గూగుల్...గాల్లో తేలి వస్తోంది..! | Google ... the air is buoyant ..! | Sakshi
Sakshi News home page

గూగుల్...గాల్లో తేలి వస్తోంది..!

Published Wed, Oct 1 2014 10:09 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

గూగుల్...గాల్లో తేలి వస్తోంది..! - Sakshi

గూగుల్...గాల్లో తేలి వస్తోంది..!

ఆశ్చర్యపరిచే ఆవిష్కరణల ద్వారా ప్రపంచాన్ని తరచుగా పలకరించడం గూగుల్ కు అలవాటే. అయితే ఈ మధ్య కాలంలో అది కొంచెం తగ్గింది. స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు, అప్లికేషన్‌ల కొనుగోలు ఒప్పందాల్లో బిజీగా ఉన్న ఆ సంస్థ అప్పుడెప్పుడో గూగుల్ గ్లాస్‌ప్రాజెక్ట్ గురించి ప్రకటించడం తప్ప పెద్దగా హడావుడి చేసింది లేదు. ప్లే స్టోర్ మీదే ఎక్కువ ఏకాగ్రత నిలిపినట్టు అనిపిస్తున్నా... గూగుల్ గత రెండేళ్లుగా రహస్యంగా ఒక ప్రాజెక్టును చేపట్టింది. దాని పేరే ‘గూగుల్ ఎక్స్’!  ఈ ‘ఎక్స్’ ఏమిటి? ఏమా కథా అనే విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది.
 
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రూరల్‌లోని ఒక ప్రాంతం. అక్కడి కొండల గుట్టల నడుమ ఉండే ఒక రైతు ఇంటికి చెర్రీరైప్ చాక్లెట్లను డెలివరీ చేయడం ద్వారా గూగుల్ ఎక్స్ ప్రాజెక్టు సక్సెస్ అయ్యింది! ప్రపంచ భవిష్యత్తుపై కొత్త ప్రభావం చూపడానికి గూగుల్ వేసిన మరో అడుగు విజయవంతం అయ్యింది. తాము రూపొందించిన ‘డ్రోన్ ’ ద్వారా మారుమూల ప్రాంతంలోని ఒక ఇంటికి చాక్లెట్లను డెలివరీ చేసిన గూగుల్ సంస్థ మరి కొన్ని సంవత్సరాల్లో ప్రపంచంలోని డెలివరీ తీరునే మార్చేస్తామనే విశ్వాసం వ్యక్తం చేస్తోంది. వాహనాల రద్దీ తగ్గుతుంది.. డెలివరీ కోసం ప్రత్యేకంగా మనుషుల అవసరం లేదు... పనులు మానుకొని షాపుల వరకూ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆర్డర్ చేసిన వస్తువులను తీసుకొని అడ్రస్ పట్టుకొని ఒక బుల్లి విమానం మీ ఇంటి వద్ద ల్యాండ్ అవుతుంది... గూగుల్ డ్రోన్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే జరిగేది ఇదే! షాపుల వద్ద నుంచి ఫుడ్‌కోర్టుల వద్ద రెడీగా ఉన్న డ్రోన్స్ సరుకును తీసుకొని టేకాఫ్ అవుతాయి. ఆర్డర్ చేసిన వారి దగ్గర ల్యాండ్ అవుతాయి. ప్రస్తుతం 30 డ్రోన్స్‌తో ఆస్ట్రేలియాలో ఈ పని చేయిస్తున్నారు.
 
మానవ రహిత విమానాల స్ఫూర్తితో...

మనిషి మెదడు మెమొరీ కార్డులా ఉండకూడదు.. ఒక ప్రాసెసర్‌గా ఉండాలి. అలా ఏ విషయంలోనైనా ప్రాసెసర్‌లా వ్యవహరిస్తూ.. వస్తువులను ఉపయోగపడే విధంగా అనుసంధానించడమే పెద్ద కళ. గూగుల్ మేధావులు ఇప్పుడు ఆ కళనే అమల్లో పెట్టారు. యుద్ధక్షేత్రాల్లో శత్రువుల ఉనికి గురించి కనుగొనడానికి ఉపయోగించే తేలికపాటి అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్(యూఏవీస్)ల స్ఫూర్తితో వాటిని వాణిజ్యపరంగా అందరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలనే ఐడియానే గూగుల్ డ్రోన్స్ రూపకల్పనకు మార్గమైంది.
 
ఎలా పనిచేస్తుంది..?

విమానం లుక్‌తో, హెలీకాప్టర్ ఫీచర్స్‌తో ఉండే ఒక హైబ్రీడ్ వాహనమే డ్రోన్. నిట్టనిలువుగా టేకాఫ్ అవుతుంది. పక్షిలాగా మలుపు తిరుగుతుంది. సిమెంటు నిర్మాణాలపై ల్యాండ్ అవుతుంది. అవసరాన్ని బట్టి వీటి క్యారేజ్‌లు ఏర్పాటు చేస్తారు. సుర క్షణ, వేగాలే ప్రత్యేకతగా డెలివరీ సిస్టమ్‌లో సరికొత్త మార్పుగా ఆవిష్కృతం అవుతున్నాయి గూగుల్ డ్రోన్స్. అంతర్గతమైన ప్రోగ్రామింగ్, గగనతలంలో విహరించేటప్పుడు భూతలంలోని స్టేషన్ నుంచి ఆపరేట్ చేయడం ద్వారా ఇవి నిర్దేశించిన గమ్యాన్ని చేరతాయి. వస్తువులను డెలివరీ చేస్తాయి. నికోలస్‌రోయ్ గూగుల్ ఎక్స్ ప్రాజెక్ట్ హెడ్‌గా ఉన్నారు. తాము ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నామని.. అందుబాటులోకి వస్తే మంచి ఫలితాలు ఉండబోతున్నాయని అయన తెలిపారు.
 
ప్రభావం..?!

పూర్తి స్థాయిలో విజయవంతం అయితే మానవజీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపగలవు ఈ డ్రోన్స్. ఇప్పుడు ఏయే వస్తువుల విషయంలో ‘డెలివరీ’ అనేది ప్రత్యేకమైన అంశం అవుతోంది... వివిధ వస్తువులు ఎలా ఇళ్లకు చేరుతున్నాయి.. వాటికోసం ఎన్ని వనరులను ఉపయోగిస్తున్నారో ఒక సారి ఆలోచించి... వాటికి ప్రత్యామ్నాయంగా గాల్లో తేలుతూ వచ్చే డ్రోన్స్‌ను ఊహించుకొంటే ఇవి ఏయే వ్యవస్థలను ప్రభావితం చేస్తాయో సులభంగా అర్థం చేసుకోవచ్చు.
 
ఫిఫా వరల్డ్‌కప్ కోసం పనిచేశాయి...

ఇటీవలే బ్రెజిల్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ల సందర్భంగా స్టేడియంలలో డోన్స్ విహరించాయి. వాటికి అమర్చిన కెమెరాల ఫుటేజీనే మనం లైవ్‌లో చూశాం. ఇక సైన్యాలు కూడా డ్రోన్‌లనే వినియోగిస్తున్నాయి. మనుషులు వె ళ్లలేని ప్రాంతాల్లోకి దూసుకెళ్లగల డ్రోన్స్ విపత్తు సహాయక చర్యల్లో వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అనేక రకాల్లో అనేక విధాలుగా డ్రోన్స్ వినియోగంలో ఉన్నాయి.
 
ఇక డ్రోన్ డెలివరీ...

ఇప్పటికే గూగుల్‌గ్లాసెస్ కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. ఇప్పుడు డ్రోన్స్ కూడా అంతే ఆసక్తిని రేపుతున్నాయి. వాణిజ్య పరంగా... సౌకర్యంగా ఉపయోగపడతాయనే అభిప్రాయాలు... గూగుల్‌పై సహజంగానే ఉండే భారీ అంచనాలు... ఈ డ్రోన్స్‌పై ఆసక్తిని మరింత అధికం చేస్తున్నాయి. త్వరలోనే వీటి విహారం అని గూగుల్ కూడా హామీ ఇస్తోంది కాబట్టి.. లెట్ వెయిట్ అండ్ సీ..!
 
- జీవన్ రెడ్డి.బి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement