దైవానికి దగ్గర చేసే హజ్ | hajj tour special story | Sakshi
Sakshi News home page

దైవానికి దగ్గర చేసే హజ్

Published Sat, Sep 10 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

దైవానికి దగ్గర చేసే హజ్

దైవానికి దగ్గర చేసే హజ్

ఇస్లామీ ధర్మ మౌలిక సూత్రాల్లో కాబా సందర్శనా యాత్ర (హజ్జ్) కూడా ఒకటి. దైవాన్ని విశ్వసించేవారు నమాజ్, రోజా, జకాత్‌లతో పాటు ఆర్థిక స్థోమత ఉంటే ‘హజ్’ యాత్ర చేయడం తప్పనిసరి విధి.

ఇది సుమారు వేయిన్నర సంవత్సరాల నాటిమాట. ఒక వ్యకి ్తతన సేవకుడిని వెంటబెట్టుకొని హజ్ యాత్రకు బయలుదేరాడు. ఆ కాలంలో ఎంతదూరం వెళ్ళాలన్నా ఒంటెలు, గుర్రాలే ప్రధాన ప్రయాణ సాధనాలు. సేవకుడితో కలిసి అశ్వంపై బయలుదేరిన ఆ వ్యక్తి ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఓ గ్రామ పొలిమేరకు చేరుకున్నాడు. ఊరిబయట పాడుబడిన ప్రదేశంలా ఉంది ఆ ఇరుకుదారి.

దారి పక్కన ఒక అమ్మాయి ఏదో వస్తువు పోగొట్టుకున్నదానిలా తచ్చాడుతూ నిలుచొని ఉంది. బహుశా పది, పన్నెండేళ్ళు ఉంటాయేమో. చింపిరి జుట్టు, పీక్కుపోయిన కళ్ళు, చిరిగిన బట్టలు.. ముఖంలో దీనత్వం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. అంతలో ఆమె దృష్టి ఏదో వస్తువుపై పడింది. పోయిందనుకున్న విలువైన వస్తువేదో  దొరికినంత ఆనందంతో ఆమె కళ్ళు మెరిశాయి.

ఎవరైనా చూస్తారేమో అని ఒకవైపున కంగారుపడుతూనే, రెప్పపాటులో ఆ వస్తువును తన ఒళ్ళో వేసుకుంది.

సరిగ్గా అదే సమయాన అటుగా వెళుతున్న వ్యక్తి ఆ దృశ్యాన్నిచూసి నిర్ఘాంతపోయాడు. వెంటనే గుర్రం దిగి, ఆ అమ్మాయి వైపుగా నడిచాడు. ఆమె భయం భయంగా అతని వైపే చూస్తూ తప్పుచేసినదానిలా తలవంచుకొని నిలుచొంది.

‘ఏమిటమ్మా ఇదీ.. చచ్చినపక్షి కదా! దీన్ని ఏంచేస్తావు?’ అంటూ చిరునవ్వుతో పలకరించాడాయన.

ఆ అమ్మాయి కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. దుఖం గుండెను మెలిపెడుతుంటే కొద్దిసేపటిదాకా మాట్లాడలేకపోయింది. ఎట్టకేలకు కట్టలు తెంచుకువస్తున్న దుఃఖాన్ని అదుపుచేసుకొని, గద్గద స్వరంతో ‘‘అయ్యా! మేము అమ్మానాన్నలు లేని అనాథలం. కొన్నాళ్ళక్రితం కొందరు దుండగులు మా కుటుంబాన్ని చంపేసి, ఉన్నదంతా దోచుకుపోయారు. చిల్లిగవ్వమిగల్లేదు...’’

‘అయ్యయ్యో..! ఎంతఘోరం జరిగిందమ్మా..!’’ అన్నాడా వ్యక్తి ఎంతో సానుభూతితో.. ఆ అమ్మాయి కారుతున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ మళ్ళీ ఇలా అంది...

‘ప్రస్తుతం మాయింట్లో నేను, మా తమ్ముడే ఉన్నాము. తినడానికి తిండి, తొడుక్కోడానికి బట్టలు లేక నానా బాధలూ పడుతున్నాం. అలానే రోజులు గడిచిపోతున్నాయి. రెండుమూడు రోజులుగా తినడానికి ఏమీ లేదు. నేనెలాగో తట్టుకోగలను కాని, తమ్ముడే మరీ తట్టుకోలేకపోతున్నాడు. ఆకలితో అలమటించి పోతున్నాడు. వాడి బాధ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. ఆ గోస చూడలేక ఇలా బయలుదేరాను... తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని. ఇదిగో ఇక్కడ ఈ చచ్చిన పక్షి కనబడింది. దీన్ని తీసుకెళ్ళి తమ్ముడికి కాల్చిపెడితే కనీసం వాడి ప్రాణం నిలబడుతుంది’ అన్నదా అమ్మాయి కళ్ళుతుడుచుకుంటూ.

ఈ మాటలు వినగానే ఆ వ్యక్తి నిలువెల్లా చలించిపోయాడు. హృదయం మంచుముక్కలా కరిగిపోయింది. మమతా, మానవత్వం సముద్ర కెరటాల్లా ఉప్పొంగాయి. ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని ప్రేమగా తల నిమురుతూ తను ‘హజ్’ కోసం తెచ్చుకున్న పైకాన్ని ఆ అమ్మాయి చేతిలో పెట్టాడు.

పుట్టెడు దుఃఖం, భయంకరమైన ఆకలితో నకనకలాడుతున్న ఆ అమ్మాయి ముఖారవిందం ఒక్కసారిగా కలువ పువ్వులా విప్పారింది. ఆనంద భాష్పాలు జలజలా రాలుతుండగా, వణుకుతున్న చేతులతో బరువైన ఆ డబ్బుల సంచిని అందుకుంది. ఆ సమయాన ఆ పాప ముఖంలో విరబూసిన ఆనంద రేఖలను చూసి, అతని మనసు సంతోషంతో పులకించిపోయింది.

తరువాత, మరలా ఆ పాపను దగ్గరికి తీసుకొని, తల నిమురుతూ - ‘‘అమ్మా.. ఇకవెళ్ళు. తమ్ముడు ఎదురుచూస్తుంటాడు. ఈ డబ్బుతో నువ్వు, మీ తమ్ముడు హాయిగా ఉండండి. మీ పేదరికాన్ని దూరంచేసిన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోండి. డబ్బును చాలా జాగ్రత్తగా వాడుకోండి. దేవుడు ఎప్పుడూ మీకు తోడుంటాడు. ఆయన్ని ఎప్పటికీ మరువకండి. ఆయనకే కృతజ్ఞులై ఉండండి. అమ్మా, ఇక త్వరగా వెళ్ళి తమ్ముడికి ఏమైనా వండిపెట్టు’’ అన్నాడా వ్యక్తి.

వెంటనే ఆ అమ్మాయి ఒళ్ళో ఉన్న చచ్చిన పక్షిని దూరంగా విసిరేస్తూ - ‘ఇక ఇప్పుడు చచ్చినదాన్ని తినడం మాక్కూడా ధర్మసమ్మతం కాదు. సమయానికి మమ్మల్ని ఆదుకున్నారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న మమ్మల్ని కనికరించారు. మీ మేలు ఏనాటికీ మరిచిపోలేము. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. మరి వెళతానండీ’ అంటూ, ఎప్పుడు తమ్ముడి ఆకలితీర్చాలా అనుకుంటూ, సంతోషంతో ఇంటిదారిపట్టింది వడివడిగా.

ఆ వ్యక్తి ఆ పాప వెళ్ళిన వైపే కొన్నిక్షణాలపాటు తదేకంగా చూస్తూ, తృప్తిగా నిట్టూర్చాడు.

ఈ తతంగమంతా చాలా సేపటినుండి నిశ్చేష్టుడై గమనిస్తున్న అతని సేవకుడు - ‘‘అయ్యా.. ఉన్న డబ్బంతా దానం చేశారు. ప్రయాణం ముందుకు సాగేదెట్లా..? మరి తమరి హజ్ యాత్ర..?’’ అని ఏదో అనబోతుండగా.. ‘‘నువ్వేమీ కంగారుపడకు. ఈయేడు మనం తల పెట్టిన హజ్ యాత్ర ఇక్కడే నెరవేరింది. ఇది కాబా యాత్రకంటే గొప్పయాత్ర’’ అన్నాడు హజ్ సంకల్పంతో బయలుదేరిన ఆ వ్యక్తి.

‘నిజమేనయ్యా.. ఇంతకంటే గొప్పపుణ్య కార్యం, పుణ్యయాత్ర మనకింకేం కావాలి. దేవుడు చాలా గొప్పవాడు’ అన్నాడు సేవకుడు ఆనందంతో..

‘సరే ఇక ఇంటికి వెళదాం పద. ఈ సంవత్సరం మనం చేయదలచిన హజ్ యాత్రను దైవం ఇక్కడే స్వీకరించాడు. దైవం తలిసే ్తవచ్చేయేడు మళ్ళీ హజ్ యాత్రకు వెళదాం’ అన్నారు హజ్ సంకల్పంతో బయలుదేరిన ఆ పుణ్యాత్ముడు హ. అబ్దుల్లాహ్ బిన్ ముబారక్ రహ్మతుల్లాహ్ ఐలైహ్!
- యండి.ఉస్మాన్ ఖాన్ ఇస్లాం ధర్మ ప్రబోధకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement