తెలుసు..కానీ ఏమీ తెలియదు!
సర్వే
‘సమాచార యుగంలో ఉన్నాం’ అని గొప్పగా చెప్పుకుంటాంగానీ, కొన్ని విషయాల్లో మన జ్ఞానం అంతంతమాత్రమేనని ఇటీవల ఒక సర్వే నిరూపించింది.
‘‘గొప్ప అన్వేషకుడిగా కొలంబస్‌కు ఎందుకు పేరు?’’ అని అడిగితే బ్రిటన్‌లో 70 శాతం మంది తెల్లముఖం వేశారు.
కొందరు ‘‘అతడి గురించి తెలుసు’’ అన్నా వివరాలు మాత్రం చెప్పలేకపోయారు. కొలంబస్ విజయాల గురించి తప్పుగా చెప్పారు.
‘‘కొలంబస్ ఏ దేశస్థుడు?’’ అని అడిగితే-
‘‘ఏ దేశమో ఏమిటి? మనవాడే కదా’’ అన్నారు కొందరు ఆయన ఇటలీయుడనే విషయాన్ని మరచి!
ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి ‘మార్క్‌టై్వన్ సృష్టించిన గొప్ప పాత్ర’ అన్నారు.
బ్రిటన్‌కు చెందిన ఒక ట్రావెల్ కంపెనీ ఈ సర్వేను నిర్వహించింది.
‘‘ప్రపంచ ప్రసిద్ధ ప్రయాణాలు మన జీవితాలపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. అయితే... ఎవరు, ఎప్పుడు, ఎక్కడికి వెళ్లారు? అనేది మాత్రం అందరూ చెప్పలేకపోవచ్చు’’ అంటున్నారు ట్రావెల్ కంపెనీ వాళ్లు.
‘‘గుర్తుంటేనేం లేకుంటేనేం... ఆ అన్వేషకుల కృషి మనల్ని ఎంతో ప్రభావితం చేసింది. వాళ్లు మనకంటూ ఒక మార్గం ఏర్పరిచారు. ఆ అన్వేషణ స్ఫూర్తి ఎప్పటికీ సజీవంగా ఉంటుంది’’ అన్నాడు ఒక ప్రయాణ ప్రేమికుడు.
అది సరేగానీ, బిబిసిలో ఏ ఎడ్వెంచర్ ప్రోగ్రాం గురించి అడిగినా ఠకీమని చెప్పే బ్రిటన్ ప్రజలు కొలంబస్ గురించి ఇన్ని రకాలుగా చెప్పడం ఏమిటి అనేది ఒక వింత!