హోమియో కౌన్సెలింగ్స్
నా వయసు 41 ఏళ్లు. గత కొంతకాలంగా గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించాలని చెప్పారు. అయితే భవిష్యత్తులో అవి మళ్లీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. హోమియో చికిత్సతో ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? – ఎల్. నాగమణి, నూజివీడు
గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. వీటి బారిన పడిన కొంతమంది స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. వీటి ఎదుగుదల కొందరిలో వేగంగానూ, మరికొందరిలో నిదానంగా ఉంటుంది. ఇంకొందరిలో నిదానంగా, నిలకడగా, స్వల్ప పరిమాణంలో ఉంటూ ఎలాంటి లక్షణాలనూ కనబరచకపోవచ్చు. గర్భాశయంలో వీటిని ఉనికి, పరిమాణరీత్యా ఈ యుటెరైన్ ఫైబ్రాయిడ్స్‌ను మూడు రకాలుగా విభజించవచ్చు.
1) సబ్‌సీరోజల్ ఫైబ్రాయిడ్స్ 2) ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ 3) మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్.
కారణాలు : ఈ ఫైబ్రాయిడ్స్ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి.
లక్షణాలు : గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్దకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు.
చికిత్స: జెనెటిక్ కన్‌స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్,
సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
ఐబీఎస్‌కు పరిష్కారం చెప్పండి
నా వయసు 36 ఏళ్లు. భోజనం తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. మలంలో జిగురు కూడా కనిపిస్తుంది. కొద్దిగా నొప్పి ఉండి మెలిపెట్టినట్లుగా అనిపిస్తోంది. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన వంటివి ఉన్నాయి. ఈ సమస్యతో ఏ అంశంపైనా దృష్టి పెట్టలేకపోతున్నాను. డాక్టర్‌కు చూపిస్తే ఐబీఎస్ అన్నారు. మందులు వాడినా ఏమీ తగ్గలేదు. దయచేసి నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – వి. చంద్రశేఖర్‌రావు, విశాఖపట్నం
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ∙దీర్ఘకాల జ్వరాలు మానసిక ఆందోళన ∙కుంగుబాటు ∙ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం ∙జన్యుపరమైన కారణలు ∙చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తాయి.సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్‌కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి.
వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు :
∙పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ∙ఒత్తిడిని నివారించుకోవాలి ∙పొగతాగడం, మద్య పానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ∙రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.
చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే ఉదాహరణకు జీర్ణవ్యవస్థలో ఉండే ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్‌స్టిట్యూషనల్ సిమిలియమ్ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్
పొద్దున్నే మడమల్లో నొప్పి... తగ్గేదెలా?
నా వయసు 45 ఏళ్లు. పొద్దున లేవగానే నడుస్తుంటే మడమలలో విపరీతమైన నొప్పి వస్తోంది. విశ్నాంతి తీసుకున్నప్పుడు తగ్గి, మళ్లీ నడవగానే వస్తోంది. ఏదైనా సపోర్ట్ తీసుకొనే నడవాల్సి వస్తోంది. ఈ బాధ భరించలేకపోతున్నాను. నా సమస్య పరిష్కారం కోసం హోమియో పరిష్కారం చెప్పండి. – ఆర్. చంద్రలేఖ, అనకాపల్లి
అరికాలులో ఉండే ప్లాంటార్ ఫేషియా అనే లిగమెంటు ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అది తన సాగే గుణాన్ని కోల్పోయి తాడులా మారుతుంది. నిజానికి ఇది ఫ్లాట్‌పాడ్‌లా ఉండి కాలికి షాక్ అబ్జార్బర్‌లా పనిచేస్తుంది. వయసు పెరిగి, ఇది సన్నగా మారడం వల్ల గాయాలను తట్టుకునే శక్తిని కోల్పోతుంది. దాంతో నడకతో కలిగే షాక్స్‌ను తట్టుకోలేక ప్లాంటార్ ఫేషియా డ్యామేజ్ అవుతుంది. ఫలితంగా అరికాలిలో నొప్పి వస్తుంది. దాంతో పాటు మడమ నొప్పి, వాపు కూడా కనిపిస్తుంది. ఉదయం పూట మొట్టమొదట నిల్చున్నప్పుడు మడమలో నొప్పి కలుగుతుంది. ఇలా ప్లాంటార్ ఫేషియా డ్యామేజ్ అయి వచ్చే నొప్పిని ప్లాంటార్ ఫేషిౖయెటిస్ అంటారు. ఇది పొడిచినట్లుగా లేదా సూదితో గుచ్చినట్లుగా నొప్పిని కలగజేస్తుంది.
కారణాలు :
డయాబెటిస్
ఊబకాయం, ఉండాల్సినదాని కంటే ఎక్కువగా బరువు ఉండటం
ఎక్కువ సేపు నిలబడటం, పనిచేయడం
తక్కువ సమయంలో చురుకుగా పనిచేయడం
ఎక్కువగా హైహీల్స్ చెప్పులు వాడటం (మహిళల్లో)
లక్షణాలు :
మడమలో పొడినట్లుగా నొప్పి
ప్రధానంగా ఉదయం లేవగానే కాలిని నేలకు ఆనించినప్పుడు నొప్పి కనిపించడం
కండరాల నొప్పులు
చికిత్స : మడమనొప్పికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. మడమనొప్పికి హోమియోలో పల్సటిల్లా, రొడొడెండ్రాన్, కాల్కేరియా ఫ్లోర్, రస్టాక్స్, అమోనియమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగి లక్షణాలను బట్టి వాటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. మీరు వెంటనే అనుభవజ్ఞులైన డాక్టర్‌ను సంప్రదించి, మీ లక్షణాలన్నీ తెలిపి, తగిన మందులు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో),
స్టార్ హోమియోపతి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment