హోమియో కౌన్సెలింగ్
నా వయసు 42 ఏళ్లు. నేను గత కొంతకాలంగా గర్భాశయంలోని ఫైబ్రాయిడ్స్ సమస్యతో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే వీటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సిందిగా సూచించారు. శస్త్రచికిత్సానంతరం కూడా భవిష్యత్తులో ఇవి మళ్లీ ఏర్పడే అవకాశం ఉందని వైద్యుడు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. హోమియో చికిత్స ద్వారా ఈ సమస్య మళ్లీ తిరగబెట్టకుండా పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందా? - సునీత, విజయవాడ
గర్భాశయంలో ఏర్పడే కణుతులను యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. దాదాపు 20 - 50 శాతం వరకు ఇవి పిల్లలను కనే వయసులో వస్తుంటాయి. అంటే ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల వయసులో ఏర్పడుతుంటాయి. వీటి బారిన పడిన కొంతమంది స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. చాలావరకు ఇవి గర్భాశయాన్ని తొలగించాక వస్తుంటాయి. సాధారణంగా ఈ కణుతులు గర్భాశయపు కండర కణజాలంతో ఏర్పడతాయి. ఇవి గర్భాశయంలో ఒకటిగా లేదా చిన్న చిన్న నీటితిత్తులుగా కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. వీటి ఎదుగుదల కొందరిలో వేగంగానూ, మరికొందరిలో నిదానంగా ఉంటుంది. ఇంకొందరిలో నిదానంగా, నిలకడగా, స్వల్ప పరిమాణంలో ఉంటూ ఎలాంటి లక్షణాలనూ కనబరచకపోవచ్చు. గర్భాశయంలో వీటిని ఉనికి, పరిమాణరీత్యా ఈ యుటెరైన్ ఫైబ్రాయిడ్స్‌ను మూడు రకాలుగా విభజించవచ్చు.
1) సబ్ సీరోజల్ ఫైబ్రాయిడ్స్
2) ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్
3) మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్.
కారణాలు : ఈ ఫైబ్రాయిడ్స్ ఏ కారణం చేత ఏర్పడతాయనే విషయం పట్ల ఇంతవరకు స్పష్టత లేదు. కానీ కొన్ని హార్మోన్లు... ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ హార్మోన్ల ప్రభావం వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువ. రుతుచక్ర సమయంలో, గర్భధారణ సమయంలో ఇవి ఎక్కువగా ఏర్పడతాయి. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో ఈ హార్మోన్ల ఉత్పాదన చాలావరకు తగ్గడంతో పాటు ఫైబ్రాయిడ్స్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థూలకాయం, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల కూడా గర్భాశయ కణుతులు ఏర్పడతాయి.
లక్షణాలు : గర్భాశయ కణుతులు ఏర్పడ్డ ప్రదేశం, పరిణామం, సంఖ్యను బట్టి అవి ఏర్పడతాయి. అధిక రుతుస్రావం, రెండు రుతుచక్రాల మధ్య వ్యవధి ఎక్కువ రోజులు కొనసాగడం, పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడినట్లే తరచూ మూత్రానికి వెళ్లాలని అనిపిస్తూ ఉండటం, పేగులపై ఒత్తిడి పడితే మలబద్ధకం, కడుపుబ్బరం వంటి లక్షణాలను గమనించవచ్చు.
చికిత్స: జెనెటిక్ కన్‌స్టిట్యూషన్ పద్ధతి ద్వారా హోమియో విధానంలో యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఈ చికిత్స ద్వారా గర్భాశయపు కణుతులను పూర్తిగా తొలగించడమే గాకుండా, శరీరంలోని హార్మోన్లను అసమతౌల్యతను సరిచేయడం వల్ల సమస్యను తేలిగ్గా పరిష్కరించవచ్చు. మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్
హైదరాబాద్
అదేపనిగా పెయిన్‌కిలర్స్ వాడవద్దు...
ఆర్థో కౌన్సెలింగ్
నా వయసు 32 ఏళ్లు. ఒక పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాను. రోజూ స్కూటర్ మీద ఆఫీసుకు వెళ్తాను. గత కొంతకాలంగా నేను కీళ్ల సమస్యతో బాధపడుతున్నాను. పెయిన్‌కిల్లర్ ట్యాబ్లెట్లు వాడుతున్నంతసేపు పరిస్థితి బాగానే ఉంటుంది. అయితే ఇలాంటి మందులు ఎక్కువ రోజులు వాడితే కిడ్నీ, లివర్‌కు మంచిది కాదని స్నేహితులు, కుటుంబ సభ్యులు హెచ్చరిస్తున్నారు. స్కూటర్ స్టార్ట్ చేసేప్పుడు, స్టాండ్ వేసే సమయంలో నాకు నొప్పులు విపరీతంగా వస్తున్నాయి. అప్పుడప్పుడు జ్వరం కూడా వస్తోంది. దయచేసి నా బాధలకు శాశ్వత ఉపశమనం కలిగించే మార్గాన్ని సూచించండి. - నాగరాజు, హైదరాబాద్
మీరు ఎదుర్కొంటున్న సమస్యను వైద్యపరిభాషలో ‘ఆర్థరైటిస్’ అంటారు. గతంలో పెరిగే వయసు రీత్యా ఈ సమస్యలు వచ్చేవి. కానీ ఇటీవల 20 - 50 ఏళ్ల వయసు వారిలో సగానికిపైగా ఆర్థరైటిస్‌కు లోనవుతుండటం ఆందోళన చెందాల్సిన విషయం. ఇక మీ విషయానికి వస్తే... మీరు కూడా ఆర్థరైటిస్ సమస్యతోనే బాధపడుతున్నారని చెప్పాలి. ఎముకల మధ్య కుషన్‌లా కార్టిలేజ్ అనే పొర ఉంటుంది. ఇది అరిగిపోయినా, పూర్తిగా దెబ్బతిన్నా ఎముకలు ఒకదానితో ఒకటి ఒరుసుకున్నా, వాపు వచ్చినా ఈ కీళ్లనొప్పులు ఏర్పడతాయి. ఇందులో చాలా రకాలు ఉంటాయి. మీరు చెబుతున్న వివరాలను బట్టి మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమస్య ఉన్నవారికి మోకాళ్లు, మోచేతులు, కాలి వేళ్లు, మణికట్టు. భుజాలు, నడుము, వెన్నెముక భాగాల వాపుతో నొప్పి వస్తుంటుంది. కొన్నిసార్లు ఈ వ్యాధితో బాధపడుతున్నవారికి జ్వరం రావడం, కదల్లేకపోవడం లాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు.
ఇలాంటి ముఖ్య లక్షణాలు ఆధారంగా కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను గుర్తించవచ్చు. ముందుగా మీరు పెయిన్‌కిల్లర్స్ వాడటం మానేయండి. అవి కిడ్నీ లాంటి అవయవాలకు చేటు చేస్తాయి. మీరు వెంటనే ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి. ఆయన మీ వ్యాధికి సంబంధించి ఈఎస్‌ఆర్, ఆర్‌ఏ ఫ్యాక్టర్, సీరమ్ యూరిక్ యాసిడ్, వీడీఆర్‌ఎల్, సీబీసీ, ఎక్స్‌రే (ఆయా కీళ్లకు సంబంధించినవి)లాంటి కొన్ని నిర్ధారణ పరీక్షలు చేయించుకొమ్మని సలహా ఇస్తారు. పరీక్ష ఫలితాలను బట్టి మీకు చికిత్సా విధానాన్ని అవలంబిస్తారు. కొన్ని సమస్యలు మందులతో పాటు ఫిజియోథెరపీ లాంటి వాటితో తగ్గిపోతాయి. కానీ కొన్నింటికి మాత్రం సర్జరీ తప్పనిసరి అవుతుంది. అత్యాధునిక వైద్య సదుపాయాలు, శస్త్రచికిత్స విధానాల ద్వారా మీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎలాంటి భయాందోళనలకూ గురికానవసరం లేదు. ఈలోగా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించండి. అవి... వంటలలో ఉప్పు, నూనె బాగా తగ్గించాలి అధిక బరువు లేకుండా చూసుకోండి. వ్యాయామం, యోగా లాంటివి చేయాలి క్యాల్షియం ఉన్న ఆహార పదార్థాలు, తాజా కూరగాయలను తీసుకోండి పాలు, గుడ్లు, పెరుగు వంటివి అధికంగా తినాలి పాదరక్షలు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి మంచినీరు బాగా తాగాలి డయాబెటిస్ ఉంటే అదుపులో ఉంచుకోవాలి. ఒకవేళ బాధ మరీ ఎక్కువగా అనిపిస్తే ఫిజియోథెరపీతో కూడా ఉపశమనం పొందవచ్చు. అంతేగాని డాక్టర్ సలహా లేకుండా మాత్రం విచ్చలవిడిగా పెయిన్‌కిల్లర్స్ వాడటం చాలా ప్రమాదం.
డాక్టర్ కీర్తి తలారీ బొమ్మకంటి
సీనియర్ రుమటాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్