ఎక్కువగా లవ్వాడితే... ‘భగ్నప్రేమికులు’లే! | Good fat | Sakshi
Sakshi News home page

ఎక్కువగా లవ్వాడితే... ‘భగ్నప్రేమికులు’లే!

Published Thu, Oct 15 2015 6:46 PM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM

ఎక్కువగా లవ్వాడితే... ‘భగ్నప్రేమికులు’లే!

ఎక్కువగా లవ్వాడితే... ‘భగ్నప్రేమికులు’లే!

సర్ఫ్ ఎక్సెల్ ప్రకటనలో ఓ గమ్మత్తై విషయం ఉంటుంది. మరక మంచిదని! ఎందుకంటే అల్లరి చేసేటప్పుడు బట్టలు మురికవుతాయని.
అల్లరి మానేస్తే పిల్లలు మానసికంగా ఎదగరని.అలాగే... కొవ్వు మంచిదే!మంచి కొవ్వు చాలా మంచిది.విటమిన్లను వృథా కాకుండా శరీరంలో ఇంకేలా చేస్తుంది. అలా అని కొవ్వును మరీ ఎక్కువగా లవ్వాడితే... ‘భగ్నప్రేమికులు’  కావడం ఖాయం.
 
 
ఏ మోతాదులో కొవ్వు మంచిదో...ఎక్కువైతే నష్టాలేమిటో...మీకు తెలియజేయడానికే ఈ కథనం.
కొవ్వెక్కువైతే ముప్పు తప్పదని అందరికీ తెలిసిందే. అయితే, ఒంట్లో కొవ్వు తక్కువైనా చిక్కులు తప్పవు. ఆరోగ్యం సజావుగా ఉండాలంటే హెచ్చుతగ్గులకు తావు లేకుండా, శరీరానికి సమపాళ్లలో కొవ్వులు అందాల్సిందే. చాలామందిలో భయాలు ఉన్నట్లుగా కొవ్వులన్నీ చెడ్డవి కాదు. కొవ్వుల్లోనూ మంచి కొవ్వులు ఉన్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే మంచి కొవ్వును హైడెన్సిటీ లైపో ప్రొటీన్ (హెచ్‌డీఎల్) అంటారు. ఆరోగ్యానికి చేటు చేసే చెడు కొవ్వును లోడెన్సిటీ లైపో ప్రొటీన్ (ఎల్‌డీఎల్) అంటారు. గుండెజబ్బులు, పక్షవాతం వంటి ప్రాణాంతకమైన వ్యాధులకు దారితీసే చెడు కొవ్వులనే సామాన్య పరిభాషలో కొలెస్ట్రాల్ అంటారు. గ్రీక్‌లో ఖొలె అంటే అంటే పిత్త సంబంధమైన కొవ్వు. స్టెరాల్ అంటే ఘనరూపం (సాలిడ్ లేదా స్టిఫ్) అని అర్థం. స్థూలంగా చెప్పాలంటే కొలెస్ట్రాల్ అంటే ఘనరూపంలో కొవ్వు.
 
కొవ్వుల హెచ్చతగ్గుల వల్ల సమస్యలు

 కొవ్వు మన జీవక్రియలకు అవసరం. పిండ దశ నుంచి రెండేళ్ల వయసు వరకూ అన్ని రకాల పెరుగుదలకు, మానసిక ఎదుగుదలకు అది అత్యావశ్యకం. అందుకే మన కాలేయం దాన్ని తయారు చేస్తూ ఉంటుంది. కాకపోతే వినియోగం కంటే ఎక్కువ తయారవుతూ ఉండటం, ఆహారం ద్వారా మనం తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదుకు మించి పెరుగుతుంది. స్పర్శకు వెన్నలా అనిపించే కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోతూ ఉంటుంది. దీన్నే ప్లాక్ అని కూడా అంటారు. రక్త ప్రసరణకు అది అడ్డుపడుతూ ఉంటుంది. కొలెస్ట్రాల్ మోతాదు పెరిగి రక్తనాళాల్లో పేరుకుపోయినప్పుడు అది గుండె రక్తనాళాల్లో అడ్డుపడితే గుండెపోటునూ, మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాల్లో పేరుకుంటే పక్షవాతాన్నీ కలిగించవచ్చు. కాళ్లల్లోని నరాల్లో పరిమితికి మించిన కొవ్వులు పేరుకుపోతే, చివరకు ఆంప్యుటేషన్ (అవయవాన్ని తొలగించడం) తప్ప గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, కొవ్వులు తక్కువైనా మనకు ఇబ్బందులు తప్పవు. శరీరానికి పోషణను అందించే విటమిన్లలో కొవ్వుల్లో కరిగే ఏ, డీ, ఈ, కే విటమిన్లు శరీరానికి అందని పరిస్థితి ఏర్పడుతుంది. వాటి లోపం వల్ల కంటి సమస్యలు, ఎముకల బలహీనత, చర్మం కాంతివిహీనం కావడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

 కళ్లలో కొవ్వు...
 కళ్లలో ఉండే నల్లగుడ్డు కార్నియా చుట్టూ ఒక అంచులాగా కొలెస్ట్రాల్ ఉంటుంది. జాగ్రత్త గమనించే డాక్టర్లు దీన్ని గుర్తించగలరు. ఈ తెలుపు అంచు ఉన్నంత మాత్రాన గుండెకు కొవ్వు చేరే అవకాశం ఉందని నిర్ధారణ కాదు. అయితే దాన్ని చూడగానే కనురెప్పలను కూడా పరిశీలిస్తారు. కనురెప్పల్లో కొవ్వు పేరుకొని ఉంటే దానిని వైద్య పరిభాషలో ‘జాంథలాస్మా’ అంటారు. దీని వల్ల గుండెజబ్బులు రాగల అవకాశాలను డాక్టర్లు ఐదేళ్ల ముందే తెలుసుకోగలరు.

 కండ కాదు... ఇది కొవ్వుండ...
 వృద్ధాప్యం పెరుగుతున్న కొద్దీ కొందరిలో కొవ్వు ఒకచోట చేరి ఒంటిపై చిన్న చిన్న ఉండల్లా కనిపిస్తుంటుంది. ఇవి సాధారణంగా శరీరంపై అన్ని భాగాల్లో వచ్చే అవకాశం ఉన్నా ప్రధానంగా మోచేయి, మోకాలు, చేతులపై ఎక్కువగా కనిపిస్తాయి. కొవ్వు నిండి ఉండే ఈ ఉండలను దీన్ని కొవ్వుండ అనుకోవచ్చు. వైద్యపరిభాషలో  ‘గ్జాంథోమా’ అని పిలుస్తుంటారు.

 తరాల తరబడి తరగని కొవ్వు...
   కొంతమందికి కుటుంబాల్లో అందరికీ జన్యుపరంగా అత్యధిక కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ కండిషన్‌ను ‘హైపర్ కొలెస్టరాలేమియా’ అంటారు. దీనికి కుటుంబం అందరికీ చికిత్స అవసరం. ఇక కొలెస్ట్రాల్ తయారయ్యే తీరు జన్యుపరంగా నిర్ణీతమవుతుంది. ఇలాంటి కుటుంబాల వారిలో పదేళ్ల వయసు నుంచే వారికి రక్త పరీక్షలు అవసరం.

 ఇక కొన్ని కుటుంబాల వారు తరాల తరబడి శాకాహారులే అయినా జన్యుపరంగా వారసత్వంగా వారిలో కొలెస్ట్రాల్ తయారీ ఎక్కువగా ఉండి, గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  రక్తంలో కొవ్వులు పేరుకునే కుటుంబ చరిత్ర లేనివాళ్లు సాధారణంగా 40 ఏళ్ల వయసు దాటాక తప్పసరిగా డాక్టర్లు సూచించిన వ్యవధిలో రక్తంలో కొవ్వు పాళ్లు పరిశీలించుకుంటూ ఉండాలి.
 
కణానికీ కణానికీ మధ్య బంధం కొలెస్ట్రాల్...

 కణాల మధ్య బంధం పటిష్టానికి కొవ్వు కావాల్సిందే. ప్రతి సెల్ మెంబ్రేన్‌లోని  కొవ్వు కణాలు ఒకదానితో మరొకటి అంటుకుని ఉండేందుకు తోడ్పడతాయి.  చర్మకణాలలో ఉండి కవచంలా అల్ట్రా వయెలెట్ కిరణాల బారి నుంచి కాపాడుతుందీ మంచి కొవ్వు. అంతేకాదు... సూర్యుడి నుంచి అందే కిరణాలను ఉపయోగించి, చర్మం డి విటమిన్‌ను ఉత్పత్తి చేసుకునేందుకూ దోహదపడుతుంది. కొవ్వు పెరిగిన ప్రతిసారీ అది చేటు కాదు. కాకపోతే కొవ్వొత్తిలోని కొవ్వులా వెలుగుతూ కరుగుతూ జీవితానికి వెలుగునివ్వాలి. కొవ్వు కరగకపోతేనే ఇబ్బంది. తిండీ, శారీరక శ్రమతో అదుపులోకి రాకపోతే మందులతోనైనా దాన్ని అరిగించుకోండి.
 
కొవ్వులు ఎక్కువైనప్పుడు కనిపించే లక్షణాలు
చాలా సందర్భాలలో రక్తపరీక్ష చేయించే వరకు ఒంట్లో కొవ్వులు పెరుగుతున్న విషయం తెలియకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో శరీరంలో కొవ్వు పెరుగుతోందని. తొలుత ఉండలా, తర్వాత కొండలా పేరుకుంటోందని నిపుణులకు ముందే తెలుస్తుంది. ఒంట్లో అనవసరంగా కొవ్వు పేరుకుపోతూ ఉంటే కొందరిలో మెడ వద్ద, చంకల వద్ద ఎక్కువ సంఖ్యలో పులిపిర్లు ఏర్పడతాయి..
 
కొవ్వుతో లవ్వెందుకు పెంచుకోవాలంటే..?
కొవ్వు లేకపోతే లవ్వు అనే మాటకు అర్థమే లేదు. ఎందుకంటే కొలెస్ట్రాల్ లేకపోతే మనలో సెక్స్ కోరికలను పెంచే హార్మోనులు చక్కగా తయారుకావు. పురుషుల్లో టెస్టోస్టెరాన్ తయారీకీ, మహిళల్లో ఈస్ట్రోజెన్ ఉత్పత్తికీ దోహదం చేసేది ఈ కొవ్వే.
 
కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే...  తినాల్సిన, తినకూడని పదార్థాలు...
 
 తినాల్సినవి
►{పతిరోజూ కనీసం 20 - 35 గ్రాముల పీచుపదార్థాలు తీసుకోవాలి. ముడిబియ్యం, పొట్టుతీయని ధాన్యాలు, పొట్టుతీయని గోధుమలతో చేసిన బ్రెడ్, వాల్‌నట్, బాదం వంటి నట్స్, తాజాపండ్లు.
►వేరుశనగలు, అవిసె గింజలు, పాప్‌కార్న్, శాకాహార నూనెలు, ఉడికించిన కూరగాయలు
►ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే సాల్మన్, సార్డిన్, హెర్రింగ్ వంటి చేపలు, చికెన్
 
 తినకూడనివి

►నూనెల్లో బాగా వేయించిన వేపుళ్లు, పిజ్జా, బర్గర్లు, మిర్చిబజ్జీలు వంటి జంక్‌ఫుడ్
►కొవ్వులు ఎక్కువగా ఉండే వేటమాంసం, రొయ్యలు, పీతలు వంటి మాంసాహారం
 
 కొలత పెరిగితే కలత...

►మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) 40 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా ఉండాలి.
►చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) 100 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉండాలి.
►మంచి, చెడు కలిసిన కొవ్వులు 140-200 ఎంజీ/డీఎల్ ఉంటే నార్మల్.  4200-239 ఉంటే అది బార్డర్‌లైన్.
 ► 240 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువ ఉంటే అది హైకొలెస్ట్రాల్ అని గుర్తిస్తారు.

 - ఇన్‌పుట్స్: డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి
 కన్సల్టెంట్ - ఇంటర్నల్ మెడిసిన్
 అండ్ డయాబెటిస్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement