అర్థం చేసుకోండి పెళ్లి | First of The Important events in The Wedding is Engagement | Sakshi
Sakshi News home page

అర్థం చేసుకోండి పెళ్లి

Published Sun, Mar 31 2019 1:07 AM | Last Updated on Sun, Mar 31 2019 1:07 AM

 First of The Important events in The Wedding is Engagement - Sakshi

పెళ్లంటే నూరేళ్ల పంట అన్నారు పెద్దలు. ఇల్లంతా పచ్చటి తోరణాలు, బంధువుల  ముచ్చట్లు, ఆడవాళ్ల ఆభరణాలు, పట్టుచీరల రెపరెపలు, చిన్నారుల అల్లరితో పెళ్లి ఇంట సందడే సందడి. ఇక మూడు ముళ్లతో ఒక్కటయ్యే జంట సంగతి చెప్పనక్కరలేదు. అయితే పెళ్లి జరిగేటప్పుడు నిర్వహించే ప్రతి ఘట్టం, ప్రతి ఆచారం, ప్రతి వాగ్ధానం వెనక చాలా అర్థాలు, పరమార్థాలు ఉన్నాయి. అందుకే ఈ ఆచారాలకు అంత ప్రాధాన్యత ఉంది. హిందూ సంప్రదాయానికి అద్దం పట్టే తెలుగు పెళ్లిలోని విశేషాలు, వాటి విశిష్టతలు తెలుసుకుందాం. వీటిలో కులాలవారీగా, ప్రాంతాల వారీగా తేడాలు ఉండవచ్చు కానీ, ఇంచుమించు అన్ని వివాహాలలో ఉండే ప్రధాన  ప్రక్రియలు ఇవి. 

 నిశ్చితార్థం/ తాంబూలాలు
వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో మొదటిది నిశ్చితార్థం–  లేదా నిశ్చయ తాంబూలం. ఒక శుభ ముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించిన తదుపరి, వధూవరుల తల్లితండ్రులు లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చు కుంటారు. దైవజ్ఞులు నిశ్చయించిన ముహూర్తానికి వరుని తరపువారూ, వధువు తరపువారూ వారి వారి ఆచారానుసారం ‘శుభలేఖలు’ ముద్రించుకుంటారు. 

అంకురార్పణ
 పెళ్ళికి ముందర ఒక మంచి రోజున గానీ, స్నాతకం–అంకురార్పణల రోజున గానీ పెళ్ళికొడుకు ను–పెళ్ళికూతురును చేయడం ఆచారం. తెల్లవారక ముందే,  ముత్తయిదులు పెళ్ళి కూతురుకు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది, హారతిచ్చి, మంగళస్నానాలకు సిద్ధం చేస్తారు. అలానే వరుడికి కూడా జరుగుతుంది. అంకురార్పణగా పిలిచే ఆ వేడుకకు కన్యాదాత దగ్గరి బంధువులందరూ వస్తారు. నవ ధాన్యాలను మట్టి మూకుళ్లలో పుట్ట మన్నులో కలిపి మొలకెత్తే విధంగా అమర్చడాన్ని ‘అంకురార్పణ’ అంటారు. స్నాతకం చేసుకున్న రోజునే మగ పెళ్లివారు ఆడ పెళ్ళివారి వూరికి తరలి పోతారు. ఒక్కోసారి అక్కడకెళ్లి స్నాతకం చేసుకుంటారు.

బాసికం
పెళ్లిలో వధూవరుల నుదుటిపై కాంతులీనే ఆభరణమే బాసికం. దీన్ని పూలతో, బియ్యపు గింజల కూర్పుతో, ముత్యాలతో తయారు చేస్తారు. దీన్ని పెళ్లి సమయంలో వధూవరులు నొసట ధరిస్తారు. బాసికం కట్టగానే పెళ్లికళ వచ్చేస్తుంది. దృష్టి దోష నివారణకు బాసికాన్ని కడతారు. 

ఎదురుకోలు
మగ పెళ్ళి వారు విడిదికి చేరుకోగానే, అప్పటికే వారికోసం ఎదురు చూస్తున్న ఆడపెళ్లి వారు, ‘ఎదురు కోలు’ పలికే ఆచారం సరదాగా– సందడిగా జరుపుకునే మరో వేడుక. మేళ– తాళాలతో ఆహ్వానించి కాబోయే అత్తగారు, మామ గారు, వారి సమీప బంధువులు ఎదురుకోలలో భాగంగా, విడిదిలోకి ప్రవేశించే ముందర కాళ్లు కడుక్కోవడానికి మగ పెళ్ళి వారందరికీ నీళ్లిస్తారు. 

గౌరీపూజ... వరుడి కాళ్లు కడగటం
గౌరీ పూజ దగ్గర గోత్ర–ప్రవరల వేడుక ముగిసిన పిదప, వధువు మేనమామలు పెళ్ళి కూతురిని గంపలో కూర్చోబెట్టి వివాహ వేదిక పైకి తీసుకొచ్చే కార్యక్రమం తల్లి తర్వాత మేనమామలు ముఖ్యమని తెలియజెబుతుంది. కొబ్బరి బోండాం మానసిక స్వచ్ఛతకు చిహ్నం. అలానే, అందులోని పీచులాగా, ఎల్లవేళలా ఇరువురు విడిపోకుండా, అల్లుకు పోయి జీవిస్తామని–సత్‌ సంతానం కలవారమవుతామని సంకేతం కూడ ఈ వేడుకలో వుందంటారు పెద్దలు. కళ్యాణ వేదిక పైన వున్న వరుడి కాళ్లు కడిగే కార్యక్రమం, వివాహంలో, మరో ముఖ్యమైన ఘట్టం. 

వధూవరుల మధ్యలో తెర
ముహూర్త సమయం వరకు వధూవరుల మధ్యలో ఉంచే తెరకు అర్థం ఉంది. వధువును జీవాత్మగా, వరుడిని పరమాత్మగా భావిస్తే మధ్యలో ఉండే తెర మాయ. జీవాత్మకు పరమాత్మ దర్శనం కావాలంటే మాయను తొలిసారి తలపై చేతులు ఉండగా భ్రూమధ్య స్థానంలో చూస్తారు. ఇలా వాళ్ల బంధం బలపడుతుందని అర్థం.

జీలకర్ర, బెల్లం 
జీలకర్ర, బెల్లం జీలకర్ర, బెల్లం కలిపితే ధన విద్యుత్‌ ఉత్పన్నమై వస్తువులను ఆకర్షించే శక్తి కలుగుతుందని సైన్స్‌ చెబుతోంది. జీలకర్ర, బెల్లం పెట్టడం వల్ల తలపై ఉండే బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది. అలాగే జీలకర్ర, బెల్లం మిశ్రమం బాగా కలిసిపోతుంది. అలా వధూవరులు కూడా కలిసిపోవాలని పూర్వీకులు ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. జీలకర్ర, బెల్లం పెట్టే చోటే సహస్రార చక్రం ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది. ఇక భృకుటి మధ్యలో ఆజ్ఞా చక్రం ఉంటుంది. అంటే ఈ క్రతువులో మనిషి అత్యున్నత స్థితిని సూచించే రెండు చక్రాలనీ మేల్కొలిపే ప్రయత్నం జరుగుతుందన్న మాట! ఇలా ఏర్పడిన అనుబంధం జీవితకాలం నిల్చిపోతుందట.

కన్యాదానం
దేనినైనా దానం చేస్తే ఆ వస్తువుతో మనకు అన్ని సంబంధాలు తెగిపోతాయి. కానీ పెళ్లిలో మాత్రం అలా కాదు. దానాలలో అతి శ్రేష్టమైనది కన్యాదానం. పెళ్లికూతురి తండ్రి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కూతురిని పంచ భూతాల సాక్షిగా, పెళ్లికి విచ్చేసిన బంధుమిత్రుల సాక్షిగా ధర్మ, అర్థ, కామ, మోక్షాలకై అల్లుడికి దానమిస్తాడు. ఈ దానం వల్ల తనకు బ్రహ్మలోక ప్రాప్తి కావాలని కోరుకున్నట్లు.

కొంగుముడి... బ్రహ్మముడి 
బ్రహ్మముడి వధువు చీర అంచును, వరుడి ఉత్తరీయం చివరలను కలిపి ముడి వేయటం అంటే జీవితాంతం వారు కలకాలం అన్యోన్యంగా కలిసి మెలిసి ఉండాలని దంపతుల కొంగులకు ముడివేస్తారు. వధూవరుల బంధం శాశ్వతంగా, స్థిరంగా ఉండాలని ఈ ముడి వేయిస్తారు. ఈ కొంగుముళ్లతోనే పెద్దల ఆశీర్వాదాలు అందుకుంటారు వధూవరులు.

ఉంగరాలు తీయటం 
పెళ్లిలో ఉంగరాలు తీసే కార్యక్రమం వధూవరులతో పాటు.. చుట్టూ ఉన్న వాళ్లందరికీ చూడటానికి చాలా సరదాగా కనిపించే తంతు. పోటీ పడి గెలవాలనే పట్టుదలని, అంతలోనే తను ఓడిపోయి ఎదుటి మనిషిని గెలిపించాలనే ప్రేమ భావనని చిగురింపజేస్తుంది ఈ ఆచారం. 

మంగళసూత్రం 
సూత్రం అంటే దారం. మంగళప్రదమైంది కనుక మంగళ సూత్రం. ఇది వైవాహిక జీవితం నుంచి సమస్త కీడులను తొలగిస్తుందని నమ్మకం. ఈ మాంగల్యాన్ని వేదమంత్రాల సాక్షిగా వరుడు, వధువు మెడలో వేసి మూడుసార్లు ముడి వేస్తాడు.

మూడు ముళ్లే ఎందుకు ? 
త్రిమూర్తులు, త్రిగుణాలు, త్రికాలాలు, ఇలా ఏది చూసినా మూడే ఉంటాయి. అలాగే స్థూల, సూక్ష్మ, కారణ అని మూడు శరీరాలు ఉన్నాయి. ఆ మూడు శరీరాలకు మూడు ముళ్లు అనే అర్థం కూడా ఉంది. కాబట్టి స్థూల శరీరం ఉన్నా, లేకున్నా వారి మధ్య ఆ బంధం ఉండాలి అనేది అందులోని పరమార్థం. మాంగళ్యధారణ సమయంలో చదివే మంత్రానికి చాలా విశిష్టత ఉంది. మాంగల్య తంతునానేనా మమ జీవన హేతునా, కంఠే బద్నామి శుభగే తంజీవ శరదాం శతమ్‌. అంటే నా జీవితానికి కారణమైన ఈ సూత్రంతో నేను నీ మెడలో మాంగల్యం అనే ఈ బంధాన్ని వేస్తున్నాను. నీ మెడలోని మాంగల్యంతో నీవు శత వసంతాలు జీవించాలి. నీ మాంగల్యమే నాకు రక్ష. నా జీవితం, నా జీవన గమనం ఈ మాంగల్యం పైనే ఆధారపడి ఉందని అర్థం.

తలంబ్రాలు 
తలంబ్రాలు వివాహంలో ముఖ్య ఘట్టం. వధూవరుల భావి జీవితం మంగళమయం కావటానికి మంగళ ద్రవ్యాలచే చేయించే పవిత్ర కర్మ ఈ తలంబ్రాలు. వీటికి వాడేవి అక్షతలు. అక్షత అంటే విరిగిపోనివి అని అర్థం. ఇక దానికి బియ్యాన్నే ఎందుకు ఉపయోగిస్తారంటే బియ్యం ఇంటి నిండా సమృద్ధిగా ఎప్పుడూ ఉండాలని, గృహస్థు ఇంట్లో ధాన్యానికి ఎప్పుడూ కొరత లేకుండా ఉండాలని వాడతారు.

పాణిగ్రహణం 
కన్యచేతిని వరుడు గ్రహించటమే పాణిగ్రహణం. వరుడు తన కుడి చేతితో వధువు కుడిచేతిని పట్టుకోవటాన్ని పాణిగ్రహణం అంటారు. ఇకపై నేనే నీ రక్షణ భారం వహిస్తానని సూచించటానికి, పురుషుని కుడి చేయి బోర్లించి, స్త్రీ కుడి చేయిపైకి ఉండేలా చేయి పట్టుకోవాలి. దీనికి అర్థం ఇంటి యజమానురాలిగా, ఇంటిని తీర్చిదిద్దే ఇల్లాలిగా ఇంటికి రమ్మని ఆహ్వానించటం.

ఏడు అడుగుల పరమార్థం 
భార్యాభర్తలు ఇద్దరు కలిసి వేసే ఏడు అడుగుల్లో ప్రతి అడుగుకి అర్థం ఉంది. ఇద్దరు కలిసి సంసార బాధ్యతలు తీసుకుంటామని, ఇద్దరం ధైర్యంతో, శక్తితో అన్ని అవసరాలని తీర్చుకుంటామని, ఇద్దరం కలిసి కుటుంబం సుఖ సంతోషాల కోసం పాటుపడతామని, కష్టసుఖాలలో కలిసి ఉంటామని, ఇద్దరు కలిసి పిల్లల్ని మంచిదారిలో పెంచుతామని, ఇద్దరం కలిసి సుఖ, శాంతి కోసం పాటుపడతామని, ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతామని, జీవితాంతం పెళ్లి బంధంలో ఉంటామని చెబుతారు. 

నల్ల పూసలు ఎందుకు? 
మంగళసూత్రంతో పాటు నల్లపూసలు ధరించడం సాంప్రదాయం. నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు. సప్తపది తర్వాత నాగవల్లి–సదశ్యం. ఆ తర్వాత అప్పగింతల కార్యక్రమం. నాగవల్లిలో పెళ్లి కూతురుకు భర్తతో కాలిమట్టెలు తొడిగిస్తారు.  

గృహ ప్రవేశం
కొత్తగా పెళ్లైన అమ్మాయి అత్తగారింట్లో కాలుపెట్టడాన్నే గృహప్రవేశం అంటారు. అలా ఇంటిలో కాలు పెట్టే ముందు బియ్యాన్ని కాలితో నెట్టి లోనికి వస్తుంది. లక్ష్మీ నివాసముండే వరి బియ్యం లేదా బియ్యంతో నిండిన కలశాన్ని గడపపై ఉంచుతారు. దీన్ని ఇంట్లోకి నెట్టుతూ లోపలికి పెళ్లికూతురు వస్తే లక్ష్మీదేవినే ఆ ఇంట్లోకి తీసుకొచ్చినట్టు అవుతుందని అర్థం. ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తు్తందని నమ్మకం.గృహప్రవేశం అనంతరం సకల శుభదాయకమైన సత్యనారాయణ స్వామి వ్రతం వరుని ఇంట జరగడం ఆచారం. 
– డి.వరలక్ష్మి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement