పేపర్లను ఉండలా చుట్టి.... | He tied a rope around the balls of papers .. ... | Sakshi
Sakshi News home page

పేపర్లను ఉండలా చుట్టి....

Published Fri, Jan 31 2014 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM

పేపర్లను ఉండలా చుట్టి....

పేపర్లను ఉండలా చుట్టి....

‘నా పేరు రోనాల్డ్ రీగన్. నేను అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అధ్యక్షుణ్ణి. కానీ మీరెవరో నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పీలే గురించి ఈ ప్రపంచానికి తెలుసు..’ ఇదీ వైట్‌హౌస్‌లో పీలేనుద్దేశించిన నాటి అమెరికా అధ్యక్షుడు అన్న మాటలు.. ఈ భూమండలంపై బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలేకున్న పేరు ప్రఖ్యాతులు ఎలాంటివో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు.
 
సాకర్ చరిత్రలో మారడోనా, ప్లాటిని, బెకెన్‌బార్, బెక్‌హమ్, రొనాల్డో, మెస్సీ, నైమర్ ఇలా ఎంతోమంది సూపర్‌స్టార్లున్నారు. భవిష్యత్‌లో వస్తారు కూడా.. అయినా నూటికి 90 మంది ఒక్క పీలేనే ఆల్‌టైమ్ గ్రేట్‌గా ఎందుకు చెబుతుంటారు..? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న అమెరికా అధ్యక్షుడే తనను తాను పరిచయం చేసుకునే స్థాయికి పీలే ఎలా ఎదిగాడు..? నిజానికి తను పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుడేమీ కాదు.. తన కుటుంబానికి పేరు ప్రతిష్టలు అంతకంటే లేవు. పుట్టింది కడు పేదరికంలో.. సావు పాలోలోని బారు పట్టణంలో పీలే చిన్నతనం పేదరికం లోనే సాగింది.

బతుకు బండి సాగేందుకు టీ దుకాణాల్లో పనివాడుగా చేరాడు. ఇలాంటి నేపథ్యం నుంచి కూడా తానెంతో ఇష్టపడే ఫుట్‌బాల్ ఆటను మాత్రం విడిచిపెట్టలేదు. తండ్రి శిక్షణ ఇచ్చినా ఆడుకునేందుకు తనకంటూ ఓ ఫుట్‌బాల్ కూడా లేదు. దీని కోసం పేపర్లను బంతిలాగా తయారు చేసి దానికి చుట్టూ తాడు కట్టి దాంతోనే ప్రాక్టీస్ కొనసాగించేవాడు. ఇంతటి క్లిష్ట సమయంలోనూ పట్టుదలతోనే ముందుకు సాగాడు. అమెచ్యూర్ ఆటగాడిగా స్థానిక క్లబ్బులకు ఆడుతూ మెరుపులాంటి ఆటతీరుతో అధికారుల దృష్టిని ఆకర్షించసాగాడు.
 
15 ఏళ్ల వయస్సులో పీలే కోచ్ డి బ్రిటో... సాంటోస్ క్లబ్‌కు తీసుకెళ్లాడు. వారికి పీలేను చూపిస్త్తూ ఇతడు ‘ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఫుట్‌బాల్ ఆటగాడు’గా భవిష్యత్‌ను చెప్పాడు. ట్రయల్స్‌లో పీలే ఆటతీరు చూసి  వెంటనే ఒప్పందం చేసుకున్నారు. అది మొదలు ప్రపంచ ఫుట్‌బాల్ క్రీడా ముఖచిత్రంపై ఈ దిగ్గజ ఆటగాడి పేరు మార్మోగిపోయింది. ఆ మరుసటి ఏడాదే జాతీయ జట్టుకు.. 17 ఏళ్లకే ప్రపంచకప్ ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీ సెమీస్‌లో ఫ్రాన్స్‌పై హ్యాట్రిక్ గోల్స్‌తో ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఫైనల్లో స్వీడన్‌పై జట్టు సాధించిన ఐదు గోల్స్‌లో రెండింటిని తనే సాధించాడు. పీలే ఆడిన ఏ మ్యాచ్‌లోనూ బ్రెజిల్ జట్టు ఓడకపోవడం విశేషం.     
- రంగోల నరేందర్ (సాక్షి స్పోర్ట్స్)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement