
సమతుల ఆహారంతో డిప్రెషన్ నుంచి బయటపడవచ్చని తాజా అథ్యయనం స్పష్టం చేసింది.
మెల్‌బోర్న్ : ఆరోగ్యకరమైన ఆహారంతో కేవలం నెలరోజుల వ్యవధిలోనే కుంగుబాటు నుంచి బయటపడవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. నిత్యం ప్రాసెస్డ్ ఆహారం, చక్కెర, కొవ్వులతో కూడిన ఆహారం తీసుకునే 76 మంది డిప్రెషన్‌కు గురైన యూనివర్సిటీ విద్యార్ధులపై పరిశోధకులు జరిపిన అథ్యయనంలో ఆరోగ్యకరమైన ఆహారంతో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయని వెల్లడైంది. కుంగుబాటుకు లోనైన వర్సిటీ విద్యార్ధులకు అధికంగా పండ్లు, కూరగాయలు, చేపలు వంటి ఆహారాన్ని అందించగా కేవలం మూడు వారాల్లోనే వారి ప్రవర్తనలో గణనీయమీన మెరుగుదల కనిపించినట్టు పరిశోధకులు గుర్తించారు. విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగిన ఆహారంతో మెదడు ఆరోగ్యం కుదుటపడి, శరీరంలో వాపు ప్రక్రియ తగ్గుముఖం పడుతుందని వారు పేర్కొన్నారు. ఆస్ర్టేలియాకు చెందిన మాక్వురి యూనివర్సిటీ చేపట్టిన ఈ పరిశోధనలో మంచి ఆహారంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడతుందని వెల్లడైంది. డిప్రెషన్‌కు చికిత్స అందించే విషయంలో తమ పరిశోధనల వివరాలు వినూత్న మార్పులకు దారితీస్తాయని అథ్యయన రచయిత డాక్టర్ హీథర్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు.