ఇంటికి వెళ్లాలని ఉంది | The girl from Germany is Islam Religion has adopted | Sakshi
Sakshi News home page

ఇంటికి వెళ్లాలని ఉంది

Published Wed, Feb 6 2019 1:19 AM | Last Updated on Wed, Feb 6 2019 12:45 PM

The girl from Germany is Islam Religion has adopted - Sakshi

టీనేజీ యువత పట్ల తల్లిదండ్రులు తగిన శ్రద్ధ కనబరచనట్లయితే లియోనారా లాగే మరికొంత మంది ఐఎస్‌ కబంధ హస్తాల్లో చిక్కుకోవాల్సి ఉంటుందని ఈ ఘటన హెచ్చరిస్తోంది. ‘ఐఎస్‌’ ఎక్కడో ఉంటుందని అనుకోకండి. ప్రేమ రూపంలోనో, డబ్బు ఆశ చూపిస్తూనో అది మన వీధిలోనే మన పిల్లల కోసం వల పట్టుకుని తిరుగుతుండవచ్చు.

ఇప్పుడు తెలుస్తోంది.. 
అవును ఇప్పుడే తెలుస్తోంది..
నేను పెద్ద తప్పు చేశాను...
ఆ తప్పు దిద్దుకునే మార్గం కోసం రోజూ వెదుకుతూనే ఉన్నాను..
ఇంటికి వెళ్లాలని ఉంది..
పూర్వపు జీవితం గడపాలని ఉంది..


ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) లో భాగమైన ఓ జర్మన్‌ యువతి ఆవేదన ఇది. ఉగ్రవాదికి మూడో భార్యగా ఉంటూ 19 ఏళ్లకే ఇద్దరు పిల్లలకు తల్లిగా మారినందుకు తీరని వేదన అనుభవిస్తున్న ఆమె.. విముక్తి లభిస్తే స్వదేశానికి వెళ్తానంటూ పశ్చాత్తాపపడుతోంది.

ఇస్లాం స్వీకరించి.. సిరియాకు 
లియోనారా జర్మనీకి చెందిన యువతి.  పదిహేనేళ్ల ప్రాయంలో ఇస్లాం మతం స్వీకరించింది. ఆ తర్వాత అప్పటికే ఇద్దరు భార్యలు కలిగి ఉన్న జర్మన్‌ జీహాదిస్టు మార్టిన్‌ లెమ్కే (28) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అనంతరం అతడి కుటుంబంతో కలిసి సిరియాకు పారిపోయింది. అయితే... సిరియాను వశం చేసుకునేందుకు ఐఎస్‌ సాగిస్తున్న మారణకాండను కళ్లారా చూసేంతవరకు .. ఆ ఉగ్రమూక పట్ల ఆమెకు సానుభూతి వైఖరే ఉంది.

కానీ ఎప్పుడైతే అంతర్యుద్ధంలో తన కుటుంబం భాగస్వామ్యమైందో అప్పుడే తాను ఎంత పెద్ద తప్పు చేశానన్న విషయం లియోనారాకు బోధపడింది.భర్త, ఇద్దరు సవతులతో కలిసి లియోనారా మొదట ఐఎస్‌ రాజధాని రాకాలో నివాసం ఉండేది. ఆ సమయంలో భర్త తనను కేవలం ఒక పనిమనిషిగానే చూసేవాడు. వంట చేయడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, అందరికీ సపర్యలు చేయడం ఇదే ఆమె రోజు వారీ దినచర్య. అలా నాలుగేళ్లుగా గృహిణిగా తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తున్న లియోనారా.. ఇద్దరు పిల్లలకు తల్లయింది. తన ఇంట్లో తానే ఓ పనిమనిషిలా కాలం వెళ్లదీసింది.

వారానికో ఇంట్లో నివాసం
బహిరంగ శిరచ్ఛేదనలు, అత్యాచారాలతో సిరియా ప్రజలకు భీతికొల్పుతున్న ఐఎస్‌ నుంచి రాకాను స్వాధీనం చేసుకునేందుకు.. స్థానిక కుర్దిష్‌ వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సిరియాలో ప్రజాస్వామ్య పాలనే లక్ష్యంగా... ఐఎస్‌కు మద్దతుగా నిలుస్తున్న ‘జీహాదీ’ లను ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా రాకాను స్వాధీనం చేసుకుని సగం విజయం సాధించాయి. ఈ క్రమంలో వేలాది మంది ఐఎస్‌ సానుభూతిపరుల కుటుంబాలకు నిలువ నీడ లేకుండా పోయింది. ఇదే అదనుగా దొరికిన వాళ్లను దొరికినట్టుగా అదుపులోకి తీసుకున్న సిరియన్‌ డెమొక్రటిక్‌ ఫోర్సెస్‌(ఎస్‌డీఎఫ్‌) వారిని క్యాంపులకు తరలించడం మొదలుపెట్టాయి.

మరోవైపు తమదేశంలో ఉన్న విదేశీ జీహాదీలను ఈ క్యాంపు నుంచి తిరిగి స్వదేశానికి తీసుకువెళ్లాలంటూ పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నాయి.ఈ క్రమంలో ఎస్‌డీఎఫ్‌ నుంచి తప్పించుకునేందుకు లియోనారా కుటుంబం వారానికో ఇంట్లో తలదాచుకునేది. అయితే ఆ సమయంలో ఐఎస్‌ వీరి గురించి పట్టించుకునేది కాదు. ఐఎస్‌ గురించి పూర్తిగా తెలిసిన తర్వాత వారి కంటే కుర్దిష్‌దళాలే నయమని భావించి లియోనారా.. భర్త, ఇద్దరుపిల్లలు, భర్త రెండోభార్యతో కలిసి ఎస్‌డీఎఫ్‌ క్యాంపునకు బయల్దేరింది. ఇందులో భాగంగా వారు ఇరాక్‌ సరిహద్దులోని బాగోజ్‌ గ్రామానికి చేరుకున్నారు. అయితే తూర్పు సిరియాలో గస్తీ కాస్తున్న అమెరికా మద్దతు దేశాల బలగాలు లియోనారా భర్త మార్టిన్‌ను గత గురువారం అదుపులోకి తీసుకున్నాయి.

నా భర్త ఉగ్రవాది కాదు
‘నా భర్త కంప్యూటర్లు రిపేర్‌ చేసేవాడు. అదే విధంగా కంప్యూటర్‌ విడిభాగాలు, ఫోన్లు ఐఎస్‌కు సరఫరా చేసేవాడని మాత్రమే నాకు తెలుసు.  ‘రాకా’ను కోల్పోయిన ఐఎస్‌ మమ్మల్ని పూర్తిగా వదిలించుకోవాలని చూసింది. తినడానికి తిండి ఉండేది కాదు. పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే అలా చూస్తూ ఉండటం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. టీనేజ్‌లో నేను చేసిన తప్పు నా పిల్లల పాలిట శాపంగా మారుతుందని ఊహించలేకపోయాను.

ఇప్పుడు నా సొంత ఇంటికి వెళ్లాలని ఉంది’  అంటూ లియోనారా తన పరిస్థితి గురించి అంతర్జాతీయ మీడియా ముందు మొరపెట్టుకుంటోంది.అయితే లియోనారా భర్త ఐఎస్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించేవాడని, వేలాదిమంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి అతడే సూత్రధారి అని జర్మన్‌ మీడియా అంటోంది. ఏదేమైనప్పటికీ లియోనారా గనుక నిజంగా పశ్చాత్తాపడితే మాత్రం ఆమెను స్వదేశానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించాల్సి ఉంటుందని మానవ హక్కుల కార్యకర్తలు అంటున్నారు. 
– యాళ్ల సుష్మారెడ్డి, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement