్లగాలి ∙ ఇన్ఫెక్షన్స్ ∙పొగాకు ∙పెంపుడు జంతువులు ∙సుగంధద్రవ్యాలు, ఘాటైన వాసనలు ∙పుప్పొడి రేణువులు ∙వంశపారంపర్యం మొదలైనవి.
లక్షణాలు : ∙ఆయాసం ∙దగ్గు రాత్రిపూట రావడం ∙గాలి తీసుకోవడం కష్టం కావడం; పిల్లికూతలు ∙ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం. వ్యాధిగ్రస్తులందరిలో ఈ లక్షణాలన్నీ ఉండాలని ఏమీ లేదు. వీటిల్లో కొన్ని లక్షణాలు మాత్రమే ఉండవచ్చు.
చికిత్స : ఆస్తమా నుంచి పూర్తిగా ఉపశమనం కలిగించే మందులు హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయి. అవి ఆస్తమా లక్షణాలకు తగ్గించడమే కాకుండా, ఆ లక్షణాలను కలిగించే కారకాల పట్ల శరీరానికి వ్యాధి నిరోధకతను పెంచుతాయి. హోమియో విధానంలో ఆర్సినిక్ ఆల్బ్, ఇపికాక్, నేట్రమ్ సల్ఫ్, కాల్కేరియా కార్బ్, యాంటిమోనమ్ ఆల్బ్, స్పాంజియా వంటి మందులను నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి,
ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment