‘జయం’ సినిమాలో నితిన్‌ని ‘వెళ్లవయ్యా వెళ్లూ...’ అంటూ ఆటపట్టించిన పరికిణీ పాప గుర్తుంది కదూ!?
ఆ ఒక్క సినిమాతో తారాపథానికి దూసుకుపోయారు నటి సదా. శంకర్ దర్శకత్వంలో ‘అపరిచితుడు’ చేసి, హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఆమె ఆ తర్వాత సడన్‌గా కెరీర్‌లో వెనకబడ్డారు. ఇటీవలే ‘యమలీల-2’లో గెస్ట్ సాంగ్ చేసిన సదా భవిష్యత్ ప్రణాళికలేంటి? కెరీర్ గురించి ఆమె విశ్లేషణేంటి?
కొంత విరామం తర్వాత ‘యమలీల 2’లో ఐటమ్ సాంగ్ ద్వారా కనిపించనున్నారు.. ఈ పాట ఎలా ఉంటుంది?
అది ఐటమ్ సాంగ్ కాదు. మామూలుగా ఏదైనా సినిమాలో ఒకే ఒక్క పాటకు డాన్స్ చేస్తే చాలు.. ఐటమ్ సాంగ్ అంటారు. ఈ సినిమాకి సంబంధించినంతవరకు ఈ పాటను అలా అనలేం. కథానుసారంగా వచ్చే పాట ఇది. నేను దేవకన్య గెటప్‌లో కనిపిస్తాను. నా కాస్ట్యూమ్స్, డాన్స్.. అన్నీ బాగుంటాయి.
కొన్ని కొన్నిసార్లు.. ఒక పాట, ఒక సీన్ కూడా బ్రేక్ తీసుకు రావచ్చంటారు.. మీరేమంటారు?
నేనో సినిమా ఒప్పుకున్న తర్వాత, నా పాత్రకు పూర్తి న్యాయం చేయగలనా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తాను. ఈ సినిమా మనకు మంచి బ్రేక్ అవుతుందా? లేదా లాంటివి ఆలోచించను.
‘జయం’తో కెరీర్ ఆరంభించి, ఆ తర్వాత బాగానే సినిమాలు చేశారు. హఠాత్తుగా అవకాశాలు తగ్గడానికి కారణం?
అది దర్శక, నిర్మాతలను అడగాలి. నా వరకు నేను చేసిన సినిమాలన్నిటికీ పూర్తి న్యాయం చేశాను. కాకపోతే, కొన్ని సినిమాలు ఆడకపోవడం దురదృష్టకరం. సినిమా పరిశ్రమలో నాకు ‘గాడ్‌ఫాదర్’ లేకపోవడంతో సినిమాల ఎంపిక విషయంలో కొన్ని తప్పులు చేశాను. అది మైనస్ అయ్యింది.
ఇలా జరిగినందుకు పశ్చాత్తాపపడుతున్నారా?
లేదు. ఎందుకంటే, ‘సదా డెరైక్టర్స్ ఆర్టిస్ట్’ అనిపించుకోగలిగాను. అది చాలు. తప్పులెవరైనా చేస్తారు. నా తప్పులు నాకు మైనస్ అయ్యాయే కానీ, ఎవరికీ కష్టం కలిగించలేదు. ఇంకో విషయం ఏంటంటే.. ఇప్పటివరకు నా కెరీర్‌లో నేనెవర్నీ ‘ఒక్క అవకాశం ఇవ్వండి’ అని అడగలేదు. వచ్చిన సినిమాలు చేశాను.
మీరు ఎవరితోనూ స్నేహంగా ఉండకపోవడం కూడా మైనస్ అయ్యిందనుకోవచ్చా?
వృత్తిపరమైన లాభం కోసం స్నేహం నటించలేను. ఎలాంటి పరిస్థితుల్లోనూ నా ఆత్మాభిమానం దెబ్బతినే పనులు చేయలేను. ఒకవేళ అవకాశాలు తగ్గడానికి ఇవే కారణం అయ్యుంటే, నేను బాధపడను. ఎందుకంటే, నా గౌరవాన్ని కాపాడుకోగలిగాననే తృప్తి మిగిలింది.
దర్శకుడు శంకర్ సినిమాలో నటించిన కథానాయిక కెరీర్ అంతే సంగతులని చాలామంది అంటారు...?
అలాంటి సెంటిమెంట్స్ నాకు లేవు. ‘జయం’తో తెలుగులో, ‘అపరిచితుడు’తో ఇటు దక్షిణాదితో పాటు అటు ఉత్తరాదిన కూడా మంచి గుర్తింపు తెచ్చుకోగలిగాను.
బిజీగా సినిమాలు చేసేసి ఇప్పుడు ఖాళీగా ఉండటం బోరనిపించట్లేదా?
ఆ దేవుడు నాకు కావాల్సినదాని కన్నా ఎక్కువే ఇచ్చాడు. అయినా సరే సంతృప్తి పడకపోతే, ఆయన క్షమించడు. నేనెప్పుడూ బిజీగా ఉండాలని, నెలకోసారి వెండితెరపై కనిపించాలనే ఆకాంక్ష లేదు.
ఈ మధ్య వస్తున్న ఓ టీవీ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు కదా.. అసలు బుల్లితెరకు పచ్చజెండా ఊపడానికి కారణం ఏంటి?
నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ నేపథ్యంలో సాగే కార్యక్రమం కాబట్టి, దానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించే చాన్స్ రావడంతో ఎగ్జయిటయ్యా. వెంటనే ఒప్పుకున్నాను.
బుల్లితెర ఎలాంటి అనుభూతినిస్తోంది?
నేను చేస్తున్నది పిల్లలకి సంబంధించిన షో. పిల్లలందరూ డాన్స్‌లో కనబరుస్తున్న ప్రతిభ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. షూటింగ్‌లో సమయం ఎలా గడిచిపోతోందో కూడా తెలియడంలేదు.
ఇంతకీ పెళ్లెప్పుడు చేసుకుంటారు? ప్రేమ పెళ్లి చేసుకుంటారా?
పెళ్ళెప్పుడో ఆలోచించలేదు. జీవితంలో మనకెంతోమంది తారసపడతారు. వాళ్లల్లో మనకు నచ్చినవాళ్లుంటారు. కానీ, జీవిత భాగస్వామిని చేసుకోలేం. అందుకే, బెటర్ హాఫ్‌ని ఎంపిక చేసుకునే విషయంలో ఆచితూచి అడుగు లేస్తా. ఇతణ్ణి పెళ్లాడితే మన మిగతా జీవితం ఇంతకన్నా బ్రహ్మాండంగా ఉంటుందని అనిపిస్తే చాలు... కచ్చితంగా ఆ వ్యక్తిని పెళ్లాడతా. ప్రేమ వివాహాన్ని మా వాళ్లు ఎప్పుడూ వ్యతిరేకించరు.
- డి.జి. భవాని
ఆ విషయంలో కొన్ని తప్పులు చేశా!
Published Sat, May 17 2014 10:31 PM | Last Updated on Sat, Mar 23 2019 9:28 PM
Advertisement
Advertisement