ఇయర్ క్యాలెండరే కాదు... హెయిర్ క్యాలెండర్ కూడా
క్యాలెండర్ అందరూ తయారు చేస్తారు. కానీ మైక్ వుల్ఫ్ అనే మహానుభావుడు క్యాలెండ్ ‘హెయిర్’ తయారు చేశాడు. వుల్ఫ్ గారికి వీపు మీద తోడేలులాంటి కేశరాశి ఉంది. దాన్ని సదుపయోగం చేయాలన్న తాపత్రయం ఉంది. దానికి భార్య అందించిన ప్రోత్సాహం అగ్నికి వాయువులా, మిత్రుడు టేలర్ హార్గింగ్ కళాత్మకత ఆజ్యంలా పనిచేశాయి. ఇంకేముంది? వీపు కేన్వాస్ అయింది. వెంట్రుకలు డ్రాయింగ్‌లు అయ్యాయి. టేలర్ గారు వీపుపై వెంట్రుకలతో డిజైన్లు గీశాడు. వాటిని ఫొటోలుగా తీసి, క్యాలెండర్‌గా తయారు చేశాడు. ఒక్కో క్యాలెండర్ ఇరవై డాలర్ల చొప్పున అమ్మేశాడు.
అవి శరవేగంగా అమ్ముడైపోయాయి. ఆయనకు బోలెడంత డబ్బు వచ్చింది. అయితే ఉల్ఫ్ గారికి తోడేలులాంటి కేశ రాశే కాదు. భల్లూకంలాంటి పట్టుదల కూడా ఉంది. పులిలాంటి ఓపిక ఉంది. ఏనుగంత ఆలోచన ఉంది. సింహం లాంటి హృదయం ఉంది. క్యాలెండ్ హెయిర్ అమ్మగా వచ్చిన డబ్బును మొత్తాన్ని చర్చి సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చేశాడు.