వారి రుణం తీర్చుకుంటున్నాను!
మొదట్నుంచీ నేను కాస్త బలమైన భావాలను కలిగివుండేదాన్ని. దాంతో జీవితంలోనూ పోరాడాల్సి వచ్చేది. నాన్న నన్ను డిగ్రీతో చదువు ఆపేయమన్నారు. కానీ నేను పీజీ చేసే వరకూ పట్టు వదల్లేదు. తిండి మానేసి మరీ అనుకున్నది సాధించుకున్నాను. ఎందుకంటే, ఆడపిల్లకు కూడా ఉన్నత చదువు అవసరం అని నాకు తెలుసు కాబట్టి. చదువు పూర్తవ్వగానే పెళ్లి చేసేస్తామన్నారు. కానీ ఓ రెండేళ్లు ఉద్యోగం చేసి, కాస్త సంపాదించి వెనకేసుకున్నాక చేసుకుంటానని అన్నాను. పెళ్లి ఖర్చులకు అమ్మానాన్నలను ఇబ్బంది పెట్టకూడదని నా ఉద్దేశం. అప్పుడూ నాన్న తప్పనిసరై ఒప్పుకున్నారు. తర్వాత పెళ్లి విషయంలోనూ నా అభిప్రాయం కచ్చితంగా చెప్పాను... కట్నం తీసుకునేవాడయితే చేసుకోను అని! అది నాన్నకు చాలా కోపం తెప్పించింది. చదవొద్దంటే చదివావు, ఇప్పుడు నీకంటే మంచి స్థాయిలో ఉన్నవాణ్ని తీసుకురావాలి, వాడేమైనా చీప్‌గా వచ్చేస్తాడా అంటూ తిట్టారు. నేను మంచి స్థాయిలో ఉన్నప్పుడు, బాగా సంపాదిస్తున్నప్పుడు తనకే ఉపయోగం కదా, చివరికి నా పంతమే నెగ్గించుకున్నాను. కట్నం తీసుకోను అని చెప్పిన వ్యక్తినే పెళ్లాడాను.
జీవితం ఆనందంగా సాగిపోసాగింది. ఒకే నగరంలో ఉండటంతో అమ్మానాన్నలు అప్పుడప్పుడూ వచ్చి చూసి పోతుండేవారు. వచ్చినప్పుడల్లా మా వారికి ఏదో ఒక కానుక తెచ్చి ఇస్తూ ఉండేవారు. ఆయన వద్దు అనకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించేది. ఎందుకలా ఖర్చు పెడుతున్నారు అని కోప్పడితే... పోనీలేమ్మా, మీకంటే మాకెవరున్నారు అనేవారు నాన్న. కానీ ఇల్లు నా పేరున రాస్తున్నాన ని నాన్న చెప్పినప్పుడు మాత్రం అనుమానం వచ్చింది నాకు. వద్దని అన్నాను. అమ్మ నన్ను ఒప్పించే ప్రయత్నం చేసింది. నేను ససేమిరా అన్నాను. కానీ మా వారు మాత్రం... ప్రేమతో ఇచ్చినప్పుడు తీసుకోవచ్చుగా అనగానే నా అనుమానం మరింత బలపడింది. నాన్న లేనప్పుడు అమ్మని నిలదీస్తే అసలు నిజం తెలిసి వచ్చింది.
మావారు కట్నం తీసుకునే నన్ను పెళ్లి చేసుకున్నారట. నాకు తెలిస్తే ఒప్పుకోనని అందరూ కలిసి నా దగ్గర నిజం దాచారట. పెళ్లయ్యాక కూడా ఆయన ఫోన్ చేసి అవీ ఇవీ అడిగేవారట. అందుకే వచ్చినప్పుడల్లా వాటిని తీసుకొచ్చి, తమ ఇష్టప్రకారం ఇస్తున్నట్టుగా నాకు చెప్పసాగారు. చివరికి ఇల్లు నా పేరు మీద రాసివ్వమని అడిగింది కూడా ఆయనేనట. కడుపు మండిపోయింది. నెలకు డెబ్భై వేలు సంపాదిస్తున్నాను. ఒక్క రూపాయి సొంతగా ఖర్చు పెట్టుకోను. జీతం తీసుకెళ్లి ఆయన చేతిలోనే పెట్టేస్తాను. అమ్మానాన్నలకు పదివేలు పంపమని మాత్రం చెబుతాను. అంతే. ఆయన బాగానే సంపాదిస్తున్నారు. ఒకరి సంపాదన ఖర్చులకు సరిపోతుంది. మరొకరిది దాచుకోవచ్చు. అలాంటప్పుడు ఆ ముసలోళ్లని పీక్కు తినడం ఎందుకు? అదే అడిగాను. అప్పుడే మావారి అసలు స్వరూపం బయటపడింది. ఏవేవో అని అవమానించారు. తట్టుకోలేకపోయాను. ఇంకా బాధపెట్టిన విషయమేమిటంటే... నేను చెప్పినట్టు ఆయన ఒక్క నెల కూడా అమ్మానాన్నలకు డబ్బు పంపలేదు. అది తెలిశాక ఇక ఆయనతో కలిసి ఉండలేనని చెప్పాను. పోతే పో, నీ అవసరం నాకు లేదన్నట్టు మాట్లాడారు. దాంతో అమ్మానాన్నల దగ్గరకు వచ్చేశాను.
నా నిర్ణయం నాన్నకి నచ్చలేదు. ఇలా చేస్తాననే అన్నీ దాచిపెట్టానన్నారు. తిరిగి నా భర్త దగ్గరకు వెళ్లమన్నారు. కానీ నేను అలా చేయలేకపోయాను. ఎందుకంటే... నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తి కోసం, అదీ అంత స్వార్థపరుడి కోసం నా తల్లిదండ్రుల్ని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. ఆ విషయం చెబితే.. వాళ్లమీద నాకున్న ప్రేమను చూసి నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారు. నాకు నచ్చినట్టే చేయమన్నారు. ఇప్పుడు నేను వాళ్లతోనే ఉంటున్నాను. ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నాను. తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటున్నాను.
- హరిత, పుణె