ఆగస్టు 12 ప్రపంచ ఏనుగుల రోజు
మనుషులకు మాలిమి అయిన జంతువుల్లో ఏనుగులు ప్రత్యేకమైనవి. రాచరికాలు వర్ధిల్లిన కాలంలో రాజ్య రక్షణ కోసం ఉపయోగపడే చతురంగ బలాల్లో గజబలం కీలకమైనది. భావోద్వేగాలను అనుభూతి చెందడంలోను, వాటిని ప్రకటించడంలోను ఏనుగుల ప్రవర్తన దాదాపుగా మనుషులను పోలి ఉంటుంది. సాటి ఏనుగుల పట్లనే కాదు, తమను మాలిమి చేసుకునే మనుషుల పట్ల కూడా ఏనుగులు భావోద్వేగాలను వ్యక్తం చేస్తాయి.
ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తుంటాయి. తమకు నేస్తాలుగా ఉన్న ఏనుగులను చూసినప్పుడు సంతోషంగా చెవులు విప్పార్చడం, తోక ఊపడం, శరీరాన్ని కదిలించడం వంటి చర్యల ద్వారా పలకరిస్తాయి. చాలాకాలం తర్వాత కనిపించినట్లయితే, పట్టరాని సంతోషంతో ఘీంకారనాదం చేస్తాయి.
నేస్తాలైన ఏనుగులు ఎదురెదురుగా తారసపడినప్పుడు ఒకదానికొకటి తొండాలను పెనవేసుకుని తమ ఆత్మీయతను వ్యక్తం చేస్తాయి. వేర్వేరు దారుల్లో వెళుతున్న మగ ఏనుగులు తమ నేస్తాలను శరీరాన్ని తాకించుకుని పలకరించుకుంటాయి.
ఏనుగులు ఒకదానితో మరొకటి సంభాషించుకుంటాయి. ఆకలి వేసినప్పుడు గున్న ఏనుగులు తమ చేష్టల ద్వారా తల్లులకు ఆ సంగతి చెబుతాయి. అల్లరిని వారించినప్పుడు అలుగుతాయి. గున్నటేనుగులు అలిగినప్పుడు ఎక్కడివక్కడే ఆగిపోయి, ఘీంకారంతో పిలిచే తల్లుల వెంట వెంటనే వెళ్లకుండా హఠం చేస్తాయి. తల్లి ఏనుగు మెల్లగా బుజ్జగిస్తేనే అవి మళ్లీ దారిలోకి వస్తాయి.
ఈడొచ్చిన మగ ఏనుగులు తాము జతకట్టదలచుకున్న ఆడ ఏనుగులను ఆకర్షించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాయి. వాటితో సల్లాపాలడతాయి. ఏనుగులు జత కట్టిన తర్వాత కుటుంబాన్ని ఏర్పరచుకుంటాయి. కుటుంబాన్ని కాపాడుకునేందుకు గుంపుగా సంచరిస్తుంటాయి.
వివిధ సందర్భాల్లో ఏనుగులు వ్యక్తం చేసే భావోద్వేగాలకు సంబంధించిన ప్రవర్తనలను తెలుసుకోవడానికి వియన్నా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల ప్రత్యేక అధ్యయనం చేపట్టారు. ఆఫ్రికా అడవుల్లో చేపట్టిన ఈ అధ్యయనంలో వారు ఏనుగుల భావోద్వేగ ప్రకటనలకు సంబంధించి 1,282 రకాల ప్రవర్తనలను గుర్తించారు.ఏనుగులు కూడా మనుషుల మాదిరిగానే ఆత్మీయులను కోల్పోయినప్పుడు దుఃఖిస్తాయి. ఏనుగులు తమ ఆత్మీయులను ఒక పట్టాన మరచిపోలేవు. మరణించిన ఏనుగు కళేబరం చుట్టూ చేరి మిగిలిన ఏనుగులు కన్నీరు కారుస్తూ రోదిస్తాయి. కళేబరాన్ని క్రూరజంతువులు పీక్కు తినకుండా కాపలాగా ఉంటాయి. చుట్టూ మట్టి ఉన్నట్లయితే, మరణించిన ఏనుగు కళేబరాన్ని మిగిలిన ఏనుగులు పూడ్చి పెడతాయని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు చెప్పుకొనే కథలు వాస్తవమేనని పుణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment