స్వీట్లకే మాటలొస్తే..!
ఫెస్టివల్ ఫీస్ట్
మిఠాయిలే పంచ్ డైలాగులు చెబితే! తమ స్వభావాన్ని విడమరచుకుంటూ ఉంటే!! మన తెలుగు హీరోల్లాగే అవీ సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటే!!! ఆ స్వీట్ల తీరుని బట్టి వాటి డైలాగుల హోరిది. ఫ్రూట్ పంచ్‌లాగే స్వీట్ ‘ఫన్’చ్‌లివి...
సున్నుండ : ఎవ్వర్ని తింటే గబుక్కున నోరు తెరచి మాట్లాడటం చేత కాదో... వాడే రా ఉండ... సున్నుండ.
కొబ్బరిలడ్డు: తురిమేసిన నన్ను నమిలేయాలని చూడకు. నేను గానీ నాలుకెక్కి తరమడం మొదలుపెడితే... మిగతా రుచులు తెలియడానికి ఎన్ని గంటలు పడుతుందో నాకే తెలియదు.
పూతరేకు : ఒక్క కొరుకుతో ఎలాగోలా కంప్లీటవ్వడానికి నేను పంటికిందికి రాలేదు... పన్ను దిగుతూ ఉన్న కొద్దీ తెలుస్తుందిరా ఫన్నూ.
పొంగల్ : ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా. పండగకు మన పేరు పెట్టారా లేదా!
విలన్: ‘‘ఎవడ్రానువ్వు?’’
సేమ్యాపాయసం: ‘‘పాయసమ్... ఒక్క నిమిషం టైమిస్తే వేగిపోతా... రెండు నిమిషాల్లో పాకం గిన్నెలో పడిపోతా. మూడో నిమిషానికి చెంచాలోంచి, నోట్లోకి స్మూత్‌గా దిగిపోతా. నాలాంటివాడితో ఇంతసేపు స్పెండ్ చేస్తే గిన్నెలో మిగలను కూడా మిగలను. నాలాంటివాడు ఎదురైతే ఎంత త్వరగా తినేయాలో అని చూడాల్రా. ఇంతసేపు టైమిస్తే చల్లబడి రుచితప్పుతా’’
కాజూ కట్లీ : ఎవరు కనబడితే ఠక్కున కొరికేస్తారో, ఎవరు చేతికొస్తే ఇతరులతో షేర్ చేసుకోడానికి వెనకాడతారో, ఎవ్వర్ని రుచిచూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుందో... అదేనమ్మా... కాజూ కట్లీ!
కజ్జికాయ: ఇష్టమైతే తిను కష్టమైతే మానేయ్. అంతేగానీ కొబ్బరికోరు మాత్రం తిని, పూరీ పోర్షన్ వదిలెయ్యకు అత్తా. వదిలేయకు.
బూందీలడ్డూ : దీనిక్కొంచెం టేస్టుంది. దాంతో మహా ఫీస్టుంది.
జాంగ్రీ : ఒక్కొక్కసారి కాదు టేస్ట్‌బడ్! వంద సార్లు తిను. వంద మార్లు రుచి చూడు. ఒక్కసారైనా నా రుచిని నువ్వు నెమరేసుకోకపోతే నేను ‘శత అంచు రౌండ్ల’ వంశానికి చెందిన మిఠాయినే కాదు.
- యాసీన్
బొమ్మలు: అన్వర్