ముక్కులో కండ.. తగ్గుతుందా..? | Homeopathic counseling | Sakshi
Sakshi News home page

ముక్కులో కండ.. తగ్గుతుందా..?

Published Mon, Sep 19 2016 12:43 AM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

Homeopathic counseling

హోమియో కౌన్సెలింగ్
నా వయసు 28 సంవత్సరాలు. నాకు గత కొంతకాలంగా ముక్కులో కండమాదిరి పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుండడంతో డాక్టర్‌ని సంప్రదించాను. వారు వాటిని నాజల్ పాలిప్స్‌గా నిర్ధారించి, కొన్ని మందులు రాసిచ్చారు. అవి వాడుతున్నాను కానీ పూర్తి ఉపశమనం లభించడం లేదు. . హోమియో చికిత్స ద్వారా నా సమస్యకు శాశ్వత పరిష్కారం ఉంటే చెప్పగలరు.
- నాగేంద్రకుమార్, కడప
 
నాజల్ పాలిప్స్ అనేది దీర్ఘకాలికంగా వేధించే శ్వాసకోశ సమస్య. చల్లని వాతావరణం ఏర్పడితే ఈ వ్యాధితో బాధపడేవారు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించినా మళ్లీ తిరగబెట్టొచ్చు. మీరు ఆందోళన చెందకండి. హోమియో చికిత్స ద్వారా మీ సమస్య పూర్తిగా నయం అవుతుంది.
 
ముక్కు, సైనస్‌లలో ఏర్పడే మృదువైన కండ కలిగిన వాపును నాజల్ పాలిప్స్ అంటారు. ఇది ముక్కు రెండు రంధ్రాలలోనూ, సైనస్‌లలోనూ ఏర్పడతాయి. ఏ వయస్సు వారైనా ఈ సమస్యకు గురయ్యే అవకాశం ఉంది. కానీ యుక్త, మధ్యవయస్సు కలిగిన వారిలో, స్త్రీలలో కంటే 2-4 రెట్లు పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది.
 
సాధారణంగా ముక్కు లోపలిభాగం, సైనస్‌లు ఒకవిధమైన మృదువైన శ్లేష్మపు పొరతో కప్పి ఉంటాయి. ఈ పొర ఒకవిధమైన పల్చటి ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఈ ద్రవం ముక్కునూ, సైనస్‌లనూ తేమగా ఉంచుతూ ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశించిన దుమ్మూధూళీ ఇతర సూక్ష్మజీవులను చిన్న వెంట్రుకల లాంటి వాటి సాయంతో గొంతులోకి, ముక్కులోకీ చేర్చి తద్వారా బయటకు పంపేస్తుంటుంది. ఈ శ్లేష్మపు పొర దీర్ఘకాలికంగా శోధకు గురయితే అది వాచి గురుత్వాకర్షణ వలన కిందకు వేలాడటం మూలాన పాలిప్స్ ఏర్పడతాయి. ఇవి ముక్కు రంధ్రాలకు అడ్డుగా నిలుస్తాయి. తద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి.
 
కారణాలు: ఈ సమస్యకి కచ్చితమైన కారణాలు తెలియరాలేదు కానీ తర చు ఇన్ఫెక్షన్‌కు గురికావడం, ఆస్తమా, దీర్ఘకాలికంగా సైనసైటిస్‌కు గురికావడం, అలర్జిక్ రైనైటిస్, ఆస్ప్రిన్ లాంటి మందులకు సున్నితత్వం కలిగి ఉండటం, వంశపారంపర్యత వంటి అంశాలు మాత్రం ఈ వ్యాధిని ప్రేరేపిస్తాయని చెప్పొచ్చు.
 
లక్షణాలు: ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం తద్వారా నోటిద్వారా శ్వాస తీసుకోవడం జరుగుతుంది. ఈ సమస్య వల్ల రాత్రిళ్లు నిద్రలో కొంత సమయం ఊపిరి ఆడకపోవడం వల్ల నిద్రసరిగా పట్టకపోవడం, గురక, వాసన, రుచిని గ్రహించే శక్తి మందగించటం, తలనొప్పి, ముఖం లేదా నుదురు భాగంలో నొప్పిగా ఉండటం, కళ్లలో దురద వంటివి.
 
చికిత్స: హోమియోలో అందించే అధునాతనమైన జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ సిమిలిమం ద్వారా అసమతుల్యతకు గురయిన రోగనిరోధక శక్తిని సరిచేస్తారు. తద్వారా నాజల్ పాలిప్స్ సమస్య పూర్తిగా న యం అవుతుంది.
- డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్, సీఎండ్‌డి, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement