బహుముఖ సాంస్కృతిక భారతాన్ని..ఆచారాల భారతాన్ని.. సహజీవన భారతాన్ని.. ఆధ్యాత్మిక భారతాన్ని.. బహుజనుల భారతాన్ని మొదటిసారి దూర్‌దర్శన్‌లో చూపిన షో ‘సురభి’. సిద్ధార్థ్ కక్, రేణుకా సహాని యాంకర్లుగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.
♦ భారతీయ సంగీత దర్శకుడు, వయోలినిస్ట్ డా.ఎల్ సుబ్రమణ్యమ్ సురభికి సంగీతాన్ని అందించారు ∙ఈ కార్యక్రమాన్ని అమూల్ సంస్థ స్పాన్సర్ చేయడంతో ‘అమూల్ సురభి’ అని పేరు పడిపోయింది
♦ దీర్గకాలం ప్రసారమైన సాంస్కృతిక సీరీస్‌గా సురభి ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు చేసుకుంది.
ఇప్పుడంటే వంటకాలకో చానెల్, సంగీతానికో చానెల్, భక్తికి ఓ చానెల్, పర్యటనకు ఓ చానెల్.. ఇలా ప్రతీ అంశానికి సంబంధించిన చానెల్స్ విడివిడిగా ఉన్నాయి. కానీ, దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఇవన్నింటినీ ఓ ప్రోగ్రామ్ ద్వారా అందించింది దూరదర్శన్. భారతీయ సంస్కృతిని వెలుగులోకి తెచ్చి కొత్తగా దేశభక్తిని ఆవిష్కరించింది. ఈ నేలలో పాదుకున్న నీతి, సామాజిక విలువలను కళ్లకు కట్టింది. ఈ థీమ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇండియన్ టెలివిజన్ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన, అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమంగా ‘సురభి’ అలా ఇండియన్ టెలివిజన్ చరిత్రలో సగౌరవంగా నిలిచిపోయింది. ఎంచుకున్న అంశాలు విభిన్న స్వభావాలతో కూడినవి కావడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ‘సురభి’ అపార ఖ్యాతిని పొందింది.
ఎక్కువకాలం ప్రసారం
ప్రతి ఆదివారం బుల్లితెర స్క్రీన్‌పై యాంకర్లుగా సిద్ధార్ద్ కక్, రేణుకా సహానీలు చిరునవ్వులు చిందిస్తూ 30 నిమిషాల సేపు కార్యక్రమాన్ని నిర్వహించేవారు. కొత్త కొత్త వ్యక్తులను, ప్రదేశాలను, సంప్రదాయాలను, మనిషి సృష్టించిన అద్భుతాలను చూపేవారు. ఆ సమయంలో సీరియల్సన్నీ సాధారణ కుటుంబ సంబంధాల నేపధ్యంతో వచ్చేవి. సురభి ఒక్కటే వీటికి భిన్నంగా వచ్చింది. 1990లో మొదలైన సురభి 2001 వరకు దాదాపు 415 ఎపిసోడ్లతో అత్యంత ఎక్కువ కాలం ప్రసారమైన షో గా రికార్డులను సొంతం చేసుకుంది.
పోస్ట్.. పోస్ట్
‘సురభి’ షో విపరీతమైన ప్రేక్షకాదరణ పొందడం వెనుక మరో కృషి ఉంది. షో చివరలో తామడిగిన ప్రశ్నలకు సమాధానాలు పంపమని ప్రేక్షకులను కోరడంతో పోస్టుకార్డు వ్యవస్థ కొత్త ఊపిరి పోసుకుంది. ప్రతీవారం ప్రేక్షకులను క్విజ్ కాంటెస్ట్‌లో పాల్గొనెలా చేయడంతో ‘సురభి’ రేటింగ్ అమాంతం రాకెట్‌లా దూసుకుపోవడం ఆరంభించింది. ఆ సమయంలో మొబైల్ ఫోన్లు, ఇంటర్‌నెట్ సదుపాయాలు లేకపోవడంతో జనం 15 పైసల పోస్టుకార్డును ఇలాంటివాటికి ఉపయోగించేవారు. వారానికి దాదాపు పదిన్నర లక్షల పోస్టుకార్డులు ప్రేక్షకుల నుంచి దూరదర్శన్‌కి అందేవి. ఈ పోటీలో పాల్గొనడానికి ఒక్కో కార్డ్‌కు 2 రూపాయల ధరతో ‘కాంపిటిషన్ పోస్ట్‌కార్డ్స్’ను పోస్టల్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేకంగా జారీచేయాల్సి వచ్చింది. అలా ఇండియన్ టెలివిజన్ చరిత్రలో ప్రజల నుంచి అత్యధిక ఆదరణ పొందిన కార్యక్రమంగా లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుచేసుకుంది సురభి. 90ల కాలంలో ఒక బెంచ్ మార్క్ షోగా మారింది. ఈ షో తర్వాత కక్ ఫోర్డ్ ఫౌండేషన్ సహాయంతో సురభి ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి, సాంస్కృతిక కళాఖండాలను పరిరక్షించే ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.
చిరునవ్వుల సురభి
ఆమె చిరునవ్వు సురభికి ఒక నక్షత్రంలా అమరింది. అప్పటికే ఆమె 1989లో టెలివిజన్ సీరియల్ సర్కస్‌లో నటించింది. ఆ సీరియల్ మంచి ప్రజాదరణ పొందింది. అటు తర్వాత సురభితో ప్రజాదరణను సుస్థిరం చేసుకుంది. సురభి మొదలైన రెండేళ్లకు ఆమె ఎంట్రీ ఇచ్చింది. మొత్తం 350 ఎపిసోడ్లను తన ఖాతాలో జమ చేసుకుంది. ఆమె.. నటి, దర్శకురాలు రేణుకా సహానీ. సురభి గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సహానీ ‘మళ్లీ అలాంటి రోజులను, అలాంటి షోను తిలకించలేం. దేశ సంస్కృతి, చరిత్రకి అసలు సిసలు భాష్యం చెప్పింది నాటి దూరదర్శన్. గతాన్ని చూపుతూ భవిష్యత్తుకు బంగారంగా నిలిచింది’ అన్నారు.
నిర్మాత, వ్యాఖ్యాత
ఈ షో గురించి నిర్మాత, వ్యాఖ్యాత సిద్ధార్థ్ కక్ మాట్టాడుతూ ‘నాటి రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా మాట్లాడే స్వేచ్ఛ మాకు ఉండేది. దీని వల్లే విస్తృతంగా ప్రేక్షకులతో సంభాషించాం. భారతీయ సంస్కృతి సమగ్ర దృక్పథాన్ని సరైన సందర్భంలో ప్రదర్శించాం. ఈ ప్రయాణంలో మాకున్నది తక్కువ కమ్యూనికేషన్ కానీ ప్రజలతో కలిసి ఎక్కువ కాలం ప్రయాణించాం. ముందే ఎంచుకున్న ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ చిన్న చిన్న వివరాలు సైతం జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకుని చిత్రించేవాళ్ళం. చివరికి మా కష్టం ప్రేక్షకులకు అర్ధమైంది. దీంతో వారు మాకు సహకరించారు’ అని ఆనందంగా గతాన్ని గర్తు చేసుకుంటారు సిద్ధార్థ్.
ఒక్క చిరునవ్వు
సురభి ప్రయాణంతో రేణుకా సహానీ ‘హమ్ ఆప్ హై కౌన్, తున్ను కి టీనా.. వంటి సినిమాలోనూ నటించింది. 2009లో మరాఠీ చిత్రం ‘రీటా’కు దర్శకత్వం వహించింది. రేణుకా సహానీ సినిమాలలో నటించినా, సామాజిక, రాజకీయ సమస్యలపై బలమైన అభిప్రాయాలను వినిపించినా ఇప్పటికీ సిసలైన గుర్తింపు అంటే అది ‘సురభి’ వల్లే. రేణుకా సహానీ మాట్లాడుతూ ‘మొబైల్ ఫోన్లు, టెక్నాలజీ ఇప్పుడున్నంతగా అప్పుడు లేదు. ప్రజలు వినోదం, మంచి కథలు ఉన్న కార్యక్రమాలవైపు ఆసక్తిగా చూస్తున్నారు. మేం వాటికనుగుణంగా కంటెంట్‌లో సర్దుబాటు చేశారు. మొదట మా వ్యాఖ్యాన్యం చాలా సాధారణంగా ఉండేది. సురభి మొదలైన రెండేళ్లకు నేను వచ్చాను. కొన్ని ఎపిసోడ్స్ పూర్తయ్యాక సిద్దార్థ గారు, నేను షోను ప్లెజెంట్‌గా మార్చాలంటే ఏం చేయాలని ఆలోచించాం. అందుకు చిరునవ్వుతో యాంకరింగ్ చేయాలన్నారు. అలా మొదలైంది నా ప్రయాణం. ఒక్క చిరునవ్వు నా జీవితాన్నే మార్చేసింది. బాంబేలో పుట్టి పెరిగిన నేను విదేశాల్లో చదువుకున్నాను. ఈ షో ద్వారా నేను నా దేశం గొప్పతనాన్ని స్వీయ అన్వేషణతో తెలుసుకోగలిగాను. దేశమంతా తిరిగాను. నాగరికత ఆనవాళ్లు, తరాతరాల గొప్పతనం తెలుసుకున్నాను. ఈ ఉద్యమంలో నేనూ భాగమైనందకు గర్వంగా ఉంది’ అన్నారు .
వారపత్రిక
వారం వారం అనేక సాంస్కృతిక అంశాలతో అలంరించే సురభిని ఒక వీక్లీ మ్యాగజైన్‌తో పోల్చుతారు. భారతీయ సంస్కతిలో భాగమైన సంగీతం, నృత్యం, శిల్పం, ప్రజల జీవనవిధానం, వంటకాలు, చేతిపనులు.. ప్రతీ అంశాన్ని ఈ షోలో కవర్ చేశారు. అవన్నీ ఇప్పుడు ఎన్నో చానెల్స్ అనుసరిస్తున్నాయి. ఆ కాన్సెప్ట్ ఇప్పటికీ రకరకాల చానెల్స్‌లో నడుస్తూనే ఉంది. ఇన్ని కార్యక్రమాలకు ‘సురభి’ ఒక్కటే సమాధానమైంది. అంతేకాదు, సురభిని సాధ్యం చేసిన మరో విషయం ఏమిటంటే సామాన్య ప్రజల నుండి ఈ షోకు లభించిన భారీ మద్దతు. పట్టణ కేంద్రాలకే కాదు మారుమూల ప్రాంతాలకు ప్రయాణించింది సురభి. అక్కడి ప్రజలు సహాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. సంస్కృతి, చరిత్ర మనకు వారసత్వంగా వచ్చింది. వాటిని మనం మార్చలేం. ప్రజలే స్వయంగా వచ్చి సంస్కృతిని అందించడానికి సహాయపడ్డారు. కొన్నింటిని ప్రజలే నేరుగా వచ్చి మార్పులు చేయడానికి సహకరించారు. తమ ఆలోచనలను షో నిర్వాహకులతో పంచుకున్నారు.– ఎన్.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment