ఒక అడవిలో కోతుల గుంపు ఒకటి ఉండేది. ఒకరోజు అవన్నీ కలిసి ఏకాదశీ వ్రతం చేసుకోవాలనుకున్నాయి. ఆ ప్రకారం ఆ తర్వాత వచ్చే ఏకాదశినాడు కోతులన్నీ ఒక చెట్టుకింద సమావేశమై ఉపవాసాన్ని ప్రారంభించాయి. కాసేపటికి ఒక కోతి అంది– ఇలా ఎంతసేపని కింద కూర్చుంటాం? చెట్లకొమ్మల మీద ఉండటమే మనకు అలవాటు కాబట్టి చెట్లెక్కి కొమ్మల మొదట్లోనే కూర్చుందాం’’ అంది. ఆ మాటలు మిగతా కోతులకు నచ్చాయి. వెంటనే అమలు పరిచాయి. అలా కొంతసేపు గడిచింది. అప్పుడు మరోకోతి ఇలా సూచించింది– మనం కొమ్మలమీద కూర్చుంటే చెట్లెక్కగలిగిన ఏ చిరుతపులో వస్తే మన పరిస్థితి ఏమిటి? అందువల్ల ఇంకొంచెం పైకెళ్తే మంచిది. దానివల్ల నేలమీదకు చూస్తూ, శత్రువులు రాకుండా జాగ్రత్త పడడానికి వీలవుతుంది– అంది. ఈ ఆలోచన కూడా నచ్చడంతో వెంటనే అమలు పరిచాయి.
మరికొంతసేపు గడిచింది. ఇంకొక కోతి అంది– నేలచూపులు ఎంతసేపు చూస్తాం... పండ్లవైపు చూస్తే మాత్రం ఉపవాస వ్రతానికి నష్టం ఏంటి– అని. వెంటనే ఆ సలహా కూడా అమలులోకి వచ్చేసింది. మరోకోతికి మరో ఆలోచన వచ్చింది. ఉపవాసం కారణంగా మనకు ఆకలి ఎక్కువగా ఉండి, మంచి పండ్లను ఏరుకునే సమయం ఉండకపోవచ్చు. అందువల్ల రేపటికి తినడానికి వీలుగా ఏం పండ్లు ఉంటాయో, ఇప్పుడే పరీక్షించి పెట్టుకుంటే బాగుంటుంది కదా– అని. ఇంకేం... కోతులన్నీ మంచి మంచి పండ్లను ఏరుకోవడం మొదలెట్టాయి. ‘రేపు మనకు ఎంత నీరసంగా ఉంటుందో ఏమో, కొన్ని పండ్లు పైకి బాగున్నా, లోపల పురుగులుండవచ్చు. కాబట్టి ఇప్పుడే వాటిని కొద్ది కొద్దిగా రుచి చూసి పక్కన పెట్టుకుంటే మన ఉపవాస వ్రతానికి నష్టం ఏమైనా వాటిల్లుతుందా ఏమిటి? మనుషులు కూడా అలాగే పొద్దున ఉపవాసం ఉంటూనే, రాత్రి పలహారానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటూనే ఉంటారు’’ అంటూ అనుభవజ్ఞురాలైన ఓ వృద్ధ వానర ం తనలో తాను గొణుక్కుంటున్నట్లుగా అంది. అన్నింటికంటే ఈ సలహా కోతులన్నిటికీ బాగా నచ్చింది. కోతులన్నీ ఆవురావురుమని పండ్లన్నీ ఆరగించేయడం మొదలెట్టేశాయి. చివరికి వాటి ఉపవాస వ్రతం అలా ముగిసింది. మనం ఏదైనా ఒక పని ప్రారంభిద్దాం అనుకోగానే ఇలాగే నలుగురూ వచ్చి నాలుగు సలహాలు చెబుతారు. దాంతో మనం అనుకున్న పని కాస్తా అటక ఎక్కుతుంది. ఒకవేళ వాళ్లు చెప్పిన సలహాలు మంచివే అనుకోండి, వాటిని పాటించేందుకు తగిన సమయం సందర్భం, వాటిని పాటించే క్రమంలో నిగ్రహం, నిక్కచ్చితనం అవసరం.
– డి.వి.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment