![Indias First Private Woman Detective Rajani - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/15/BOSS.jpg.webp?itok=--n0aUWa)
ఈ రెండు నెలల్లో రజనీ ఎవరెవరి బ్యాక్‌గ్రౌండ్‌ను తవ్వుతున్నారో తెలుసు కునేందుకు ఆమెలా కొందరు గూఢచర్యం చేశారు కానీ.. రజనీ చిరునవ్వు నవ్వేందుకు తప్ప నోరు మెదపనేలేదు. చివరి విడత ఎన్నికల తర్వాత ఈ లేడీ బాండ్ తనకు అనువైన విశ్రాంతి విడిది కోసం రహస్యాన్వేషణ ప్రారంభించవచ్చు.
ఇంగ్లండ్ రచయిత్రి అగాథా క్రీస్టీ నవలల్లో ‘మిస్ మార్పుల్’ అనే కల్పిత పాత్ర ఉంటుంది. మిస్ మార్పుల్ పెద్దావిడ. అవివాహిత. ‘సెయింట్ మేరీ మీద్’ అనే గ్రామంలో నివసిస్తుంటుంది. అదీ కల్పిత గ్రామమే. మార్పుల్ గూఢచారి. తొలిసారి ఆమె పాత్ర లండన్ నుంచి వెలువడే ‘ది రాయల్ మ్యాగజీన్’ 1927 డిసెంబరు సంచికలో వచ్చిన ‘ది ట్యూస్డే నైట్ క్లబ్’ ఒక చిన్న కథలో కనిపిస్తుంది. తర్వాత 1930లో క్రీస్టీ రాసిన ‘ది మర్డర్ ఎట్ ద వికారేజ్’ నవలలో కీలకమైన పాత్రగా కథను నడిపిస్తుంది. క్రీస్టీ ఇప్పుడు లేరు. నాలుగు దశాబ్దాల క్రితమే చనిపోయారు. మిస్ మార్పుల్ ఇప్పటికీ ఉంది. బహుశా ఎప్పటికీ! ప్రస్తుతం మిస్ మార్పుల్.. మన దగ్గర రజనీ పండిత్ రూపంలో ముంబైలో ఉంది! భారతదేపు తొలితరం ప్రైవేట్ మహిళా డిటెక్టివ్ రజని.
అపరాధ పరిశోధనలో మాత్రమే కాదు, అంతుచిక్కని వ్యూహాలను ఛేదించడంలోనూ రజని ఎక్స్‌పర్ట్. ఎన్నో హత్యల్ని సాల్వ్ చేశారు. అపార్థాలతో నలిగిపోతున్న ఎందరో దంపతుల జీవితాలను చక్కబరిచారు. పేరున్న కంపెనీల్లో జరిగే విద్రోహాలను కనిపెట్టారు. ఇవన్నీ చేయడం కోసం ఆమె అనేక వేషాలు వేశారు. పనిమనిషిగా, చూపులేని మనిషిగా, గర్భిణిగా, మందమతిగా.. ఇలా అనేకం. అన్నీ కూడా తెర వెనుక ఉన్నదానిని, జరుగుతున్నదానిని బయటికి లాగేందుకే. కొన్నిసార్లు పరిస్థితులు ప్రాణాంతకం అయ్యేవి. అయినా ఆమె ధైర్యం వీడలేదు. ధైర్యం కాదు. తెగింపు అది. మిస్ మార్పుల్ లానే రజనీ కూడా అవివాహితగానే ఉండిపోయారు.
ప్రస్తుతం ఆమెకు 57 ఏళ్లు. క్రీస్టీ పాత్ర మిస్ మార్పుల్‌తో రజనీని పోల్చడం ఎందుకంటే గూఢచర్యంలో ఆ పాత్రకు సరిసాటిగా రజనీ జీవితం నిరంతరం గుట్టు మట్లను వెలికి తీయడంలోనే గడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఇంకా బిజీ. ఎన్నికల స్కెడ్యూలు మొదలైనప్పటి నుంచీ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల గురించి ఆరా తియ్యడానికీ, ఆ అభ్యర్థులకు పోటీగా నిలబడిన ప్రత్యర్థుల బలాలను, బలహీనతలను కూపీ లాగడానికి రజనీని ఆశ్రయిస్తూనే ఉన్నాయి. చివరి దశ ఎన్నికల పోలింగ్.. వచ్చే ఆదివారంతో పూర్తవుతోంది కనుక రజనీ తయారు చేయబోయే రసహ్య నివేదికలు కూడా ఈ ఒకటీ రెండ్రోజుల్లో ఒక కొలిక్కి వచ్చేస్తాయి. ‘‘ఆ తర్వాత కొంతకాలం ఏదైనా ఒక అజ్ఞాత ప్రదేశంలో ఏకాంతంగా గడిపేందుకు వెళ్లొస్తాను’’ అంటున్నారు రజనీ పండిత్.
Comments
Please login to add a commentAdd a comment