రకరకాల గుండెకోతలు!
గుండెకు వెళ్లే రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు చేరడంగాని లేదా రక్తం గడ్డకట్టడం వల్ల కాని రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడతాయి. ఆ రక్తప్రసరణలోని అడ్డంకులు ఒక గుండె కండరానికే సంభవిస్తే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్య తలెత్తినప్పుడు సాధారణంగా మందుల ద్వారానే దాన్ని నయం చేయవచ్చు. అయితే కొంతమందిలో మాత్రం ఆ అడ్డంకులను తీసేయడానికి బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది. దీనితోపాటు గుండెకు చేసే శస్త్రచికిత్సల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ, బీటింగ్ హార్ట్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ, మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ, ఎండోస్కోపిక్ సర్జరీ అంటూ రకరకాల పదాలు వినిపిస్తుంటాయి. ఈ రకరకాల సర్జరీలు ఏమిటి, వాటి ప్రయోజనాలేమిటి, ఎందుకు? ఎప్పుడు చేస్తారు... లాంటి సందేహాల నివృత్తికే ఈ కథనం.
గుండెకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డంకులను బెలూన్ ద్వారా తొలగించి అక్కడ ఒక ‘స్టెంట్’ అమర్చడాన్ని బెలూన్ యాంజియోప్లాస్టీ లేదా స్టెంట్ ఆపరేషన్ అంటారు. ఇది పూర్తిగా శస్త్రచికిత్సగా పరిగణించలేం. ఇక పూర్తిస్థాయి శస్త్రచికిత్సల విషయానికి వస్తే... ముందుగా అసలు బైపాస్ సర్జరీ అంటే ఏమిటో చూద్దాం. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే వాటికి ప్రత్యామ్నాయంగా వేరే రక్తనాళాలను ఉపయోగించి, కొత్తమార్గం ద్వారా రక్తప్రసరణ జరిగేలా చేయడమే బైపాస్ శస్త్రచికిత్స. ఈ ప్రక్రియకోసం అవసరమైన అదనపు రక్తనాళాన్ని కాలి నుంచి తీసిన సిరను గాని లేదా రొమ్ము ఎముక పక్కనే ఉన్న మ్యామరీ ధమనిని గాని ఉపయోగిస్తారు. గుండెకు సంబంధించిన సర్జరీలలో చాలాపేర్లు వినిపిస్తుంటాయి. అవి ఏయే సందర్భాల్లో, ఎందుకు చేస్తారో చూద్దాం.
బైపాస్ ఎవరెవరికి, ఎలాంటి ఫలితం...?
గుండెకు రక్తసరఫరా చేసే ప్రధాన రక్తనాళంలో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెలో ఎడమపక్క ఉండే ముఖ్య రక్తనాళంలోని మొదటిభాగంలోనే అడ్డంకి ఉన్నప్పుడు గుండె పంపింగ్ శక్తి తక్కువగా ఉన్నప్పుడు రక్తనాళంలో అనేకచోట్ల అడ్డంకులు ఏర్పడినప్పుడు మధుమేహవ్యాధి ఉన్న వారికి...
ఓపెన్‌హార్ట్ సర్జరీ అంటే...?
బైపాస్ శస్త్రచికిత్స సమయంలో రొమ్ముఎముకను చీల్చి సర్జన్ గుండె ఉపరితలానికి చేరుకుంటాడు. గుండె అనుక్షణం కొట్టుకుంటూ ఉంటే ఆపరేషన్ చేయడం క్లిష్టంగా ఉంటుంది. అందుకే తాత్కాలికంగా గుండెను అచేతన స్థితిలో ఉంచి ఈ ఆపరేషన్ చేస్తారు. అప్పుడు శరీరానికి రక్తప్రసరణ యథావిధిగా కొనసాగేందుకు హార్ట్‌లంగ్ మెషిన్ అనే పరికరాన్ని వాడతారు. ఏ శస్త్రచికిత్సలోనైతే ఈ హార్ట్‌లంగ్ మెషిన్‌ను ఉపయోగించి చేస్తే... దాన్ని ‘ఓపెన్‌హార్ట్ సర్జరీ’ అనుకోవచ్చు.
క్లోజ్‌డ్ హార్ట్ సర్జరీ అంటే...?
ఏ శస్త్రచికిత్సలోనైతే పైన పేర్కొన్న హార్ట్ లంగ్ మెషిన్‌ను ఉపయోగించకుండా శస్త్రచికిత్స చేస్తారో దాన్ని క్లోజ్‌డ్ హార్ట్ సర్జరీ అంటారు. సాధారణంగా గుండె కవాటాల్లో ఒకటైన మైట్రల్ వాల్వ్‌ను బాగుచేసేప్పుడు ఈ శస్త్రచికిత్స చేస్తారు.
బీటింగ్ హార్ట్ సర్జరీ అంటే...?
దీన్ని ‘ఆఫ్ పంప్ సర్జరీ’ అని కూడా అంటారు. ఇందులో కూడా రొమ్ము ఎముకను చీలుస్తారు. ఈ ప్రక్రియలో ఓ పక్క గుండె స్పందనలు యథావిధిగా కొనసాగుతుండగానే బైపాస్‌సర్జరీ నిర్వహిస్తారు. ఆక్టోపస్ అనే ఒక పరికరం ద్వారా గుండెలో ఆపరేషన్ జరుగుతున్న భాగం వరకు కదలకుండా చేస్తారు.
మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అంటే..?
గత ఐదేళ్లకాలంలో గుండె శస్త్రచికిత్సలో అత్యంత అధునాతన వైద్యవిధానాలు చోటుచేసుకున్నాయి. కేవలం చాలా చిన్నగాటు సహాయంతోనే బైపాస్ సర్జరీ నిర్వహించడం వీటిల్లో ఒకటి. ఇందులో రొమ్ము ఎముకను చీల్చాల్సిన అవసరం లేదు. అయితే పెద్ద శస్త్రచికిత్సల్లోలాగే మత్తుమందు ఇవ్వాల్సి ఉంటుంది. చాలా చిన్న రంధ్రం ద్వారా ఈ లాపరోస్కోపిక్ ఆపరేషన్ చేస్తారు.
టోటల్ ఆర్టీరియల్ రీవాస్క్యులరైజేషన్ అంటే
ఈ ప్రక్రియలో కాలి సిరలను గాక మణికట్టులోనివి, ఎడమ, కుడి రొమ్ము ఎముక ధమనులను ఉపయోగించి సర్జరీ చేస్తారు.
ఎండోస్కోపిక్ సర్జరీ అంటే...?
ప్రస్తుతం మణికట్టు నుంచి తీసే ధమని లేదా కాలి నుంచి తీసే సిరల విషయంలో పూర్తిగా గాటు పెట్టి తీయకుండా, చిన్న రంధ్రం చేసి మాత్రమే వాటిని సేకరిస్తారు. దీనివల్ల ఆ గాయం చిన్నది కావడం వల్ల రోగి త్వరగా కోలుకుంటాడు.
హైబ్రీడ్ సర్జరీ అంటే...?
కొన్నిసార్లు బైపాస్ శస్త్రచికిత్సలో రోగి చాలా సంక్లిష్టపరిస్థితిలో ఉన్నప్పుడు కొన్ని రక్తనాళాలకు యాంజియోప్లాస్టీ ద్వారా, మరికొన్నింటికి బైపాస్ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించడం వల్ల చాలా రిస్క్‌లు తగ్గి, రోగి చాలా త్వరగా కోలుకునేలా చేయవచ్చు. ఇలా పలురకాల శస్త్రచికిత్స ప్రక్రియలను చేయడాన్ని ‘హైబ్రీడ్ బైపాస్ సర్జరీ’ అంటారు.
రొబోటిక్ బైపాస్ సర్జరీ అంటే...?
పేరులో పేర్కొన్నట్లుగా ఇందులో బైపాస్ శస్త్రచికిత్సను రోబో సహాయంతో డాక్టర్లు నిర్వహిస్తారు. ఇందులో చాలా చిన్న రంధ్రం మాత్రమే చేసి, శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అంత చిన్న రంధ్రం నుంచి డాక్టర్ వేళ్లు రోగి శరీరంలోకి ప్రవేశింపజేయడం కష్టం. అందుకే రోబో తాలూకు సన్నని వేళ్లని ఆ రంధ్రంలోకి ప్రవేశింపజేసి, సర్జన్లు వాటిని బయటి నుంచి నియంత్రిస్తూ శస్త్రచికిత్స పూర్తి చేస్తారు.
- నిర్వహణ : యాసీన్
బైపాస్ సర్జరీ తర్వాత...
బైపాస్ శస్త్రచికిత్స తర్వాత రోగి కోలుకోడానికి 2-3 నెలలు పడుతుంది. మొదట్లో కొద్దిగా నీరసంగా ఉండటం సహజం. రొమ్ము ఎముకను చీల్చడం వల్ల ఛాతీకండరాల్లో, మెడ ఎముకల్లో, వెన్నుపూసల్లో, జబ్బల్లో నొప్పులు సాధారణం. అదే సమయంలో కాలు లేదా చేతి నుంచి రక్తనాళాన్ని బయటకు తీస్తారు కాబట్టి అక్కడా నొప్పి, వాపు ఉండవచ్చు. కొందరు ఈ ఆపరేషన్ తర్వాత మనోనిబ్బరం కోల్పోతారు. మరికొందరికి జ్ఞాపకశక్తి, దృష్టికేంద్రీకరణ శక్తి కొద్దిగా తగ్గవచ్చు. కానీ ఆర్నెల్లల్లో రోగి పూర్వస్థితికి చేరుకునే అవకాశం ఉంది. జీవనోపాధి కోసం వారు చేసే పనులు బరువైనవి కాకపోతే రెండు నెలల తర్వాతి నుంచే పనికి వెళ్లవచ్చు. మిగతావారు మూడు నెలలు ఆగడం శ్రేయస్కరం. ఇక ఈ ఆపరేషన్ తర్వాత రెండునెలల పాటు ఎలాంటి వాహనం నడపడం మంచిది కాదు. శస్త్రచికిత్స తర్వాత రోగి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొగతాగడం పూర్తిగా మానేయాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. బరువును నియంత్రించుకోవడం, కొవ్వును అదుపులో ఉంచుకోవడం, మనోనిబ్బరంతో వ్యవహరించడం, వైద్యుల సూచనలను పాటించడం వంటివి చేస్తూ మిగతా జీవితాన్ని మామూలుగానే గడిపేయవచ్చు.