వయసు పైబడినవారు ఆరోగ్యం కాపాడుకోవాలంటే... | Health, which was over the age of ... | Sakshi
Sakshi News home page

వయసు పైబడినవారు ఆరోగ్యం కాపాడుకోవాలంటే...

Published Mon, Jan 13 2014 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM

Health, which was over the age of ...

నా వయసు 40. ప్రస్తుతం నాకేమీ ఆరోగ్య సమస్యలు లేవు. సాధారణంగా వయసు పైబడినవారికి... అంటే 50 ఏళ్లు దాటిన వారికి ముడుకుల నొప్పులు, ఇతర కీళ్లనొప్పులు వస్తుంటాయి కదా. వాటికి నివారణ మార్గాలున్నాయా? దయచేసి ఆయుర్వేద సూత్రాలు తెలియజేయండి.
 - వి. అవధాని, విశాఖపట్నం

 
 మీ ప్రశ్నను బట్టి మీకు ఆరోగ్యరక్షణకు సంబంధించి అవగాహన, సమస్యల నివారణ పట్ల ఆసక్తి, శ్రద్ధ, ముందుజాగ్రత్త ఉన్నాయని అర్థమవుతోంది. ఇలాంటి స్పృహ సమాజంలో అందరు పౌరులకు ఉంటే ఎంతో బాగుంటుంది. వయసురీత్యా ‘శైశవ, కౌమార, యౌవన, వార్థక్య’ దశలను ఆయుర్వేదం విపులీకరించింది. ‘జారా’ అంటే ముసలితనం అని అర్థం. వార్థక్యం ఒక రోగం కాదనీ, ఇది కేవలం ధాతు శైథిల్యం కలిగే ఒక అవస్థ మాత్రమేననీ, అప్పటి ఆరోగ్యం కాపాడుకోవటానికి ఆహార, విహార, రసాయన ఔషధాలను వివరిస్తూ ‘జరాచికిత్స’ను ప్రత్యేక విభాగంగా పేర్కొంది.
 
 మీరు ప్రస్తావించిన కీళ్లనొప్పులను ‘సంధివాతం’గా అభివర్ణించింది ఆయుర్వేదం. రస, రక్త, మాంస, మేదో, అస్థి, మజ్జా, శుక్రాలు సప్తధాతువులు. వీటిలో ఏది క్షీణించినా వాతప్రకోపం జరుగుతుంది. కీళ్లనొప్పులు ‘అస్థి’ (ఎముకలు) ధాతు క్షయానికి సంబంధించింది. వాస్తవానికి వార్థక్యంలో ఆరోగ్యం బాగుండాలంటే చిన్ననాటి నుంచి కూడా ఆహార, విహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమశిక్షణను ఏ వయసులో ప్రారంభించినప్పటికీ ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. వయస్థాపకం, ఆయుఃవృద్ధి సిద్ధిస్తాయి. ఓజస్సు, క్షమత్వం పెరుగుతాయి. చక్కటి స్వరం, మేధాశక్తి సమకూరుతాయి. పంచజ్ఞానేంద్రియాలూ సమర్థంగా పనిచేస్తాయి. మనస్సు నిర్మలంగా ఉంటుంది.
 
 ఆహారం
 ‘మితాహారం’ ఆయుర్వేద సూత్రాలలో అగ్రస్థానం వహిస్తుంది. దీనికి ప్రత్యేక పరిమాణాలుండవు. వయసునుబట్టి, జీర్ణశక్తిని బట్టి, రుతువును బట్టి, వృత్తిని బట్టి ఈ ప్రమాణం వ్యక్తి వ్యక్తికీ మారుతుంటుంది. తగురీతిలో వ్యాయామం చేయటమనేది, మితాహారంతో చెప్పిన మరో సమాంతర సూత్రం. షడ్రసాలలోనూ ‘లవణం’ (ఉప్పు) చాలా తక్కువగా వాడాలని ఆయుర్వేదం ప్రస్తావించింది. మొలకలు, తృణధాన్యాలు తింటే ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ముడిబియ్యం, గోధుమ శరీరానికి బలం కలిగించే పౌష్ఠికాహారం. శాకాహారం, సాత్వికాహారం ఆయుఃవర్థకం. నువ్వులపప్పులో లభించే కాల్షియం, అంతర్లీనంగా ఉండే తిలతైలం అమూల్యమైనవని గ్రహించాలి. శుష్కఫలాలు తక్కువ పరిమాణంలో తినటం ఉత్తమం. అరటిదూట, బూడిదగుమ్మడి, తియ్యగుమ్మడి శాకాలు మంచివి. తాజాఫలాలలో జామ, బొప్పాయి, దానిమ్మ, బత్తాయి శ్రేష్ఠం. తగినంత ద్రవాహారం సేవించాలి. ఆవుపాలు, ఆవుమజ్జిగ ఉత్తమం. పులుపు, కారం తగ్గించి, బయటి ఆహారానికి దూరంగా ఉండాలి.
 
 విహారం: ప్రతినిత్యం నియమితవేళల్లో వ్యాయామం చేయాలి. రాత్రిపూట కనీసం ఆరుగంటల నిద్ర (విశ్రాంతి) అవసరం. రెండుపూటలా ప్రాణాయామం, ధ్యానం చేస్తే మానసిక ఆరోగ్యం బాగా వృద్ధి చెంది ఒత్తిడి, ఆందోళన దరిచేరవు. మాదకద్రవ్యాల వంటి చెడు అలవాట్లను దూరంగా ఉంచాలి. ఆశావహ దృక్పథం, ఆత్మస్థైర్యం అలవరచుకోవాలి. ఉదయం పూట పదినిమిషాలు ఎండలో నిలబడండి.
 
 జరాచికిత్సలో ఉత్తమ రసాయనాలు: త్రిఫలాచూర్ణం : రోజూ రాత్రి ఒక చెంచా చూర్ణాన్ని నీళ్లతో సేవించాలి. ఇది మృదు విరేచనకారి. కంటికి, గుండెకు, ఊపిరితిత్తులకు క్రియాసామర్థ్యాన్ని పెంచుతుంది. సప్తధాతువులకు హితకారి, సర్వరోగ నివారకం.
 
 అశ్వగంధారిష్ట: నాలుగు చెంచాలు (నీళ్లతో) రెండుపూటలా; నరాల బలహీనత పోగొట్టి, మానసిక ఒత్తిడిని జయిస్తుంది. కీళ్లనొప్పులను దూరం చేస్తుంది. దీనితో బాటు ‘సారస్వతారిష్ట’ కూడా కలిపితే చక్కటి నిద్రాజనకంగా పనిచేస్తుంది.
 
 అగస్త్యహరీతకీ రసాయనం (లేహ్యం): ఒక్కొక్క చెంచా, రెండుపూటలా; ధాతుపుష్టికరమే కాకుండా, ప్రత్యేకించి ఊపిరితిత్తుల వ్యాధులకు దివ్యౌషధం.
 
 చంద్రప్రభావటి (మాత్రలు): ఉదయం - 2, రాత్రి - 2; మూత్రవహ సంస్థాన సంబంధిత రోగాలన్నింటినీ జయిస్తుంది.
 
  ‘బలాతైలం’తో శరీర మర్దన, కీళ్లకు మర్దన చేసుకుంటే శరీర సౌష్ఠవం పెరుగుతుంది.
 
 గమనిక:
ప్రస్తుతం విస్తరిస్తున్న అవ్యవస్థ జీవనశైలి; పప్పులు, నూనెలు, పండ్లు, పాలవంటి ఆహార పదార్థాలలో జరుగుతున్న కల్తీ, వాతావరణ కాలుష్యం అందరి ఆరోగ్యానికి విచ్ఛిన్నకారకమని గుర్తుంచుకుని తగు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంతావశ్యకం.
 
 నా వయసు 76. మలబద్దకానికి ‘త్రిఫల చూర్ణం’ వాడవచ్చా? దయచేసి తెలపండి.
 - అంజయ్య, మెదక్

 కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలను కలిసి ‘త్రిఫలాలు’ అంటారు. వాటిని ఎండబెట్టి, విడివిడిగా పొడిచేసి, సమానంగా కలుపుకుంటే చక్కటి ‘త్రిఫలచూర్ణం’ తయారవుతుంది. ప్రతిరోజూ రాత్రి ఒక చెంచాచూర్ణాన్ని నీటితో తాగండి. కేవలం మలబద్దకానికే కాదు... గుండెకు, కంటికి, చర్మానికి, మెదడుకు, మూత్రపిండాలకు... ఇలా అన్ని భాగాలకూ చక్కటి రసాయనంగా పనిచేసి, పుష్టినిస్తుంది. ఈ చూర్ణాన్ని ఎంతకాలమైనా వాడుకోవచ్చు.
 
 నా వయసు 30. నాకు హైడ్రోసిల్ ఉంది. డాక్టర్లు ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. ఆయుర్వేద మందులు వాడితే ఇది తగ్గిపోతుందా? తెలియజేయగలరు.
 ఆర్. జానకిరామ్, హైదరాబాద్

 ఇది పరిమాణంలో పెద్దగా అయిన పక్షంలో మందులు పనిచేయవు. సుశ్రుతాచార్యులు కూడా ఇలాంటి సందర్భాల్లో శస్త్రకర్మ (సర్జరీ)నే సూచించారు. అయితే నాటు వెద్యుల మాటలకు మోసపోవద్దు.
 
 డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
 అడిషనల్ డెరైక్టర్, ఆయుష్ (రిటైర్డ్),
 సౌభాగ్య ఆయుర్వేద క్లినిక్,
 హుమాయూన్ నగర్, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement