ఘుమఘుమల గూగులవ్వ | in this old women going to bbc news | Sakshi
Sakshi News home page

ఘుమఘుమల గూగులవ్వ

Published Tue, May 9 2017 11:00 PM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

ఘుమఘుమల గూగులవ్వ

ఘుమఘుమల గూగులవ్వ

స్టార్‌ కుక్‌

ఇది కృష్ణా జిల్లా గుడివాడ కాదు. గుంటూరు జిల్లా గుడివాడ. ఆంధ్రాప్యారిస్‌ తెనాలికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. పాడిపంటలతో ప్రకృతిలో ఒదిగినట్టుండే ఆ ఊరు ఇప్పుడో 106 ఏళ్ల అవ్వ కారణంగా ప్రపంచానికంతా పరిచయమైంది. తన ఊరి వంటలతో, దేశీ ప్రావీణ్యంతో ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తోందీ అవ్వ. ‘కంట్రీఫుడ్స్‌‘ఛానల్‌లో ఆమె వంటకాలను మిలియన్లమంది వీక్షిస్తున్నారు. ఆమె కథను బీబీసీ కూడా ప్రసారం చేయనుంది. ఆ అవ్వ–మస్తానమ్మ పరిచయం ఇది.

‘నా మనవడు హైదరాబాదులో పెద్ద సదువు సదూకున్నాడు... పొటోలు, సినిమాలు తీస్తాడు... గూగుల్‌ అంట అదేంటో... దాంట్లో పెడితే పెపంచకమంతా చూసేత్తదంట. నాచేత వంటలూ అయీ చేయిస్తన్నడు. సినిమాల్లాగా తీసి గూగూల్లో పెట్టేత్తన్నడు. నా వంట పెపంచకమంతా పాకిందంట... ఎవరెవరో వత్తన్నారు... నన్ను పొటోలు తీత్తన్నారు. అందరూ నన్ను బతికిత్తారు అనుకుంటున్నా’... తన చేతివంటలతో ఆన్‌లైన్‌ పాకశాస్త్ర ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తున్న అవ్వ కర్రె మస్తానమ్మ మాటలివి. ఆమె చేతివంటల ఘుమఘుమలు యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రతి వంటను లక్షలాది వీక్షకులు తిలకిస్తూ, వహ్వా అంటున్నారు. అవ్వకు జేజేలు పలుకుతున్నారు. ఇటీవల ఆమె పుట్టినరోజుకు దేశవిదేశాల వీక్షకులు బహుమతులను పంపి శుభాకాంక్షలనూ తెలియజేశారు.

ఆమెను పలకరిస్తే...
‘నాకు నూట ఆరేళ్లు. పోయిన్నెల్లోనే పుట్టిన్రోజు చేశాడు నా మనవడు. చుట్టుపక్కల పిల్లల్ని పోగేసి, పండగలాగ చేశారంతా. నా వంటలకు మెచ్చుకుని ఎవరెవరో పంపారంటూ చీరలు, డబ్బులు ఇచ్చాడు. నాకు శానా నవ్వొచ్చింది. నా వంటలు నన్ను బతికిత్తాయని భరోసా వచ్చింది. చిన్నప్పుడు కూరా నారా చేయటం తెలుసుకున్నందుకు, ఇన్నాళ్లూ నేను, నావాళ్లూ తిన్నాం అనుకుంటే, ఇప్పుడు ఎక్కడెక్కడి దేశాలోళ్లకో పనికొత్తందంట. అంతా చెబుతుంటే చిత్రంగా అనిపిత్తంది. ఏదోలో నాలుగు డబ్బులొత్తే నాకు అక్కరకొచ్చినట్టే గదా అనుకుంటుంటా...’అన్నారావిడ.

‘‘అసలు మా పుట్టింటోళ్ల ఊరు కోపల్లె. తెనాలికి నాలుగైదు మైళ్లు ఉంటుంది. తోడబుట్టినోళ్లంతా అబ్బాయిలే. ఆడపిల్ల పుడితే బాగుంటుందని అమ్మాఅయ్య ఆరోజుల్లో అనుకున్నారంట. అందుకని దేవుడికి మొక్కున్నారంట. చివరికి నేను పుట్టాను. మస్తానమ్మ అని పెట్టారు. బాగా గారాబంగా సాకారు నన్ను. ఇంటిపనులు, బువ్వ వండటం, కూరలు చేయటం అమ్మ నుంచే తెలుసుకున్నా. అప్పుడు నాకు పదకొండేళ్లు ఉంటాయోమే... మా ఊరుపక్కనే గుడివాడ అని ఉంది. అక్కడో సంబందం చూసి పెళ్లి చేశారు. నాగభూషణం  మా పెనిమిటి. కట్నంగా పదకొండు రూపాయలిచ్చారు ఆ కాలంలో.

అప్పట్లో రింగులు జట్టుతో సక్కంగా ఉండేదాన్ని... వంద కిలోల బస్తా కోపల్లెలో ఎత్తుకుంటే గుడివాడలో పడేసేదాన్ని. మద్రాస్‌ (బకింగ్‌హామ్‌) కాలువలో బల్లకట్టు ఎక్కానొకనాడు. ఒకాయన నా ఎనకాల ఎక్కాడు... ఎక్కుతూ నా చెయ్యి పట్టుకోవటమే కాదు, జడ కూడా పట్టుకున్నాడు. అన్నదమ్ముళ్లిద్దరూ బల్లకట్టుపైన కూచున్నారు. ఇట్టే పట్టుకొని ఎత్తి కాల్వలో పడేశాను. ‘ఆడు చచ్చిపోయేట్టున్నాడే...’ అని చెప్పబోయాడొకడు...‘వాడికీ నీకూ చిండ పగిలిపోద్ది... భోషడీకే.. నా జడ పట్టుకొంటాడా...? నిన్ను కూడా పడేత్తాను’ అన్నా...! మారుమాట్లాడలేదు. ఆయన పడవలో ఉండేవాడు. ఎండ్రకాయలు, తాబేళ్లు కూడా పట్టి, తినేవాళ్లం. మద్రాస్‌ కాలవ ఈదేదాన్ని.

పాతికేళ్లలోపే ఆయన పోయాడు. మాకు అయిదుగురు పిల్లలు. తర్వాత నలుగురు కాలం చేశారు. ఇప్పుడు ఒక్కడే కొడుకు. కోడలు, మనుమసంతానం ఉన్నారు. పెళ్లయ్యాక ఇంటిదగ్గరే అందరికీ బువ్వ వండిపెట్టేదాన్ని. మా అత్త, ఆయన నన్ను పొలం పనికి పంపలేదు. బాగా చూసుకున్నారు నన్ను. ఏనాడూ దెబ్బకొట్టింది లేదాయన. ఒంటినిండా నగలే నాకు. బాగుండేదాన్ని. ఒకరోజున మంచాన పడుంటే ‘ఏంటయ్యా...అయిదుగురు పిల్లల్నిచ్చావ్‌... ఎట్టా బతకాల...?’ అంటే, ‘నువ్వు తెలివిగల్ల దానవే... ఎలాగైనా బతికేత్తవు’ అన్నాడు. నా మాటే నిజం అన్నట్టు పెందలాడే పోయాడు పెనిమిటి. ఆయన చచ్చాక అన్నీ పోయాయ్‌.

ఎవరి బతుకు వారే బతకాలంటాను నేను. ఆయన పోయినా ఉస్సూరుమని ఉరేసుకోలేదు. కాయకట్టం చేసి, పొలంపనులకు ఎల్లా. కొడుకు ఇంటో ఉండొచ్చుగానీ, ఓపిక ఉన్నంతవరకు ఒక్కతెనే ఉండాలనుకున్నా. కాలూచేయీ ఆడేంతవరకూ ఇంకొకరిపై ఎందుకు పడాలా? ఇంటి మెల్లాలో పాక వేసుకొని గడుపుతున్నా. నా తిండీ తిప్పలూ నావేనయ్యా. ఇప్పుడంటే కొంత ఓపిక తగ్గింది. ఊతకర్ర అవసరం లేదుగానీ, ఇదివరలా పొలంపనులకు ఎల్లటం లేదు గానీ, పరిగ ఏరుకుని నాలుగు డబ్బులు సంపాయిత్తనా. ఒక కన్ను చూపు కొంత మసక అనిపిత్తంది. ఇక ఏమీ పర్వాలేదు.

వంటల సంగతి అడిగారుగా... కూరలు చేయటం బాగా వచ్చు.  గుడ్డు అట్టు నుంచి రొయ్యల పలావ్,  మాంసం బిరియానీ, చేప బిరియానీ, పుచ్చకాయ బిర్యానీ, గుత్తి వంకాయ నుంచి ములక్కాయ పులుసు, కాకరకాయ వేపుడు... అన్నీ చేసేత్తా. నా మనవడు లక్ష్మణ, ఆయన సావాసగాడు శీనాధరెడ్డి కలిసి మా ఊరొత్తుంటారు. వచ్చినపుడల్లా మా ఇంటికి దగ్గర్లోని చేలపక్కన, రాళ్ల పొయ్యిల, కట్టెపుల్లలతో వంట చేయిస్తారు. ఏ వంటకైనా తగినన్ని సంబారాలు, దినుసులు వేయటం ముఖ్యం. సరిపోయేటంతగా ఉడికించుకుని దించేసుకుంటే రుచిగా ఉంటాది. అవన్నీ చెబుతూ వంటలు చేత్తుంటా. అవన్నీ నా మనవడు సినిమాలా తీత్తాడు. వాటిని గూగూల్‌ అంట... అందులో పెడుతున్నాం... లచ్చలమంది చూత్తన్నారని చెబుతున్నారు. కానుకలు వచ్చాయని తెచ్చి ఇత్తన్నారు. వాళ్ల సరదాని నేనెందుక్కాదనాలి అని వచ్చినపుడల్లా కూరలు, పలావులు చేత్తున్నా. ఇవన్నీ చెపుతుంటే సంతోసంగా ఉంది’’.

బీబీసీ ఛానల్‌లో కథనం..?
మా అవ్వ చేతిలో ఏ మహత్తు ఉందోగానీ, ఏ వంట చేసినా రుచికరంగా ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేనూ, మా స్నేహితుడు శ్రీనాథ్‌రెడ్డి ‘కంట్రీఫుడ్స్‌’ పేరుతో ఛానల్‌ను గతేడాది ఆగస్టులో ప్రారంభించాం. ఇద్దరూ వీడియో ఎడిటర్లుగా చేస్తున్నాం. గుడివాడ రావటం, సంప్రదాయ పొయ్యిలో కట్టెపుల్లలతో రకరకాల వంటలు చేయించటం, వాటిని వీడియో తీసి, ఛానల్‌లో అప్‌లోడ్‌ చేస్తూ వస్తున్నాం. 40 వీడియోలను అప్‌లోడ్‌ చేశాం. మా ఛానల్‌కు 2.30 లక్షల సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. మొత్తంమీద 43 మిలియన్ల మంది మా అవ్వ చేతివంటను వీక్షించారు. బీబీసీ ఆన్‌లైన్‌లో అడిగిన ప్రశ్నావళికి సమాధానాలు, అవసరమైన వీడియో ఫుటేజిలు పంపాం. అతి త్వరలోనే ప్రసారం చేస్తారు. అవ్వచే వెజ్‌/నాన్‌వెజ్‌ పచ్చళ్లు తయారుచేయించి ఆన్‌లైన్‌లో అమ్మకాలకు ఏర్పాట్లు చేస్తున్నాం. – లక్ష్మణ్, మస్తానమ్మ మనుమడు


వంటల తయారీకి సహకరిస్తాం...
వంటకు కావాల్సిన సరంజామాను మేం సిద్ధం చేస్తాం. కూరగాయలు/ చికెన్‌/ మాంసం ముక్కలు కోయటం నుంచి మస్తానమ్మే స్వయంగా కూర తయారుచేస్తుంది. అన్నీ సమపాళ్లలో అమరాయో? లేదోనని రుచి చూస్తేగాని ఆమెకు తృప్తి అనిపించదు.
– అన్నమ్మ, రజని, కోడలు, మనుమరాలు

– బి.ఎల్‌. నారాయణ, సాక్షి, తెనాలి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement